నగరాల వెతలు తీర్చే మార్గమిదీ!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
భారతావని ప్రగతి రథాన్ని ముందుకు నడిపిస్తున్నవి నగరాలే. దేశ జీడీపీలో 63శాతం వాటినుంచే సమకూరుతోంది. వచ్చే పాతికేళ్లలో ఆ వాటా 75శాతం కానుందని అంచనా. స్టార్టప్‌లూ నవకల్పనలకు నెలవులుగా, లెక్కకుమిక్కిలి వ్యాపారాలకు ప్రధాన కేంద్రాలుగా వర్ధిల్లుతున్న నగరాలు పల్లెపట్టుల నుంచి ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. జోరందుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలూ వలసలకు తగినట్లే పట్టణభారతంలో నిర్మాణాలూ విపరీతమవుతున్నాయి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) తాజా అధ్యయనం ప్రకారం, 2000-2022 సంవత్సరాల మధ్యలో గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ ప్రాంత వైశాల్యం 293 చదరపు కిలోమీటర్ల నుంచి 425 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. వేగవంతమైన పట్టణీకరణకు వరద నీటిపారుదల వ్యవస్థల అధ్వాన నిర్వహణ తోడు కావడంతో కుండపోత వానల సమయంలో భాగ్యనగర జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అధిక వర్షపాతాన్ని తట్టుకునే ఏర్పాట్లు కొరవడటంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 39శాతం జనావాసాలకు తీవ్రస్థాయి వరద ముప్పు పొంచిఉందని, మరో 24శాతం ప్రాంతాలు ఓ మోస్తరు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ‘టిస్’ వెల్లడించింది. హైదరాబాద్ అనేముంది... చెరువులూ మురుగుకాల్వల ఆక్రమణలు, అక్రమ కట్టడాల మూలంగా ఏపీ, తెలంగాణల్లోని పలు పట్టణాలు తరచూ నీట మునుగుతున్నాయి. జనాన్ని కట్టుబట్టలతో నిలబెట్టి కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నాయి!
జనాభా అవసరాలకు అనుగుణంగా నాలాలను విస్తరించకపోవడం, ఉన్నవాటిలోనూ పూడికలు తీయకపోవడం లాంటి కారణాలతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి చోట్ల వానాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప తదితరాల్లోనూ మురుగు, వర్షపు నీటి ప్రవాహ మార్గాల బాగుసేత పనులు సకాలంలో జరగట్లేదంటూ కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు స్థానిక నీటి వనరుల కబ్జాలు నగరాలకు ప్రాణసంకటమవుతున్నాయి. బుడమేరు ఆక్రమణపాలుకావడంతోనే పదహారు నెలల కిందట విజయవాడలో పలు ప్రాంతాలు జలవిలయంలో చిక్కుకున్నాయి. దేశవ్యాప్తంగా 5,161 పట్టణ ప్రాంతాలు వరదల బారినపడే ప్రమాదముందని సర్కారీ నివేదికలే హెచ్చరిస్తున్నాయి. ప్రణాళికారహిత పట్టణాభివృద్ధితో పెనుసమస్యలు అనేకం చుట్టుముడుతున్నా యంత్రాంగంలో కదలిక లేకపోవడమే జనభారత ప్రారబ్ధం!
దేశీయ పట్టణాల్లో జనాభా గడచిన అరవై ఏళ్లలో ఆరు రెట్లు పెరిగింది. 2020లో 48కోట్లుగా ఉన్న నగరభారత జనసంఖ్య 2050 నాటికి 95కోట్లను మించిపోనుంది. 1985-2015 మధ్యలో నిర్మాణ కార్యకలాపాల ఉద్ధృతి వల్ల భారతీయ నగరాల్లో వరద ప్రమాద పీడిత జనావాసాలు 102శాతం అధికమయ్యాయి. దానివల్ల దేశం ఏడాదికి 400కోట్ల డాలర్ల సంపదను కోల్పోతోంది. సరైన నివారణ చర్యలు చేపట్టకపోతే 2070నాటికి ఆ వార్షిక నష్టం 3వేల కోట్ల డాలర్లకు చేరుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ప్రపంచబ్యాంకు గ్రూప్ నిరుడు వెలువరించిన నివేదిక లెక్కగట్టింది. ఇతర దేశాలతో పోలిస్తే చాలాతక్కువగా ఇండియాలో పట్టణ మౌలికవసతులు, సేవలకు జీడీపీలో 0.70శాతం సొమ్మునే వెచ్చిస్తున్నారని అది పెదవి విరిచింది. 2050 నాటికి 2.4లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెడితేనే ప్రకృతి వైపరీత్యాలను దీటుగా ఎదుర్కొనే సత్తా భారతదేశ నగరాలకు సిద్ధిస్తుందని అంచనా వేసింది. ఆమేరకు నిధులు సమకూర్చుకుంటూ టౌన్‌ప్లానర్ల కొరతను తీర్చడం, జలవనరుల ఆక్రమణలూ పురపాలక సంఘాల్లోని అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వాలు నెగ్గుకురావాలి. అప్పుడే సుస్థిరాభివృద్ధి, ఆహ్లాదకర జీవనాలకు పట్టణ భారతం ఆలవాలమవుతుంది!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.