Andhra News: కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి అమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలవనున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతోపాటు పలుచోట్ల మార్పులు, చేర్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది. జనవరి 1 నుంచి పాలన ప్రారంభం అవుతుంది. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలోకి.. మూడు మండలాలతో గూడూరు రెవెన్యూ డివిజన్..
ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్‌లో మార్పులు, చేర్పులు చేశారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్‌ను నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు. ఈ డివిజన్‌లో మిగిలే మండలాల్లో.. వాకాడు, చిట్టమూరును సూళ్లూరుపేట డివిజన్‌లో, బాలాయపల్లె, డక్కిలి, వెంకటగిరి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్‌లో కలుపుతారు.
కలువాయి మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో, రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు.

రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులివే
- అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్‌లో కలుపుతారు.
- కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని కొండాపురం, వరికుంటపాడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో మిగిలే 5 మండలాల్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు.
- శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌లోని నందిగాం గ్రామాన్ని టెక్కలి డివిజన్‌లో కలుపుతారు.
- సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌లో విలీనం చేయనున్నారు.
- చీడికాడ మండలాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించనున్నారు.
- కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు డివిజన్‌లో చేర్చనున్నారు.
- అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాల్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి చేరుస్తారు.
- పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లోకి తెస్తారు.
- ఆమడగూరు మండలాన్ని కదిరి డివిజన్ నుంచి పుట్టపర్తి డివిజన్‌లోకి, గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్ నుంచి పెనుకొండ డివిజన్‌లోకి కలుపుతారు.

1. రంపచోడవరం కేంద్రంగా పోలవరం (12 మండలాలు)
(రంపచోడవరం రెవెన్యూ డివిజన్ 8, చింతూరు రెవెన్యూ డివిజన్ 4 మండలాలు)

2. మార్కాపురం (21 మండలాలు)
(మార్కాపురం రెవెన్యూ డివిజన్ 15 మండలాలు, కనిగిరి 6 మండలాలు)

తిరుపతి రెవెన్యూ డివిజన్‌లోకిరైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరుతోంది. ఆ నియోజకవర్గంలోని కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో విలీనం కానున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలోకినందలూరు, రాజంపేట, వీరబల్లి, టి.సుండుపల్లి మండలాలతో కూడిన రాజంపేట రెవెన్యూ డివిజన్ కడప జిల్లాలోకి రానుంది.
అన్నమయ్య జిల్లాలోనేరాయచోటి, సంబేపల్లి, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలతో కూడిన రాయచోటి రెవెన్యూ డివిజన్ మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.
1. అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా (7 మండలాలు)
(యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్.రాయవరం)
2. అద్దంకి, ప్రకాశం జిల్లా (10 మండలాలు)
(అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు)
3. పీలేరు, అన్నమయ్య జిల్లా (8 మండలాలు)
(సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం)
4. మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా (5 మండలాలు)
(మడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి)
5. బనగానపల్లి, నంద్యాల జిల్లా (5 మండలాలు)
(బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల)
ఆదోని మండలం రెండుగా విభజన
- ఆదోని - 1 (29 గ్రామాలు)
- ఆదోని - 2 (17 గ్రామాలు)
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు
మొత్తం మండలాలు:24
రెవెన్యూ డివిజన్లు:మదనపల్లె (11), పీలేరు (8), రాయచోటి (5)
జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన సందర్భంగా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో 17 చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవు.

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.