justice: న్యాయ నిరాకరణా? నాశనమా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

‘న్యాయ రథచక్రాలు ఒక్కోసారి నెమ్మదిగా కదులుతుంటాయి’ అంటారు బ్రిటిష్ మానవ హక్కుల కార్యకర్త, రచయిత టెర్రీ వెయిట్. మన దేశంలోనైతే వాటికీ నత్తలకూ పోటీపెడితే- నిమ్మళంగా నడిచే ఆ గుల్లపురుగులే గమ్యానికి త్వరగా చేరతాయి! ఎక్కడో అరుదుగా కాదు- ప్రతిచోటా ప్రతిసారీ న్యాయ వితరణలో కంటే నత్త నడకలోనే వేగమెక్కువ అనే నిట్టూర్పులు జనంలోంచి వినపడుతుంటాయి. జీవించే హక్కులో అంతర్భాగమైన సత్వర న్యాయం సుదూర స్వప్నంగా మిగిలిపోతున్న దయనీయావస్థలో- మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా పరిణమిస్తుంటుందని సుప్రీంకోర్టు మూడేళ్ల క్రితం ఆవేదనాత్మకంగా వ్యాఖ్యానించింది. అందులో అతిశయోక్తి ఏమీ లేదని ధర్మోదేవి అనే ఓ అభాగ్యురాలి జీవితగాథ నిరూపిస్తుంది. సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసే ఆమె భర్త 1962 ఇండో-చైనా యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన భార్య ధర్మోదేవికి 1966 వరకు పింఛను ఇచ్చిన యంత్రాంగం ఆ తరవాత హఠాత్తుగా దాన్ని నిలిపేసింది. దానిపై ఆమె అదే ఏడాదిలో పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయిస్తే- పెన్షన్‌ను పునరుద్ధరించాలంటూ 2022లో తీర్పు వచ్చింది. 56 ఏళ్ల పాటు చట్టబద్ధమైన హక్కును కోల్పోయిన బాధితురాలికి దీంతో న్యాయం జరిగినట్లేనా? ‘లేదు’! ఎందుకంటే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల హెచ్చరించినట్లు- ‘న్యాయ వితరణలో ఆలస్యం కావడమంటే న్యాయాన్ని నిరాకరించడం మాత్రమే కాదు, నాశనం చేయడం కూడా’!
వ్యక్తిత్వాలకు అడుగడుగునా శల్యపరీక్షలు చేసే మన సమాజంలో అకారణంగా నింద మోస్తూ నాలుగు రోజులు బతకడమే కష్టం. అలాంటిది నలభై ఏళ్లుగా జనం కళ్లకు నేరగాడిగా కనపడాల్సి రావడమెంత దుర్భరం? తన నిర్దోషిత్వాన్ని గుర్తిస్తూ కోర్టు ఇచ్చే తీర్పుకోసం వందేళ్ల వయసులో కళ్లు కాయలుకాచేలా ఎదురుచూడటమెంత నరకం? ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ధనీరామ్ తన జీవన సంధ్యా సమయంలో ఈ వేదనంతా అనుభవించాడు. 1982 నాటి ఓ హత్య కేసులో అతను దోషి అని చెప్పి ట్రయల్ కోర్టు 1984లో జీవిత ఖైదు విధించింది. దానిపై ధనీరామ్ దాఖలు చేసిన అప్పీలుపై అలహాబాద్ హైకోర్టు కొద్దిరోజుల క్రితమే తీర్పిచ్చింది. ధనీరామ్ నిర్దోషి అని 42ఏళ్ల తరవాత తేల్చింది. న్యాయదేవత దయకు నోచుకునే సరికి కొంతమంది అమాయకుల జీవితాలు ఇలా తెల్లారిపోతుంటే- మరోవైపు, నిజంగా నేరాలు చేసినవారు దండనల నుంచి తప్పించుకుని పైలాపచ్చీసుగా బతికేస్తున్నారు. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో అదే 1982లో ఒక వ్యక్తి తన భార్యను చంపేశాడని కేసు నమోదైతే 1984లో ట్రయల్ కోర్టు దాన్ని కొట్టేసింది. దానిపై ప్రభుత్వం ఆనాడు అప్పీలుకు వెళ్తే, నిరుడు అక్టోబరులో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ వ్యక్తి హత్య చేశాడని నిర్ధారించిన హైకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. రెండు వారాల్లో లొంగిపొమ్మని ఆదేశాలిచ్చింది. 28 సంవత్సరాల ప్రాయంలో హేయ నేరానికి పాల్పడిన వ్యక్తికి 71 ఏళ్ల వయసులో శిక్ష పడిందంటే- అది దండన ఎలా అవుతుంది? 1997లో ఇరవై రూపాయలు లంచం తీసుకున్నాడని అహ్మదాబాద్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. 2004లో జిల్లా కోర్టులో అతనికి మూడేళ్ల శిక్ష పడింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన విచారణ తరవాత గుజరాత్ హైకోర్టు ఆ కానిస్టేబుల్‌ను మొన్న నాలుగో తేదీన నిర్దోషిగా ప్రకటించింది. తన జీవితంపై పడిన మరక తొలగిపోయిందంటూ భావోద్వేగానికి గురైన ఆ మాజీ పోలీసు ఆ రోజు రాత్రే కన్నుమూశాడు. కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ఇలా చెప్పుకొంటూ వెళ్తే దేశవ్యాప్తంగా ఎన్నెన్నో కేసులు... సంవత్సరాల తరబడిగా పేరుకుపోయిన ఆ వ్యాజ్యాల గుట్టల కింద రాజ్యాంగ నిర్దేశమైన సత్వర న్యాయ భావన నలిగిపోతోంది. నిస్సహాయ జనభారతం దాన్ని చూస్తూ, వ్యవస్థలపై విశ్వాసాన్ని హరించే నిర్వేదంలో మునిగిపోతోంది!

జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా కిందిస్థాయి కోర్టుల్లో 4.81 కోట్ల కేసులు మోక్షంకోసం ఎదురుచూస్తున్నాయి. హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 63.56 లక్షలకు చేరితే- సుప్రీంకోర్టులో అది దాదాపు 93వేలుగా లెక్కతేలుతోంది. అపరిష్కృత వ్యాజ్యాలు ఇంతగా పోగుపడటానికి న్యాయమూర్తులు కారణం కారని, వ్యవస్థలోనే లోపముందన్నది కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట! ఆ తప్పే ఎక్కడ ఎవరి వల్ల జరుగుతోంది? ఇందుకు సమాధానం- ‘ప్రభుత్వాధికారుల నియామకాలు చేపట్టినంతగా న్యాయమూర్తులను నియమించరు’ అన్న మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి విమర్శలో దొరుకుతుంది! అమెరికాలో ప్రతి పది లక్షల మందికి సగటున 150 మంది, యూరోప్‌లో 220 మంది జడ్జిలు పనిచేస్తున్నారు. చైనాలోనైతే మూడొందల మందికి పైగా ఉన్నారు. మరి మన పుణ్యభారతంలో? పది లక్షల జనాభాకు కనీసం యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్ ఎప్పుడో 1987లో సిఫార్సు చేస్తే- ఇప్పటికీ అందులో సగానికి కూడా చేరుకోలేదు మనం! ప్రస్తుతం ప్రతి పది లక్షల మంది భారతీయులకు 22 మంది న్యాయమూర్తులే అందుబాటులో ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీ నాటికి దేశీయంగా పాతిక హైకోర్టుల్లో మంజూరైన 847 జడ్జి పోస్టుల్లో 308 ఖాళీగా కనపడుతున్నాయి. కింది స్థాయి కోర్టుల్లో 25,895 మంది న్యాయాధికారులను నియమించాల్సి ఉంటే- 4867 పోస్టులు భర్తీ కాలేదు. దీనికితోడు మౌలిక సదుపాయాల కొరత, వాయిదాల సంస్కృతి వంటివి పెచ్చుమీరుతున్నప్పుడు ఇక వేగంగా న్యాయ నిర్ణయాలు ఎలా వెలువడుతాయి? పౌరహక్కులు సురక్షితమెలా అవుతాయి? ప్రజలందరికీ న్యాయం చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చిన నాయకులే దీనికి జవాబు చెప్పాలి!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :