విపత్తు నామ సంవత్సరం!

Eenadu icon
By Editorial News Team Published : 30 Dec 2025 03:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముప్పు ముంచుకొస్తోందని తెలిసీ చేతులు ముడుచుకుని కూర్చోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. తరుముకొస్తున్న ప్రమాద తీవ్రతను మరింత పెంచేలా వ్యవహరించడమైతే ఏకంగా ఆత్మహత్యా సదృశమవుతుంది. శిలాజ ఇంధనాలను ఇష్టమొచ్చినట్లు వాడేస్తుండటంతో కర్బన ఉద్గారాలు కట్టుతప్పుతున్నాయి. వాటి మూలంగా అంతకంతకూ పెరిగిపోతున్న భూతాపంతో వేగవంతమవుతున్న వాతావరణ మార్పులే పెనువిపత్తులై విరుచుకుపడుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు తీస్తూ, అంతులేని ఆస్తినష్టానికి కారణమవుతున్న అవి జనజీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈ విధ్వంసాన్ని ప్రపంచమంతా గుడ్లప్పగించి చూస్తోందే తప్ప శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించట్లేదు! 2017-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా కాలుష్యకారక ఇంధనాల వాడకం ఏడుశాతం పెరిగిందని అంచనా. 2015తో పోలిస్తే 2025లో కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలూ పదిశాతం అధికమయ్యాయి. సమష్టి కృషితో పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న పారిస్‌ ఒప్పంద స్ఫూర్తిని కాలరాస్తున్న ప్రపంచ దేశాల నిర్వాకాల కారణంగా ఈ ఏడాదిలో ప్రకృతి విపత్తులు లోగడ ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో మానవాళిపై దండెత్తాయి!

వడగాడ్పులు, వరదలు, కరవులు, కార్చిచ్చులు, తుపానులు, చలిగాలుల వంటివి ఈ సంవత్సరంలో ప్రపంచం నలుమూలలా విధ్వంసం మిగిల్చాయి. వాటిలో అతిభయానకమైన మొదటి పది ఉత్పాతాల కారణంగానే 12,200 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు తాజా అధ్యయనాంశాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో కార్చిచ్చులు, దక్షిణ-ఆగ్నేయాసియాల్లో సైక్లోన్లు, చైనాలో వరదలు, ఇండియా-పాకిస్థాన్‌లలో అధిక వర్షాలు, బ్రెజిల్‌లో కరవులతో జనజీవనం నానా అవస్థల పాలైంది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) విశ్లేషణ ప్రకారమైతే, 2025 జనవరి-నవంబరు మధ్యలోని 334 రోజుల్లో 331 దినాల పాటు భారతావని ఏదో ఒక వాతావరణ వైపరీత్యాన్ని చవిచూసింది. నిరుడు ఇదే 11నెలల కాలంలో ఇలాంటి దుర్దినాలు 295 నమోదైతే- ఈ ఏడాది వాటి సంఖ్య ఎక్కువ కావడమే కలవరపరుస్తోంది. ప్రకృతి విపత్తులతో కనీసం 4.3కోట్ల ఎకరాల్లో పంటలు ప్రభావితమైనట్లు ‘సీఎస్‌ఈ’ లెక్కగట్టింది. మౌలిక వసతులు, పాడిపశువులనూ పరిగణనలోకి తీసుకుంటే జరిగిన నష్టం ఇంకెన్నో రెట్లు అధికంగా ఉంటుంది. కర్బన ఉద్గారాలతో భూమి వేడెక్కడం వల్ల 1991-2020 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైనట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా దేశదేశాల సౌభాగ్యాన్ని హరిస్తున్న ఉత్పాతాల పాపంలో ప్రధాన వాటా శిలాజ ఇంధనాలదే! వాటి వినియోగాన్ని కట్టడిచేసేందుకు ఉద్దేశించిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తమ పరపతితో నీరుగార్చుతున్న చమురు ఉత్పత్తి దేశాలూ బడా కంపెనీలదే! 

సకల శిలాజ ఇంధనాల వాడకాన్ని దశల వారీగా తగ్గించేయాలని ప్రపంచ దేశాలకు పిలుపిచ్చిన ఇండియా- 2070 నాటికి ‘నెట్‌జీరో’(కర్బన ఉద్గార తటస్థత)ను సాధించే లక్ష్యాన్ని ప్రకటించింది. 2030 నాటికి దేశీయంగా అవసరమైన విద్యుత్తులో సగం వరకు పునరుత్పాదక ఇంధన వనరులతోనే సమకూర్చుకుంటామని పేర్కొంది. విస్పష్ట ప్రణాళికలూ పెట్టుబడుల దన్నుతో నిర్దేశిత గడువుకు అయిదేళ్ల మునుపే ఆ గమ్యాన్ని చేరుకుని కొద్దినెలల క్రితమే కొత్త చరిత్ర సృష్టించింది. జీవావరణాన్ని నాశనం చేసే కర్బన ఉద్గారాలను అదుపు చేయాలంటే బొగ్గు తదితరాల వినియోగాన్ని కుదించక తప్పదు. హరిత ఇంధనాలకు ప్రాధాన్యమివ్వడంలో ప్రపంచమంతా ఒకేమాట మీద నిలబడితేనే విశ్వమానవాళి భవితకు భద్రత లభిస్తుంది! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :