అమెరికాలో మన మహిళామణులు
అమెరికాలో భారతీయుల విజయగాథల్ని తరచూ వింటుంటాం. వాళ్లలో పురుషులే ఎక్కువ. అందుకే, శక్తిమంతమైన ఇండియన్-అమెరికన్ మహిళా నాయకురాళ్ల గురించి ఓ పుస్తకం రాశానంటారు కామిని రమణి. ఈమె కూడా భారతీయ-అమెరికన్. 42 ఏళ్లుగా సిలికాన్ వ్యాలీలో ఉంటున్నారు.

- A
- A+
- A++

అమెరికాలో భారతీయుల విజయగాథల్ని తరచూ వింటుంటాం. వాళ్లలో పురుషులే ఎక్కువ. అందుకే, శక్తిమంతమైన ఇండియన్-అమెరికన్ మహిళా నాయకురాళ్ల గురించి ఓ పుస్తకం రాశానంటారు కామిని రమణి. ఈమె కూడా భారతీయ-అమెరికన్. 42 ఏళ్లుగా సిలికాన్ వ్యాలీలో ఉంటున్నారు. ‘లోటస్ లీడర్షిప్: మోడర్న్ ప్లేబుక్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్’ పేరుతో ఈ పుస్తకం తెచ్చారు. దీన్లో అమెరికా కార్పొరేట్ రంగంలో ముద్ర వేసిన 30 మంది భారతీయ-అమెరికన్ మహిళా విజేతల గురించి రాశారు. మరో ముగ్గురు భారతీయేతర మహిళలకూ అందులో చోటిచ్చారు.
పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయీ, యేల్ యూనివర్సిటీ ఆస్ట్రానమీ విభాగ ఛైర్గా ఉన్న ప్రియంవద నటరాజన్, జూమ్ మాజీ సీవోవో- ప్రస్తుత ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అపర్ణ బజ్వా, పాలో ఆల్టో నెట్వర్క్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీరా రాజావేల్, అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు లతాకృష్ణన్... వీళ్లందరూ ఈ పుస్తకంలో చోటు సంపాదించారు. ‘భారతీయ అమెరికన్ల విజయాలను చెప్పాలంటే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వాళ్లనే ఉదహరిస్తాం. ఇంద్రా నూయి లాంటి కొద్ది మందిని మినహాయిస్తే ఇక్కడ చాలామంది విజయవంతమైన మహిళలు ఉన్నారనే విషయం గురించి పెద్దగా తెలీదు. వాళ్ల గురించి చెప్పాలనుకున్నా.
పుస్తకంలోని చాలామంది విజేతలు తాము చిన్నప్పుడు శివుడు, శక్తి, పార్వతి, సరస్వతి, లక్ష్మి... వీళ్ల గురించి విన్న కథలే జీవితంలో ఎదగడానికి స్ఫూర్తి అని చెప్పారు. అందుకే ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టా’ అంటారు రమణి. ప్రధానంగా కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాల గురించి ప్రశ్నలు అడిగారు రమణి. యువతరం వాటిని చదివితే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎలా పైకి వెళ్లొచ్చో అర్థమవుతుందని చెబుతారామె. ముంబయిలో పుట్టి పెరిగిన రమణి స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్లకు సలహాదారుగా, వెంచర్ క్యాపిటల్ సంస్థ మేఫీల్డ్ ఫండ్కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేశారు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 02:34 IST