చెల్లెలంటే విసుక్కుంటోంది!
మా పిల్లలిద్దరికీ 14 ఏళ్లు తేడా. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. ఇంటర్ చదువుతోంది. చెల్లి పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య చెల్లెలంటే విసుక్కుంటోంది. చేయి చేసుకుంటోంది.
చెల్లెలంటే విసుక్కుంటోంది!
మా పిల్లలిద్దరికీ 14 ఏళ్లు తేడా. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. ఇంటర్ చదువుతోంది. చెల్లి పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య చెల్లెలంటే విసుక్కుంటోంది. చేయి చేసుకుంటోంది.
By Vasundhara Team Published : 22 Dec 2025 01:56 IST Ee Font size
A
A+
A++
2 min read
మా పిల్లలిద్దరికీ 14 ఏళ్లు తేడా. పెద్దమ్మాయికి 16 ఏళ్లు. ఇంటర్ చదువుతోంది. చెల్లి పుట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య చెల్లెలంటే విసుక్కుంటోంది. చేయి చేసుకుంటోంది. మేమేమైనా అంటే నేనంటే మీకు ఇష్టం లేదని ఏడుస్తోంది. అలాంటిదేమీ లేదంటే వినట్లేదు. ఎందుకిలా తయారైంది? తనని మార్చేదెలా?
పిల్లల మధ్య వయసులో అంతరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి సహజమే. పాపాయి పుట్టిన తొలిరోజుల్లో కొంచెం కొత్తదనం, తనకీ చెల్లి రూపంలో ఓ తోడు దొరికిందని మీ పెద్దమ్మాయి సంతోషపడి ఉండొచ్చు. అయితే చిన్నదని పాపాయికే ఎక్కువ సమయం కేటాయించడం, పెద్దమ్మాయితో ఇదివరకులా గడపకపోవడం వంటివి చెల్లెలి పట్ల తనకి అసహనం, అసూయ వంటివి ఏర్పడటానికి కారణమై ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో స్నేహితులూ ‘నీకు ఇంత చిన్న చెల్లి ఉందా’ అని టీజ్ చేసినా కూడా దాన్నో అవమానంలా భావించే ఆస్కారముంది. ఫలితమే కోపం. ఇలాంటి పరిస్థితి రావొద్దనే పెద్ద పిల్లల్ని ముందు నుంచి రాబోయే చిన్నారి విషయంలో సిద్ధం చేయాలని చెబుతారు. రాబోయే తోబుట్టువును చూసుకోవడం, వాళ్లతో ప్రేమగా ఉండటం వంటి విషయాల్ని చర్చిస్తే వాళ్లూ అందుకు సిద్ధమై ఉంటారు. 14 ఏళ్లు ఇంటికి మహారాణిలా పెరిగి, తల్లిదండ్రుల ప్రేమనంతా పొంది... ఒక్కసారిగా మరొకరితో ఇవన్నీ పంచుకోవాలంటే తట్టుకోవడం కష్టమే. కాబట్టే, మీ పెద్దమ్మాయి ఇలా ప్రవర్తిస్తూ ఉండి ఉండవచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఓసారి తనని కూర్చోబెట్టుకుని ఆమె ప్రవర్తనకు కారణాలు కనుక్కోండి. తనపై మీ ప్రేమను వ్యక్తపరచండి. అలాగే తనతో మీరు గత ప్రవర్తనకీ ప్రస్తుతానికీ మధ్య తేడాలున్నాయా? విసుక్కోవడం, అన్ని పనులూ తననే చేయమనడం వంటివి ఏమైనా చేశారా అన్నదీ గమనించుకుని మార్చుకోవాలి. ఆపై నెమ్మదిగా అక్కగా చెల్లెలి పట్ల తన బాధ్యత, చిన్నారిని ఎలా అపురూపంగా చూసుకోవాలి... దానివల్ల వాళ్ల మధ్య ఏర్పడే అనుబంధం వంటివి అర్థమయ్యేలా చెప్పండి. చిన్న పాపకి సంబంధించిన పనులు, కొనే వస్తువులు వంటి అన్ని విషయాల్లో మీ పెద్దమ్మాయినీ భాగస్వామిని చేయండి. తన అభిప్రాయానికీ ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు క్రమంగా మార్పు వస్తుంది. అయితే ఇక్కడ మీరు చాలా సహనంతో, తన మీదా ఇదివరకటిలానే ప్రేమ ఉందన్న భావన కలిగేలా ప్రవర్తించాలి మరి!