నగుమోము చూడాలని!

పెన్సిల్‌ తిన్నగా పట్టుకోవడమైనా రాదు... ఆ పిచ్చి గీతల్లోనూ ఎన్నెన్ని బొమ్మలు చూపేవాళ్లమో! నెమ్మదిగా పిట్ట, ఇల్లు, హరివిల్లు అని మొదలుపెట్టి... మన సృజనాత్మకతకి రెక్కలిచ్చేవాళ్లం. ఆ అందమైన ఊహాలోకం తరవాత హాబీ, టైమ్‌పాస్‌గా మారి... ఎప్పుడు కనుమరుగవుతోందో కూడా తెలీదు.

Eenadu icon
By Vasundhara Team Published : 25 Feb 2026 02:50 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

పెన్సిల్‌ తిన్నగా పట్టుకోవడమైనా రాదు... ఆ పిచ్చి గీతల్లోనూ ఎన్నెన్ని బొమ్మలు చూపేవాళ్లమో! నెమ్మదిగా పిట్ట, ఇల్లు, హరివిల్లు అని మొదలుపెట్టి... మన సృజనాత్మకతకి రెక్కలిచ్చేవాళ్లం. ఆ అందమైన ఊహాలోకం తరవాత హాబీ, టైమ్‌పాస్‌గా మారి... ఎప్పుడు కనుమరుగవుతోందో కూడా తెలీదు.చాగంటి సాధనకీ ఇది అనుభవమే! అందుకే చిన్ననాటి ఆ అనుభూతిని ‘నగుమోము’తో అందరికీ తిరిగి పరిచయం చేస్తూ ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారారీమె. అదెలాగో మనతో పంచుకున్నారిలా...

మాది హైదరాబాద్‌. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే నాకెంతో ఇష్టం. కానీ, పెద్దయ్యాక... చదువు, కెరియర్‌లే నా ప్రాధాన్యం అయిపోయాయి. మధ్యతరగతి కుటుంబం కదా! నాన్న లేకపోవడంతో అమ్మ ఇంకా గట్టిగా నా చదువు మీద దృష్టిపెట్టారు. ఏ ఇబ్బందీ లేకుండా త్వరగా సెటిల్‌ అవ్వాలనేది ఆవిడ తాపత్రయం. అందుకే, నేను మొదట డాక్టర్‌ కావాలనుకున్నా. ఆపై బ్యాచిలర్స్, మాస్టర్స్, యూపీఎస్సీ ప్రిపరేషన్‌... ఇలా సాగిపోయా. చదువుల్లో టాపర్‌గా అమ్మని సంతోషపెట్టాను. కానీ, నేను మాత్రం సంతోషంగా ఉండలేకపోయాను. ఒక్కసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే... నా సంతోషం ఆర్ట్‌లోనే ఉందనిపించింది. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో పీజీ, పీహెచ్‌డీ చేశా. ప్రస్తుతం ఇండో-జర్మన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌లో క్లైమేట్‌ ఛేంజ్‌ అడ్వైజర్‌గానూ పనిచేస్తున్నా. 

ప్రజలకు చేర్చాలనే... 

ఈ రోజుల్లో ఆర్ట్‌ అంటే అక్రిలిక్స్, డిజిటల్‌.. డిజైన్లు మాత్రమే అనుకునే పరిస్థితి. ప్రకృతికి హాని చేయని హస్తకళలకు ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా లక్ష్యం. అందుకే ‘నగుమోము’ని స్థాపించి ప్రజల్లో సస్టైనబుల్‌ ఆర్ట్స్‌పై అవగాహన కల్పిస్తున్నా. ప్రధానంగా కలంకారీ, చెరియల్, బాతిక్‌... వంటి భారతీయ సంప్రదాయ హస్తకళలకు పూర్వ వైభవాన్ని తేవాలనేది నా కోరిక. గ్రామీణ కళాకారులకు, ముఖ్యంగా మహిళలకు ఆదాయం కల్పించడం, వీధికుక్కలకోసం నిధులు సేకరించడం... వంటివెన్నో చేస్తున్నా. ఇందుకోసం కళాకారులు, స్వచ్ఛంద, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. 

నిపుణుల సాయంతో...

పట్టణ, నగర ప్రాంతాల్లో మా నగుమోము నిర్వహించే వర్క్‌షాప్‌ల కోసం ఆయా కళలకు ప్రసిద్ధమైన ప్రాంతాల నుంచి మెటీరియల్స్‌ తెప్పిస్తూనే, అందులో నిపుణులైన కళాకారులను రప్పిస్తాం. మా వర్క్‌షాప్‌కి హాజరైన ఔత్సాహికులు... ఏంటి? ఇక్కడ రంగులూ, బ్రష్‌లూ లేవు. పేపర్‌ ఇవ్వలేదు... ఆర్ట్‌ ఎలా వేయాలని అడుగుతారు. కానీ, తర్వాత చింతగింజల పొడితో బొమ్మలు వేయడం, పాలల్లో ముంచిన వస్త్రం మీద రస్టెడ్‌ ఐరన్‌తో పెయింటింగ్‌ వేయడం చూసి ఆశ్చర్యపోతుంటారు. ఆ ఆశ్చర్యమే నా విజయం. ఈ కళలు మ్యూజియంలో కాదు, మన జీవితాల్లో ఉండాలి. యువతులు, మహిళా కళాకారిణులు, పిల్లలు.. ఇలా అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తాను. కాఫీషాప్‌లు, రిక్రియేషన్‌ కమ్యూనిటీలు, కల్చరల్‌ క్లబ్స్, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్స్‌లు... ఇలా ఒకటేమిటి ఎక్కడ వేదిక ఉన్నా... ఈ కళల్ని నేర్పించడానికి ప్రయత్నిస్తా. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో వందల మంది ఔత్సాహికులకు నేర్పించగలిగా. తాజాగా జరిగిన ఇంటర్నేషనల్‌ యూత్‌ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్‌లోనూ వర్క్‌షాప్‌ నిర్వహించా. 

కష్టాలెన్నో దాటి... 

ఈ ప్రయాణంలో కష్టాలు లేకపోలేదు. మెటీరియల్స్‌ 21 రోజుల ముందు నుంచే ప్రిపేర్‌ చేయాలి. కళ అసలు స్వరూపం మార్చకుండా నేర్పించాలి. ఈజీ అక్రిలిక్స్‌కి అలవాటు పడిపోయారు కాబట్టి ప్రజల మైండ్‌సెట్‌ మార్చాలి. ఓ పక్క పీహెచ్‌డీ, మరో పక్క కెరియర్‌నీ సమన్వయం చేసుకుంటూ ఈ అభిరుచినీ కొనసాగించడం అంత సులువేం కాదు. నా కుటుంబ సహకారంతోనే చేయగలుగుతున్నా. ఎవరైనా ఒకరు బాగుందండీ, థ్యాంక్స్‌ అని చెప్పినప్పుడు... ఆ కష్టమంతా మర్చిపోతాను. ఈ రోజుల్లో పని ఒత్తిడి, జీవనశైలి... కారణం ఏదైనా చాలామంది ముఖాలపై చిరునవ్వు కనిపించడం లేదు. ఈ కళ ద్వారా అందరినీ నగుమోముతో చూడాలనుకుంటున్నా.

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సాప్‌ ద్వారా పంపవచ్చు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :