West Bengal: నక్సల్‌బరీలో కమల వికాసం

Eenadu icon
By Editorial Team Published : 19 Dec 2025 01:48 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

మావోయిస్టు ఉద్యమం రోజురోజుకూ బలహీనమవుతోంది. కీలక నాయకులను కోల్పోతుండటం, కొత్త చేరికలు లేకపోవడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలో సాయుధ విప్లవ పోరాటాలకు దారిచూపిన నక్సల్‌బరీలో పరిస్థితి ఎలా ఉందన్నది పరిశీలనార్హం!  

బెంగాల్‌ ఉత్తర భాగంలో ఒకప్పుడు నక్సలైట్‌ ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్న నక్సల్‌బరీ గ్రామం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా మారింది. భాజపా అగ్రనేత అమిత్‌ షా 2017లో ఈ గ్రామంలోని ఒక దళిత కుటుంబంతో కలసి భోజనం చేయడం ఆపరేషన్‌ లోటస్‌కు నాంది పలికింది. అది క్రమక్రమంగా పశ్చిమ బెంగాల్, త్రిపురలలో భాజపా బలం పెరగడానికి కారణమైంది. గతంలో పశ్చిమ బెంగాల్‌ శాసనసభలో భాజపాకు ఒకటీ అరా సభ్యులు మాత్రమే ఉండగా, 2021 ఎన్నికల్లో వారి సంఖ్య రెండంకెలకు చేరింది. బెంగాల్‌ ఉత్తర ప్రాంతాల్లోని దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలలో బలం పెంచుకోవడానికి భాజపా పట్టుదలగా చేసిన కృషి ఫలిస్తోంది. 

కనుమరుగైన వామపక్ష ప్రాబల్యం

రాష్ట్ర శాసనసభలో ఉత్తర బెంగాల్‌కు 54 సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం గూర్ఖాల్యాండ్‌ కోసం గళమెత్తుతున్న దార్జిలింగ్‌ గూర్ఖాలకూ, కూచ్‌ బిహార్‌లోని రాజ్‌ బన్షీలకూ గట్టి నెలవు. ఈ రెండు గ్రూపులూ పశ్చిమ బెంగాల్‌ నుంచి వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగానో, కేంద్ర పాలిత ప్రాంతంగానో ఆవిర్భవించాలని కోరుకుంటున్నాయి. తమ కోరిక భాజపా వల్ల తీరుతుందని వారు ఆశిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ పాలక పార్టీ అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల ఇక్కడ చాలామంది విముఖంగా ఉన్నారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల నిర్విరామ కృషి వల్ల ఉత్తర బెంగాల్‌లో భాజపా పాగా వేయగలిగింది. నేడు అక్కడ కాషాయ పతాకాలు దండిగా రెపరెపలాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్లినా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తమ సంఘ సేవా కార్యక్రమాలతో, పౌర సమస్యలపై ఉద్యమాలతో చురుగ్గా కనిపిస్తారని తృణమూల్‌ నాయకుడు, సిలిగురి మేయర్‌ గౌతమ్‌ దేవ్‌ వెల్లడించడం గమనార్హం. 

నక్సల్‌బరీ ఒకప్పుడు కమ్యూనిస్టులకు, ముఖ్యంగా నక్సలైట్లకు పెట్టనికోటగా ఉండేది. కానూ సన్యాల్, చారు మజుందార్‌లు నక్సల్‌బరీ నుంచి ప్రారంభించిన ఉద్యమం నక్సలైట్‌ ఉద్యమంగా దేశంలో విస్తరించిన సంగతి తెలిసిందే. ఉద్యమ ప్రారంభ సమయంలో ఇక్కడ పోలీసు కాల్పుల్లో చాలామంది మరణించారు. వారిలో అత్యధికులు మహిళలే. కాల్పుల్లో మరణించినవారి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన విగ్రహాలు నక్సల్‌బరీ చౌకీలో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తోడుగా మార్క్స్, లెనిన్, స్టాలిన్, కానూ సన్యాల్, చారుమజుందార్‌ల విగ్రహాలనూ ఏర్పాటుచేశారు. వామపక్షాలు చీలికలు వాలికలైన దృష్ట్యా భాజపాయే తమకు మిగిలిన ప్రత్యామ్నాయమని స్థానికులు భావిస్తున్నారు. 1967లో నక్సల్‌బరీలో తిరుగుబాటు ప్రారంభమైన స్థలాన్ని స్థానికంగా తియనాన్మెన్‌ చౌకీగా పిలుచుకుంటారు. వామపక్ష స్మారక చిహ్నాలు, తియనాన్మెన్‌ చౌకీ జోలికి వెళ్లకుండానే వాటి ప్రాధాన్యాన్ని భాజపా తగ్గించగలిగింది. గ్రామ ముఖద్వారంలో కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వారికి స్మారక చిహ్నం నిర్మించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఈ పని సాధించగలిగారు. ఆ స్మారక చిహ్నంలో స్థానిక గుర్ఖాల ఆయుధం కుక్రీతోపాటు హృదయాకారంలో ఒక గుర్తు కూడా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే సమీపంలోని కాంచనగంగ శిఖరం కనిపిస్తుంది. కార్గిల్‌ హిమ శిఖరాలలో పాకిస్థానీలతో భారతీయ వీరులు చేసిన యుద్ధాన్ని అది గుర్తుచేస్తుంది. నక్సల్‌బరీ యువత హృదయాలతో కార్గిల్‌ స్మారక చిహ్నం పెనవేసుకుంది. మరోవైపు నక్సల్‌ ఉద్యమ మూలాలను స్థానికులు మరచిపోవడం గమనార్హం.

అందరి మదిలో కార్గిల్‌ స్థూపమే 

తియనాన్మెన్‌ చౌకీ పక్కనే పొలం పని చేసుకునే మీనూ సైబా అనే మహిళకు చౌకీలో ఉన్న విగ్రహాలెవరివో తెలియదు. కార్గిల్‌ యుద్ధ చిహ్నం గురించి మాత్రం బాగా తెలుసు. దేశంకోసం భాజపా పాటుపడుతోందనీ, కార్గిల్‌ స్మారక స్థూపం గర్వకారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ స్థూపం మీది ఫలకంలో కార్గిల్‌ అమర వీరుల పేర్లు లిఖించి ఉన్నాయి. అక్కడ సందర్శకులు సెల్ఫీలు దిగుతుంటారు. తియనాన్మెన్‌ చౌకీలోని కానూ సన్యాల్‌ విగ్రహం పక్కన కూడా ఒక ఫలకంపై నక్సల్‌ అమరుల పేర్లుంటాయి. కానీ, అక్కడెవరూ సెల్ఫీలు దిగడం లేదు. నక్సల్‌బరీలో కానూ సన్యాల్‌ నివసించిన పూరిపాకలో ఇప్పుడు సీపీఎం కార్యకర్తలు గ్రంథాలయం నడుపుతున్నారు. ఆ గుడిసెను పర్యాటక ప్రాంతంగా మార్చడానికి తృణమూల్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, గ్రామస్థులు ఆ ప్రతిపాదనను స్వాగతించడం లేదు. నక్సల్‌బరీ చుట్టుపక్కల ప్రాంతాలపై భాజపా పట్టు పెరిగిన నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన పార్టీలు ఇక్కడ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయో మరి!  

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యేనాటికి దేశంలోని అందరినీ బీమా రక్షణ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం.  ఆ బృహత్‌ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా బీమా చట్టాల సవరణకు కేంద్రం నిశ్చయించింది. ఆ మేరకు సర్కారు రూపొందించిన ‘సబ్‌ కా బీమా సబ్‌ కా రక్షా’ బిల్లు తాజాగా పార్లమెంట్‌ ఆమోదం పొందింది. దీంతో దేశీయ బీమా రంగంలోకి వందశాతం ఎఫ్‌డీఐల రాకకు మార్గం సుగమమైంది. 2047 నాటికి భారతీయులందరినీ బీమా ఛత్రంలోకి తేవాలన్న సంకల్పం ఘనంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయంగా ఇన్సూరెన్స్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది.   దేశవ్యాప్తంగా అన్ని బీమా ప్రీమియంల మొత్తం జీడీపీలో ఎంత శాతం ఉందన్న దాన్ని బట్టి ఇన్సూరెన్స్‌ వ్యాప్తిని లెక్కేస్తారు. 2014లో అది మన దేశంలో 3.3శాతంగా ఉంటే- 2023 నాటికి 3.7శాతానికి పెరిగింది. కానీ- ప్రపంచ సగటుతో, అనేక దేశాలతో పోలిస్తే  భారత్‌లో బీమా వ్యాప్తి చాలా తక్కువ. 2023లో అది ఏయే దేశాల్లో ఎంత ఉందంటే (శాతాల్లో)... 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :