స్వతంత్ర భారతంలో సరికొత్త అధ్యాయం!

- A
- A+
- A++

స్వతంత్ర భారతంలో ఈరోజు ప్రత్యేకమైనది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఒక విషయంలో అధిగమించి కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం నిర్విరామ సేవలు అందించిన నాయకుడిగా ఇంతవరకు నెహ్రూ పేరిట ఉన్న ఘనతను మోదీ తిరగ రాస్తున్నారు. ఇది నిస్సందేహంగా చరిత్రాత్మక మైలురాయే. మోదీ పదవీకాలం నెహ్రూ కంటే ఎక్కువగా ఉండటమనేది కేవలం సంఖ్యాపరమైన రికార్డు కాదు; మోదీ హయాములోనే స్వతంత్ర భారతం సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి.

ప్రపంచమంతా గుర్తిస్తోంది...
ఇక రాజకీయ విధానాలకు వస్తే, 1949 నవంబర్ 25న రాజ్యాంగ పరిషత్ ముగింపు ఉపన్యాసంలో డాక్టర్ అంబేడ్కర్ ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. 2,500 సంవత్సరాలకు పూర్వం బౌద్ధ సంఘాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణాలు ఉండేవనీ, ఆ సంఘాలు ఆనాటి రాజకీయ సంస్థల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులను స్వీకరించి, అవలంబించి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ, స్వతంత్ర భారత పాలకులు మన ప్రజాస్వామ్యానికి పాశ్చాత్య దేశాలే మూలమనే వాదనను విద్యార్థులు, న్యాయకోవిదులపై రుద్దారు. ఇక ఇప్పుడు భారతదేశమే ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై చాటిచెబుతున్నారు. భారతదేశ ప్రాచీన ప్రజాస్వామ్య నైతికతను, పద్ధతులను ప్రస్తావిస్తున్నారు. మన దేశం అత్యంత ప్రాచీనమైనది మాత్రమే కాదనీ, అత్యంత పెద్దది, అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమనే వాస్తవాన్ని ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది.
దేశంలో ఎన్నికల సంక్లిష్టత అంతకంతకు పెరుగుతోంది. 1951-52 సాధారణ ఎన్నికల్లో కేవలం 53 రాజకీయ పార్టీలే తలపడ్డాయి. 2024కు వచ్చేసరికి ఏకంగా 744 పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. నెహ్రూ హయాముతో పోలిస్తే ప్రజల ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి. వాటిని నెరవేర్చడం, ప్రజలతో బలమైన విశ్వాస బంధాన్ని నిలుపుకోవడం ప్రధాని మోదీ సాధించిన అసాధారణ విజయం. నెహ్రూ పదవీకాలం చివరిదశలో ప్రజాదరణను కోల్పోవాల్సి రాగా, మోదీ ప్రజాదరణ రేటింగ్‌లు మాత్రం స్థిరంగా అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాయి. 1950వ దశకం నుంచి 1970ల వరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అనేకమంది నాయకులు సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. 21వ శతాబ్దం వచ్చేసరికి నాయకులు పదవిలో స్వల్పకాలం మాత్రమే నిలిచే ధోరణి కనిపిస్తోంది. అయితే, దీనికి మోదీ మినహాయింపుగా నిలుస్తున్నారు.
ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేని ఏ జాతీ బలంగా, గౌరవప్రదంగా ఎదగలేదన్నది అక్షర సత్యం. భారత్ అనేక శతాబ్దాలపాటు నాగరికత, సాంస్కృతిక రంగాల్లో గొప్ప వైభవ, ప్రాభవాలతో వెలిగింది. అటు తరవాత వలస పాలకుల వల్ల కలిగిన న్యూనతా భావపు విషపునీడ స్వాతంత్య్రం వచ్చినాసరే సుదీర్ఘకాలం కొనసాగింది. థామస్ బాబింగ్టన్ మెకాలే ఆలోచనలనూ లక్ష్యాలనూ ఒంటబట్టించుకున్న అల్పసంఖ్యాక ఉన్నతవర్గం భారతీయులపై పెత్తనం చలాయించింది. నెహ్రూ హయాము, ఆ తదుపరి కాలంలో భారతీయతకు సంబంధించిన చాలా విషయాల పట్ల ఉన్నత వర్గాల్లో ఒక రకమైన సంకోచం, ఇబ్బంది కనిపించేది. భారతీయ భాషల్లో మాట్లాడేవారిని వారు తక్కువగా చూసేవారు. విదేశీ సిద్ధాంతాలు, పద్ధతులకు పట్టం కట్టి ప్రాచీన భారతీయ సంప్రదాయాలను, సాంస్కృతిక ఆచారాలను, ప్రతీకలను విస్మరించారు. దాంతో మన జాతిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత కొరవడ్డాయి. ఇలాంటి పరిస్థితిని సరిదిద్దడానికి ప్రధాని మోదీ భారతీయ భాషలను, వ్యవస్థలను, చిహ్నాలను, నమ్మకాలను అగ్రభాగాన నిలిపారు. నేడు మనవాళ్లు భారతీయులమని సగర్వంగా చెప్పుకొంటున్నారు. నేను పలు దేశాలను సందర్శించినప్పుడు చాలామంది భారత సంతతి ప్రజలు తమలో కొత్తగా ఉప్పొంగుతున్న గర్వాభిమానాలను నాతో పంచుకున్నారు.
నాటికీ, నేటికీ ఎంత తేడా!
భారతీయులు 2035 నాటికి మానసిక వలసవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందాలని నిరుడు ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ ఎలుగెత్తి చాటారు. మెకాలే వారసత్వంలో పాతుకుపోయిన వలసవాద మనస్తత్వాన్ని పదేళ్లలో వదిలించుకుంటామని జాతీయ స్థాయిలో ప్రతిన పూనాల్సిందిగా ఆయన ప్రజలకు పిలుపిచ్చారు. భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో నూతన అభివృద్ధి నమూనాగా ఎదుగుతోందని ఆయన ఉద్ఘాటించారు.
స్వాతంత్య్రానంతరం మొదటి దశాబ్దంలో పరిణామం చెందిన భారతదేశానికీ, గత 12 ఏళ్లలో సాధించిన రూపాంతరీకరణకూ మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది. నెహ్రూ హయాములో భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా పాశ్చాత్య దేశాల సాయాన్నీ, ఆమోదాన్నీ పొందడానికి ఆరాటపడింది. మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లను, అడ్డంకులను సైతం తట్టుకుని పురోగమించగలదనే నమ్మకం ఏర్పడింది. ఇక్కడ మాకు బంధువైన ఒక కుర్రాడి గురించి చెప్పాలి. అతడు వయసులో చిన్నవాడే కానీ చాలా విషయాలు తెలిసినవాడు. తన పరిణతిని, తన తరం ఆలోచనలను ప్రతిబింబించేలా ఒక మాట చెప్పాడు. మీరు నెహ్రూ ఇండియాలో పెరిగితే, తాను మోదీ భారత్‌లో పెరుగుతున్నానని వ్యాఖ్యానించాడు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.