cooking oil: కల్తీ నూనెల గుట్టు.. ఇలా రట్టు!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఆహార పదార్థాల నాణ్యత గాలిలో దీపంలా మారుతోంది. కల్తీ సుడిగుండం పెను గండమవుతోంది. వంటింట్లో నూనెలతో పాటు... ఒంటికి వాడే కొబ్బరి నూనెలనూ విషంలా మార్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం వాడే నూనె నాణ్యత ఎలా తెలుసుకోవాలి?కల్తీని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కొన్ని సూచనలు చేసింది.
వంటనూనె
వంటల్లో వాడే నూనెల్లో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తున్నారు. దీనిలో ఫాస్పరస్ ఉంటుంది. ఇది కలిసిన నూనె వాడటం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి పక్షవాతం సహా ఇతర రోగాలబారిన పడతారు. మనం వాడే వంటనూనెలో ఈ విషం ఉందా... లేదా అనేది ఓ చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా రెండు మిల్లీ లీటర్ల నూనెను ఓ చిన్న పాత్రలోకి తీసుకోవాలి.
- అందులో పసుపు రంగులో ఉన్న గట్టి వెన్న(బటర్)ను వేయాలి.
- కొద్దిసేపటి తర్వాత పాత్రలోని నూనె రంగు మారకుండా ఉంటే అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్ లేదని అర్థం.
- నూనె ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ అయినట్లే. దానిని ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె ప్రాచీన కాలం నుంచే మన జీవితాల్లో భాగంగా కొనసాగుతోంది. చర్మ, జుట్టు సంరక్షణకు ఉపయోగించే దీనిని వంటలు చేయడానికీ వాడతారు. ప్రస్తుతం ఇతర నూనెలతో కలిపి దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. దీనిని గుర్తించడానికి ఏం చేయాలంటే...
- ఒక గాజు గ్లాసులోకి కొద్దిగా కొబ్బరినూనెను తీసుకోవాలి.
- దీనిని 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. అయితే ఫ్రీజర్‌లో పెట్టవద్దు. దాని వల్ల కల్తీ కొబ్బరినూనె కూడా గడ్డలా మారే అవకాశం ఉంటుంది.
- ఆ తర్వాత పరిశీలిస్తే స్వచ్ఛమైన నూనె అయితే గట్టిగా మారుతుంది.
- కల్తీ జరిగితే అందులో ఉపయోగించిన నాసిరకం నూనెలు పైకి తేలతాయి. మిగిలిన కొబ్బరినూనె గట్టిగా మారుతుంది.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.