బాలేన్‌ కుర్చీ కిందకు నీళ్లు!

Eenadu icon
By Editorial Team Published : 10 Jun 2026 00:50 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ప్రజా ఉద్యమాలతో ఎదిగి, కాఠ్‌మాండూ మేయర్‌ స్థాయి నుంచి ఒకేసారి నేపాల్‌ ప్రధాని హోదాను అందుకున్న యువ నాయకుడు, ర్యాపర్‌ బాలేంద్ర షా(బాలేన్‌ షా) ఇప్పుడు తాను కూర్చున్న కుర్చీ కిందకే నీళ్లు తెచ్చుకుంటున్నారు. భారతదేశంతో దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలేన్‌పై నేపాల్‌ విపక్షాలూ, విద్యార్థి సంఘాలూ, మీడియా ఏకబిగిన విమర్శలు గుప్పిస్తున్నాయి.

సాధారణంగా ఏ దేశ ప్రధాని అయినా అంతర్జాతీయ సరిహద్దు వివాదాల విషయంలో తమ దేశం అనుసరిస్తున్న వైఖరినే సమర్థించుకుంటారు. నేపాల్‌ ప్రధాని బాలేన్‌ షా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. భారత్‌-నేపాల్‌ సరిహద్దు వివాదం ఏకపక్షం కాదనీ, పలుచోట్ల నేపాల్‌ సైతం భారత భూభాగంలోకి చొచ్చుకెళ్లిందంటూ పార్లమెంటులో ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, కాళీ నదికి సంబంధించి బ్రిటిష్‌ హయాము నాటి మ్యాప్‌లను పరిశీలించాలనీ, అవసరమైతే ఈ విషయంలో బ్రిటన్‌ మధ్యవర్తిత్వాన్ని కోరాలని సూచించారు. ఇది ఒకవైపు భారతదేశాన్ని సమర్థిస్తున్నట్లుగా, మరోవైపు బ్రిటిష్‌ ఆధిపత్యానికి తలొగ్గుతున్నట్లుగా కనిపించడంతో- ఇదంతా నేపాల్‌ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడమేనంటూ అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి.

వెల్లువెత్తిన ప్రజాగ్రహం

షా వ్యాఖ్యలతో కాఠ్‌మాండూలో విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. విద్యార్థి నాయకులు రోడ్ల మీదకు వచ్చి ప్రధాని దేశ వ్యతిరేక ప్రకటనలు చేశారంటూ మండి పడ్డారు. ప్రధాని రాజీనామా చేయాలని పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు గట్టిగా డిమాండు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి.

కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్‌ తన అధికారిక మ్యాప్‌లో భారతదేశానికి చెందిన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర లాంటి ప్రాంతాలను చేరుస్తూ సవరణలు చేసింది. అయితే, ఆ ప్రాంతాలన్నీ ఇండియావేనని, నేపాలే వాటిలోకి చొచ్చుకెళ్లిందని బాలేన్‌ వ్యాఖ్యానించడం అక్కడి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. నిజానికి భారత్, నేపాల్, చైనా సరిహద్దులు కలిసేచోట సుమారు 370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్‌ పాస్, లింపియాధుర ప్రాంతాలతో ఈ వివాదం ముడిపడి ఉంది. 1816లో ఈస్టిండియా కంపెనీ, నేపాల్‌ రాజుల మధ్య జరిగిన ‘సుగౌలి ఒప్పందం’ ప్రకారం కాళీ నదిని సరిహద్దుగా నిర్ణయించారు. అయితే ఆ నది జన్మస్థానంపై భారత్‌-నేపాల్‌ మధ్య వివాదం నలుగుతోంది. లింపియాధుర దగ్గర నది పుట్టిందని, అందువల్ల కాలాపానీ తమదేనన్నది నేపాల్‌ వాదన. భారత్‌ మాత్రం చారిత్రక ఆధారాలు, అడ్మినిస్ట్రేటివ్‌ రికార్డుల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌ జిల్లాలోని కొండల్లో ఆ నది పుట్టిందని ఘంటాపథంగా చెబుతోంది. చైనా సరిహద్దు సైతం ఉండటంతో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారతదేశానికి చాలా కీలకమైనది.

బాలేన్‌ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపడంతో నేపాల్‌ విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. సరిహద్దుల్లోని ‘నోమాన్స్‌ ల్యాండ్‌’లో జరుగుతున్న ఆక్రమణల గురించే ప్రధాని మాట్లాడారు తప్ప, ప్రధాన భూభాగాల గురించి కాదంటూ వివరణ ఇచ్చింది. నదుల ప్రవాహం మారడం వల్ల సరిహద్దుల్లో తలెత్తే సమస్యలను ఆయన ప్రస్తావించారనంటూ సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. తాజాగా భారత్‌లో పర్యటించిన నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ ఏమో వేరే మాట చెప్పారు. పరస్పర గౌరవంతో కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారంకాని సమస్య ఏదీ ఉండదని అంటూనే... కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతంలోని భూమి తమదేనని చెప్పారు. నేపాల్‌ సమ్మతి లేకుండా భారత్, చైనాలు ఆ ప్రాంతంపై ఒప్పందం చేసుకోలేవని ఉద్ఘాటించారు. అదే సమయంలో ప్రపంచ వేదికపై వేగంగా ఎదుగుతున్న ఇండియాతో కలిసి పనిచేయడానికి తాము ఎదురు చూస్తున్నట్లు శిశిర్‌ ఖనాల్‌ పేర్కొనడం గమనార్హం.

భారత్‌ వైఖరి సుస్పష్టం

తాజా పరిణామాల నేపథ్యంలో- సరిహద్దు వివాదాలన్నవి ఎప్పుడూ ద్వైపాక్షిక అంశాలేనని, వీటిలో మూడో పక్షం జోక్యానికి తావులేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ కుండ బద్దలుకొట్టింది. దౌత్యమార్గాల్లోనే చర్చలు జరుగుతాయని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. బాలేన్‌ షా మార్పు కోరుకునే యువకుడిగా నేపాల్‌లో అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. కానీ, ప్రధాని అయిన కొద్ది నెలల్లోనే ఇంతటి తీవ్రమైన నిరసనలను ఎదుర్కోవాల్సి రావడం ఆయన రాజకీయ పరిణతికి పరీక్షలా మారింది. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాల్లో ఆచితూచి వ్యవహరించకపోతే, ఆ వేడి తన సొంతకుర్చీనే దహించివేసే ప్రమాదం ఉంటుంది. భారతదేశంతో మైత్రిని కాపాడుకుంటూనే, స్వదేశంలో జాతీయవాదాన్ని సంతృప్తిపరచడం ఇప్పుడు బాలేన్‌ ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుత సమస్య త్వరగా చల్లారుతుందా, లేదంటే నేపాల్‌ రాజకీయాల్లో మరో సంక్షోభానికి దారితీస్తుందా అన్నది వేచిచూడాలి.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.