పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చా...

వ్యవసాయానికి అనుబంధంగా తేనెటీగల పెంపకాన్ని ఎంచుకుని, స్వయం సమృద్ధి సాధించడమే కాదు.. వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత బాటలో నడిపిస్తున్నారు తాళ్లపల్లి స్రవంతి సంజన. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మేనేజ్‌) నుంచి ఉత్తమ మహిళా రైతు పురస్కారాన్ని అందుకున్నారు.

Eenadu icon
By Vasundhara Team Published : 16 Oct 2026 03:41 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

వ్యవసాయానికి అనుబంధంగా తేనెటీగల పెంపకాన్ని ఎంచుకుని, స్వయం సమృద్ధి సాధించడమే కాదు.. వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత బాటలో నడిపిస్తున్నారుతాళ్లపల్లి స్రవంతి సంజన. జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మేనేజ్‌) నుంచి ఉత్తమ మహిళా రైతు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వసుంధరతో మాట్లాడారు. 

మాది వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట. చిన్నతనం నుంచి పొలంలో మా అమ్మానాన్నలు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించడం చూశాను. అంత కష్టపడినా వారికి దక్కిన లాభాలు అంతంత మాత్రమే! నర్సంపేటలో ఉన్నత చదువులు పూర్తి చేశాను. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకకి చెందిన రఘుతో నా వివాహమైంది. పెళ్లి తర్వాత కూడా సాగుతో నా అనుబంధం కొనసాగింది. చదువు పూర్తయ్యాక మహిళా శిశు సంక్షేమ శాఖలో మాస్టర్‌ ట్రైనర్‌గా ఏడాది పాటు పనిచేసి, ఆ ఉద్యోగం వదిలేసి మళ్లీ మట్టి వైపే అడుగులేశాను. పొలానికి వెళ్లిన ప్రతిసారీ తోటి మహిళా రైతులు వచ్చి.. ‘చదువుకున్నదానివి కదా అక్కా! వ్యవసాయంలో మంచి లాభాలు వచ్చే మార్గాలు చెప్పరాదూ’ అని అడిగేవారు. వారి ప్రశ్నలు నాలో ఆలోచన రేకెత్తించాయి. సరిగ్గా అదే సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్లాను. అక్కడ పశువుల పెంపకం, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలపై అవగాహన కల్పించారు. వాటన్నింటిలో నా దృష్టిని బాగా ఆకర్షించింది తేనెటీగల పెంపకం! ఇది నాకే కాదు, గ్రామీణ మహిళలందరికీ ఎంతో సౌకర్యవంతంగా, లాభదాయకంగా ఉంటుందని గ్రహించాను.

వివిధ జిల్లాల నుంచి సేకరిస్తూ... 

హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకున్నాను. ఊరికి తిరిగొచ్చి పెంపకం ప్రారంభించా. రకరకాల పంట పొలాల్లో, విభిన్న జాతుల తేనెటీగలను పెంచుతూ స్వచ్ఛమైన తేనె సేకరించి అమ్మేదాన్ని. ఇదంతా చూసి ఊళ్లోని మహిళలు కూడా ముందుకు రావడంతో వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఇప్పటివరకు సుమారు 10,000 మందికి పైగా మహిళా రైతులకు ఉచితంగా శిక్షణనివ్వడం నా జీవితంలో మర్చిపోలేని తృప్తినిచ్చింది. ప్రస్తుతం కరీంనగర్‌లో శ్రీ నేచురల్‌ హనీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నాను. తేనె ఉత్పత్తి చేయడమే కాకుండా, వివిధ జిల్లాల నుంచి సేకరించిన తేనెను శుద్ధి చేసి విక్రయిస్తున్నాను. ప్రస్తుతం తేనెటీగల పెంపకంలో మాస్టర్‌ ట్రైనర్‌గా, జాతీయ తేనెటీగల అభివృద్ధి మండలిలో జీవితకాల సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తేనెటీగలతో నాకున్న బంధం, అనురాగానికి గుర్తుగా మా అమ్మాయికి హనీ అని పేరు పెట్టుకున్నా. తను వైద్య విద్య 
అభ్యసిస్తోంది. 

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :