స్థానిక స్వపరిపాలనకు అడ్డంకులెన్నో!

- A
- A+
- A++
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తాలు ఖరారైన ఈ సమయంలో, తెలంగాణలో త్వరలో రెండోదశ మున్సిపల్ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో- మూడంచెల పాలనావ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న 73, 74 రాజ్యాంగ సవరణల లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో పరిశీలించడం సముచితం. ప్రజాస్వామ్యమంటే సమానత్వం... జీవితంలో పురోగ మించడానికి అందరికీ సమాన అవకాశాలు లభించడం. అధికారం, ఆర్థిక వనరులపై ఎవరో కొద్దిమంది గుత్తాధిపత్యం చలాయించే పరిస్థితి లేకుండా పాలన వికేంద్రీకృతమైతేనే- విధాన రచన, జనహిత కార్యక్రమాల అమలులో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం పెరిగి సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుంది. అందుకోసమే ఏర్పాటైన స్థానిక సంస్థలు ఉత్సవ విగ్రహాలవుతుండటంతో ప్రజాకాంక్షలకు ఎక్కడా విలువ దక్కట్లేదు. నిధులు, విధులు, అధికారాల బదిలీలో దశాబ్దాలుగా సవతితల్లి ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వాల కారణంగా ప్రజాసమస్యలను పరిష్కరించడానికి గ్రామ పంచాయతీలూ పురపాలికలకు శక్తి చాలట్లేదు. దాంతో కనీస మౌలిక వసతులకైనా నోచుకోని దుర్భర పరిసరాల్లో ఈసురోమంటూ బతకాల్సిన దారుణావస్థ సామాన్య జనానికి తప్పట్లేదు!
కేవలం ఎన్నికల నిర్వహణతోనే స్థానిక స్వపరిపాలనాదర్శాలు సాకారం కావు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, పారిశుద్ధ్యం మొదలు మంచినీటి సరఫరా వరకు అన్నింటినీ గమనిస్తూ, పౌరసేవల్లో లోపాలను గుర్తిస్తూ, వాటిని సత్వరం పరిహరించడానికి తగినంత సిబ్బంది, వనరులు పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఉండాలి. ఉదాహరణకు అమెరికా, చైనాల్లోని మొత్తం సర్కారీ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మంది స్థానిక ప్రభుత్వాలకు చెందినవారే. మనదేశ యంత్రాంగంలో మాత్రం అటువంటివారి సంఖ్య పదిశాతానికి కాస్త ఎక్కువంతే! నిధుల విషయంలోనూ అదే దుస్థితి. 1961లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొంత పన్ను రాబడుల వాటాలు జీడీపీలో వరసగా 5.5, 2.6శాతాలుగా ఉండేవి. 2019కి వచ్చేసరికి అవి 11, 6.4శాతాలకు పెరిగాయి. అదే కాలవ్యవధిలో పట్టణ స్థానిక సంస్థల పన్ను ఆదాయం మాత్రం 0.4శాతం నుంచి 0.3శాతానికి పడిపోయింది. కేంద్ర, రాష్ట్ర సర్కార్ల నుంచి వచ్చే నిధులపైనే పూర్తిగా ఆధారపడాల్సిన దుస్థితిలో స్థానిక సంస్థల స్వయంనిర్ణయాధికారం చెల్లనికాసు అవుతోంది. మున్సిపాలిటీలతో పోలిస్తే, సొంత రాబడి మార్గాలు ఇంకా తక్కువగా ఉన్న పంచాయతీల్లోనైతే చిన్న చిన్న ప్రజాపనులకూ సొమ్ములకోసం తడుముకోవాల్సి వస్తోంది. దాంతో జీవకళ కోల్పోతున్న పల్లెల నుంచి నగరాలకు వలసలు విపరీతమవుతున్నాయి!
స్థానిక సంస్థల ఎన్నికలంటే- ఆయా ప్రాంతాల సమస్యలే ప్రముఖంగా చర్చకు రావాలి. గ్రామాభివృద్ధి, పట్టణ ప్రగతి ప్రణాళికలను ప్రజల ముందు ఉంచుతూ ఓట్లు అడగాలి. దానికి భిన్నంగా జాతీయ, రాష్ట్రస్థాయి అంశాలతో ప్రచారాన్ని హోరెత్తించడానికే పార్టీలు చాలావరకు పరిమితమవుతున్నాయి. దాంతో పల్లె, పట్టణ ప్రాంత ప్రజానీకం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇక్కట్లు అనేకం అలాగే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త, కొద్దిపాటి వానలకే బురదమయమయ్యే రహదారులు, ఎప్పుడు వెలుగుతాయో తెలియని వీధిదీపాలు, కలుషిత జలాలు వంటివి జనజీవన ప్రమాణాలను దిగనాసిల్లజేస్తున్నాయి. ఈ అవ్యవస్థలో మార్పు వచ్చి ప్రజాస్వామ్య ఫలాలు గ్రామస్థాయి వరకు చేరాలంటే- పంచాయతీరాజ్ సంస్థలకు నేరుగా రాజ్యాంగం నుంచే అధికారాలను దఖలుపరచాలి. వనరుల పంపిణీకి స్పష్టమైన పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలి. స్థానిక సంస్థల కార్యనిర్వాహక సామర్థ్యాలను బలోపేతం చేసే మౌలిక సంస్కరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంకట్టాలి!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.