
రష్మీ వచ్చాక మార్పు మొదలైంది!
పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలతోపాటు సిబ్బందిలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు సాధన రష్మీ పెరుమాళ్. తొమ్మిది నెలల కాలంలో భిన్న కార్యక్రమాలెన్నో చేపట్టి, అందరి మన్ననలూపొందుతున్నారు. ఆ విశేషాలు ఏంటంటే...

- A
- A+
- A++

పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలతోపాటు సిబ్బందిలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు సాధన రష్మీ పెరుమాళ్. తొమ్మిది నెలల కాలంలో భిన్న కార్యక్రమాలెన్నో చేపట్టి, అందరి మన్ననలూపొందుతున్నారు. ఆ విశేషాలు ఏంటంటే...
రోడ్డు ప్రమాదాలు, నేరాల నియంత్రణ లక్ష్యంగా ‘సిద్దిపేట సురక్షనేత్ర’ పేరిట కమిషనరేట్ పరిధిలోని అన్ని ఆవాసాల్లో సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 3 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. నిరుపయోగంగా మారిన వెయ్యి కెమెరాలను వినియోగంలోకి తెచ్చారు.
మహిళల భద్రతే లక్ష్యంగా...
జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా రాష్ట్రంలోనే మొదటగా షీ-సేఫ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారులకు సమీపంలోని కొన్ని హోటళ్లు, ఇతరత్రా ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని షీ- సేఫ్జోన్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. వీటిని పక్కాగా పాటించే ప్రదేశాలను మాత్రమే సేఫ్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సురక్షితమని ప్రకటించే హోటళ్లలో అన్ని మూలలూ కవర్ చేసేలా సీసీ కెమెరాలు బిగించుకోవాలని నిర్దేశిస్తున్నారు. వీటిని కమాండ్ కంట్రోల్కు కనెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఆయా హోటళ్లు, దాబాలు, రెస్టరంట్లలో పనిచేసే కార్మికులు, సిబ్బంది నేరచరిత్ర లేనివారై ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 50కిపైగా ఎంపిక చేశారు.
నిరుద్యోగుల కోసం...
ఉన్నత చదువులు చదివిన యువత... ఉద్యోగావకాశాలు లేక సమయాన్ని వృథా చేస్తున్న తీరు గుర్తించి, ఉద్యోగమేళా నిర్వహించారు. సుమారు 600 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ‘సిద్దిపేట ఉద్యోగమిత్ర’ పేరిట యాప్ను రూపొందించి వివిధ కంపెనీలతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ఎంవోయూ కుదుర్చుకున్నారు. యువత నేరుగా పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకుని అనువైన కంపెనీలలో ఉద్యోగం చేసుకునేలా అవకాశం కల్పించారు.
సమీక్షిస్తూ... ప్రశంసిస్తూ
క్షేత్రస్థాయిలో మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించి ‘సీపీ-కనెక్ట్’ పేరిట అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు. అధికారుల్లో నైపుణ్యాల అభివృద్ధికి ‘ప్రాజెక్టు సిద్ది’ పేరిట శారీరక, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. యోగ, ధ్యానం, కరాటే... వంటి వాటితోపాటు మహిళా కానిస్టేబుళ్లకు మోటార్ వాహనాల డ్రైవింగ్లోనూ తర్ఫీదు ఇప్పిస్తున్నారు.
ప్రజలతో మమేకం అయ్యేలా...
పోలీసులు ప్రజల భద్రతకోసం పనిచేస్తున్నారనే నమ్మకం కల్పించేందుకు ‘మన ఊరు-మన పోలీసు’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరంగా ఎదురవుతోన్న సమస్యలను గుర్తించి ప్రజల సమక్షంలోనే పరిష్కరిస్తున్నారు. యువత కోసం గ్రంథాలయం, వాలీబాల్, క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ముందు జాగ్రత్తతోనే...
తిరుపతికి చెందిన రష్మీ, బాల్యం నుంచే ఐఏఎస్ అధికారి కావాలనే సంకల్పంతో శ్రమించారు. బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేసి ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించారు. పక్కా ప్రణాళికతో ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చంటారామె. నేరాలు జరిగాక చర్యలు చేపట్టడం కన్నా జరగకుండా మార్పు తీసుకురావడమే ముఖ్యమంటారు. పోలీసు ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మెయిన్స్తో పాటు శారీరక శిక్షణిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రం ముట్టడికి దళితసంఘాలు, కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా బందోబస్తు నిర్వహించి, ప్రశాంతంగా కార్యక్రమం ముగిసేలా చూశారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మహిళల జీవితాలు మారిపోవు. వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు, సొంత సంపాదనకు దారులు చూపించినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :