కాస్త ఆగుదాం

పండుగలంటే మనకి కొత్త ప్రారంభాలే! అందుకే ప్రతిదీ కొత్తగా కొనాలని ప్రయత్నిస్తుంటాం. కేవలం దుస్తులు, పూజ సామగ్రికే పరిమితం అవుతామా ఏంటి? దీపాలు, డెకార్‌ అంటూ జాబితాలోకి చేరేవి ఎన్నని? పైగా ఆకర్షించే ఆఫర్లు ఈ సమయంలోనే వచ్చేస్తాయి.

Eenadu icon
By Vasundhara Team Published : 12 Oct 2026 01:10 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

పండుగలు అంటేనే సందడి. దానికి తగ్గట్టు షాపింగులు సరేసరి. దుస్తుల దగ్గర్నుంచి మొదలవుతుంది. బడ్జెట్‌ని పెంచుతూ జాబితా పెరుగుతూ పోతుంది. కానీ.. ఆగండి. నిజంగా అవి అవసరమేనా?

పండుగలంటే మనకి కొత్త ప్రారంభాలే! అందుకే ప్రతిదీ కొత్తగా కొనాలని ప్రయత్నిస్తుంటాం. కేవలం దుస్తులు, పూజ సామగ్రికే పరిమితం అవుతామా ఏంటి? దీపాలు, డెకార్‌ అంటూ జాబితాలోకి చేరేవి ఎన్నని? పైగా ఆకర్షించే ఆఫర్లు ఈ సమయంలోనే వచ్చేస్తాయి. భారీ డిస్కౌంట్లు, తక్కువ ధరకే దొరుకుతుంటాయి. తరవాత మళ్లీ దొరుకుతాయో లేదో ఈ ఆఫర్‌ మళ్లీ వస్తుందో లేదోనన్న భయం. ఇంకేం, చకచకా కార్టులోకి కొట్టేస్తాం. ఇవి చాలవన్నట్లు సోషల్‌మీడియా తెరిస్తే చాలు. ‘మా ఇంటి పూజకి ఇవి కొన్నాను’, దీంతో పని సులువంటూ దొరికే సలహాలు బోలెడు. కొత్తగా కనిపిస్తూ, పని సులువు చేస్తోంటే మనసు మనకీ అవసరమే అని సలహానిస్తుంది. అలా అవీ ఇంటికి చేరతాయి. షాపింగ్‌ చేస్తోంటే మనసుకు ఆనందం. డోపమైన్‌ మాయ! అదింకా విడుదలవుతుంది. కొనేలా ప్రేరేపిస్తుంది. ఇక, పక్కవారితో పోలికలు సరేసరి. వెరసి, మనం గమనించేలోగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.

ఏమా నష్టం?

ఇలా కొంటూ పోవడం వల్ల ముందు బడ్జెట్‌కి గండిపడుతుంది. తరవాతి నెలల్లో ఇబ్బందులు పడాలి. ఆరోజు ఇంటిని అందంగా తీర్చిదిద్దాలని ఏవేవో కొంటాం. అవన్నీ చేరేది చాలావరకూ చెత్తలోకే! దీనివల్ల పర్యావరణానికి నష్టం. వీటిలో చాలావరకూ రీసైక్లింగ్‌ కూడా కావు. పోనీ మళ్లీ మళ్లీ వాడేవే కొన్నారనుకున్నా... ఏటా ఏదో ఒకటి కొత్తది చేరుతోంటే ఇల్లు నిండటం మినహా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అదీ ఒత్తిడికి కారణమవుతుంది. అన్నీ చకచకా అవుతున్నాయని ఫీలవుతాం కానీ... ఈ క్రమంలో పిల్లల సాయం తీసుకోవడం, కలిసి పనిచేయడం వంటి అనుభూతులన్నీ దూరమవుతాయి.

కాబట్టి...

  • కొనేముందు ఇంట్లో ఏమున్నాయో చెక్‌ చేయండి. మరీ అత్యవసరం అంటే తప్ప కొనొద్దు. ఏదైనా నచ్చితే ఒకరోజంతా ఆగండి. తరవాతా కావాలనిపిస్తేనే కొనాలి.
  • తరవాత పనికొస్తాయని ఇల్లంతా నింపుతూ పోవద్దు. ఒకటి కొంటున్నామంటే పాతది పక్కకి వెళ్లాల్సిందే. తీసేయండి లేదంటే ఎవరికైనా ఇచ్చేయండి. తరవాతే కొనండి.
  • మనం పండుగ చేసుకునేది మనకోసం, మనవాళ్లకోసం. ఎవరికోసమో ఎవరినో మెప్పించాలనో అనవసర ఖర్చులు పెట్టొద్దు. ముందు ఇంట్లో ఏమున్నాయో చూసుకోండి. వాటినే కొత్తగా ఎలా ఉపయోగించొచ్చో ఆలోచించండి. ఇంట్లోవాళ్లనీ భాగం చేస్తే కొత్త ఆలోచనలు బోలెడొస్తాయి.
  • గతంలో చక్కగా ఉన్నదాంట్లోనే ఇంటిని తీర్చిదిద్దుకునేవారు. మీరూ అలాగే ప్రయత్నించండి. సహజంగా తాజాపూలు, ఆకులతో ఎలా చేసుకోవచ్చో ఆలోచించండి. ‘జీరో వేస్ట్‌’ లక్ష్యంగా ప్రయత్నించండి. మీ సృజనాత్మకత బయటపడటమేనా? ప్రకృతికీ మేలు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :