
వాణిజ్య ఒప్పందాల్లో దూకుడు!

- A
- A+
- A++

ప్రపంచంలోకెల్లా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా- రానున్న రెండేళ్లలో మరో మెట్టు ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా నిలవాలని కాంక్షిస్తోంది. ఇందుకోసం దేశీయంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్రం వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తోంది.
వస్తుసేవల వాణిజ్యంలో సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను పూర్తిగా తొలగించుకునేందుకు, గణనీయంగా తగ్గించుకునేందుకు రెండు, అంతకన్నా ఎక్కువ దేశాలు తమ మధ్య ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంటుంటాయి. పెట్టుబడుల పరిరక్షణ, మేధోసంపత్తి హక్కులు, వివాద పరిష్కార మార్గాల వంటి అంశాలు ఇందులో మిళితమై ఉంటాయి. ఎఫ్‌టీఏలు- ఎగుమతులు, దిగుమతుల భారాన్ని తగ్గిస్తాయి. అంతర్జాతీయ విపణుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాయి. తక్కువ టారిఫ్‌లకే ముడిపదార్థాలు పొందడంలో ఉపకరిస్తాయి. వీటివల్ల వ్యాపారులు లబ్ధి పొందుతారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 350కి పైగా ఎఫ్‌టీఏలు అమల్లో ఉన్నాయి. ఈ ఒప్పందాలు సుంకాల పరంగానే కాకుండా వ్యూహాత్మకంగానూ లాభదాయకమే. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, ఉద్యోగ కల్పన మెరుగవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతర్జాతీయ విపణుల్లో ఒడుదొడుకులను తట్టుకొని నిలబడటానికి దోహద పడతాయి. అందుకే- కొన్నేళ్లుగా ఎఫ్‌టీఏలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలతోపాటు ఆసియాన్ వంటి సంఘాలతోనూ మన దేశానికి ఎఫ్‌టీఏలు కుదిరాయి. ఒమన్‌తో గతవారమే ఒప్పందం ముడిపడింది. న్యూజిలాండ్‌తో కూడా తాజాగా ఎఫ్‌టీఏ ఖరారైంది.
దేశీయ పరిశ్రమలకు లబ్ధి
భారత ఆర్థిక వ్యూహానికి ఎఫ్‌టీఏలు మూల స్తంభాల్లాంటివి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో మన దేశం లోతుగా సమ్మిళితమవడానికి ఇవి దోహదపడతాయి. ఎగుమతుల శక్తిని, ఎగుమతి విపణుల సంఖ్యను పెంచుకోవడానికి ఉపకరిస్తాయి. ఇప్పటికే కుదిరిన ఎఫ్‌టీఏలతో- కొన్ని విదేశీ విపణుల్లో భారతీయ ఉత్పత్తులు, సేవలకు సుంకాలరహితంగా, కొన్నిసార్లు తక్కువ సుంకంతో ప్రవేశం దక్కుతోంది. దీనివల్ల దేశీయంగా కార్మిక శక్తి ఎక్కువగా అవసరముండే జౌళి, వ్యవసాయం, తోలు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల వంటి పరిశ్రమలు లబ్ధి పొందుతున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేసుకోవాలని బ్రిటన్, ఇండియా తలపోశాయి. ఇందుకోసం ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సెటా)’ పేరుతో ఎఫ్‌టీఏ కుదుర్చుకున్నాయి. సెటాతో 99శాతం భారతీయ ఉత్పత్తులకు బ్రిటన్‌లో సుంకాలరహిత ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల చైనా, వియత్నాం వంటి మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లతో భారతీయ ఉత్పత్తులు పోటీ పడగలుగుతున్నాయి.
ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఈఎఫ్‌టీఏ)తో ఇండియా కుదుర్చుకున్న ‘వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(టెపా)’ ఈ ఏడాది అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చింది. స్విట్జర్లాండ్, నార్వే, లీచ్‌టెన్‌స్టీన్, ఐస్‌లాండ్‌ల్లో 99.6శాతం భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా తొలగించేందుకు అది దోహదపడుతోంది. రానున్న పదిహేనేళ్లలో ఇండియాలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి ఈ ఒప్పందం సహాయపడనుంది.
ఒడుదొడుకులను తట్టుకునేలా...
ఇండియా ఎగుమతులు గత నెలలో 15.52శాతం పెరిగి (ఏడాది కిందటితో పోలిస్తే) 73.99 బిలియన్ డాలర్లకుచేరాయి. దిగుమతులు 80.63 బిలియన్ డాలర్ల వద్ద దాదాపు స్థిరంగా ఉన్నాయి. దీంతో- వాణిజ్యలోటు 61శాతం తగ్గి, 6.64 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అమెరికా సుంకాలు పలు దేశాలను కలవరపెడుతున్నాయి. సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. రష్యా నుంచి ముడిచమురు భారీగా కొనుగోలు చేస్తున్నందుకు దిల్లీపైనా అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించారు. అయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరునే కనబరిచింది. అంతర్జాతీయంగా తలెత్తే అనిశ్చిత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎఫ్‌టీఏలు దోహదపడతాయి. ఈయూతోపాటు అమెరికా, చిలీ, పెరూ, ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకునేందుకు ఇండియా గట్టిగా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ విపణిలో పోటీ కారణంగా పాడి, నూనె, విత్తనాల వంటి రంగాల్లో దేశీయ వ్యాపారులు ఒత్తిడికి లోనయ్యే ముప్పుంది. కాబట్టి, వారికి భరోసా కల్పిస్తూనే ఎఫ్‌టీఏలను పట్టాలెక్కించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. పలు దేశాలతో చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. అవి ఫలిస్తే- అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ఒడుదొడుకులను ఇండియా మరింత సమర్థంగా తట్టుకోగలుగుతుంది. ఎఫ్‌టీఏ ఫలాలను పొందేందుకు దేశంలో తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు విదేశీ కంపెనీలు ముందుకొస్తాయి. భారతీయులకు తక్కువ ధరలకే ఎక్కువ రకాల, మేలిమి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. స్వదేశీ ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగవుతుంది. ‘వికసిత్ భారత్’ సాకారం సులువవుతుంది.
ఎలాగైనా పతకాలు గెలిచి తీరాలన్న దురాశతో పలువురు క్రీడాకారులు నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంటున్నారు. కొందరేమో చికిత్సలకు వాడుతున్న మందుల మూలంగా డోపింగ్ మకిలి అంటించు కుంటున్నారు. 2021-24 మధ్యకాలంలో ఇండియాలో 640 మంది ఆటగాళ్లు డోపింగ్ టెస్టుల్లో విఫలమయ్యారు. 2021లో డోపీలు 42 మంది ఉంటే, 2024 నాటికి వారి సంఖ్య 260కి పెరిగింది. నాలుగేళ్లలో డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయిన క్రీడాకారుల్లో ఆయా విభాగాల వారు...

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.