‘నీకెవరు ఉద్యోగమిస్తారు?’ అన్నారు!

‘కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా?’ అంటుంటారు. ఎలాంటి సమస్యలనైనా అధిగమించి నిలబడినప్పుడే జీవితంలో ఎదగగలమని దీని అర్థం. తన సక్సెస్‌తో ఇదే విషయం నిరూపించింది 45 ఏళ్ల కాజల్ బాయి. పుట్టిన ఏడాదిన్నరకే పోలియో బారిన పడిన ఆమె చేతి కర్రల సహాయంతో నడవడం నేర్చుకుంది.

Eenadu icon
By Vasundhara Team Updated : 16 Oct 2026 20:58 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

(Photos: Instagram)

‘కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా?’ అంటుంటారు. ఎలాంటి సమస్యలనైనా అధిగమించి నిలబడినప్పుడే జీవితంలో ఎదగగలమని దీని అర్థం. తన సక్సెస్‌తో ఇదే విషయం నిరూపించింది 45 ఏళ్ల కాజల్ బాయి. పుట్టిన ఏడాదిన్నరకే పోలియో బారిన పడిన ఆమె చేతి కర్రల సహాయంతో నడవడం నేర్చుకుంది. పెద్దయ్యాక తండ్రిని కోల్పోయినా అధైర్యపడకుండా కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ఇన్ని కష్టాల్లోనూ చదువే తనను నిలబెడుతుందని నమ్మిన ఆమె.. ఇదే ఆత్మవిశ్వాసంతో వజ్రాభరణాల రంగంలోకి అడుగుపెట్టింది. తన బృందంలో ఉన్న వాళ్లంతా పురుషులే అయినా.. ఈ రంగంలో పూర్వానుభవం లేకపోయినా.. తనను తాను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించింది. ఈ అంకితభావమే ఇప్పుడు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇటీవల ‘రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి’ అందించిన ‘ఉన్నతి ఉమన్‌ ఆర్టిసన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ అందుకొని వార్తల్లో నిలిచింది కాజల్‌. ఈ నేపథ్యంలో ఆమె స్ఫూర్తి ప్రయాణం గురించి తెలుసుకుందాం..

‘ఎలా నెట్టుకొస్తుందో’ అనేవారు..!

గుజరాత్‌కు చెందిన కాజల్‌ పుట్టిన ఏడాదిన్నర వయసులోనే పోలియో వ్యాధి బారిన పడింది. దాంతో ఆమె రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇలా ఆమె పరిస్థితి చూసి చాలామంది జాలిపడ్డారు. మరికొందరు ‘శారీరక వైకల్యంతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తుందో?’ అంటూ నిరుత్సాహపూరిత మాటలనేవారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా చదువు పైనే దృష్టి పెట్టింది కాజల్.

‘నా శారీరక వైకల్యాన్ని చూసి నేనెప్పుడూ ఆత్మన్యూనతకు లోనవలేదు. ఉన్నత చదువే నన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని నమ్మాను. ఈ విషయంలో అమ్మానాన్నలు కూడా నన్ను ప్రోత్సహించారు. డిజైనింగ్‌ రంగంపై ఉన్న మక్కువతో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశాక ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోకి రావాలనుకున్నా. ఈ క్రమంలోనే ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. చాలామంది ‘నీ శారీరక వైకల్యం చూసి నీకు ఉద్యోగం ఎవరిస్తారు?’ అంటూ హేళన చేసేవారు. కానీ నాకూ ఓ అవకాశం దొరుకుతుందన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగా. ఈ పాజిటివిటీనే ఓ వజ్రాభరణాల సంస్థలో ఉద్యోగం సంపాదించి పెట్టింది.. ఇక ఆపై వెనక్కి తిరిగి చూసుకోలేదు..’ అంటోన్న కాజల్‌.. తన తండ్రి చనిపోవడంతో తన కుటుంబ బాధ్యతను తన మీద వేసుకుంది. ఈ క్రమంలో పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. 

ఆ స్పష్టతే నిలబెట్టింది!

ఎవరికైనా అనుభవం లేని రంగంలోకి అడుగుపెడితే ఆఫీస్‌ వాతావరణమంతా కొత్తగా, బెరుకుగా అనిపిస్తుంది. దీనికి తోడు ఆ బృందంలో అందరూ పురుషులే ఉంటే.. మొదట్లో వాళ్లతో కలిసి పనిచేయడం కష్టంగానే ఉంటుంది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా పని నేర్చుకోవడం పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు చెబుతోంది కాజల్.

‘కెరీర్‌ విషయంలో ముందు నుంచే నాకో స్పష్టత ఉంది. ఏ రంగంలోకి వెళ్లినా నన్ను నేను నిరూపించుకోవాలని! అందుకే పూర్వానుభవం లేని వజ్రాభరణాల రంగంలోకి అడుగుపెట్టినా, నా బృందంలో నేనొక్కదాన్నే మహిళనైనా వెనకడుగు వేయలేదు. నిజానికి అప్పటిదాకా వజ్రాల గురించి వినడమే తప్ప.. వాటిని చూసింది లేదు.. వాటి గురించి నాకు తెలిసిందీ తక్కువే. అయినా సంస్థ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. ఈ క్రమంలోనే మొదటి రెండేళ్లలో వజ్రాల తయారీ, వాటిని వివిధ ఆకృతుల్లో కట్‌ చేయడం, పాలిష్‌ చేయడం నేర్చుకున్నా. ఆపై డైమండ్‌ ప్లానింగ్‌ విభాగంలో ఇంజినీర్‌గా నాకు బాధ్యతలు అప్పగించారు. ముడి వజ్రాలను పరిశీలించి.. వాటి విలువ, నాణ్యత పెంచేలా ఏ కోణంలో కట్‌ చేయాలి? ఎలా పాలిష్‌ చేయాలి? వంటి అంశాల్లో లోతైన సాంకేతిక నైపుణ్యాలు గడించా.. ప్రస్తుతం ఈ బాధ్యతల్ని నేనే చూసుకుంటున్నా..’ అంటోంది కాజల్‌. గత 14 ఏళ్లుగా ఈ సంస్థలో కొనసాగుతోన్న ఆమె.. ప్రస్తుతం డైమండ్‌ ప్లానర్‌గా వ్యవహరిస్తోంది.. ఉత్పత్తికి ముందు వజ్రాల ఆకృతి, నాణ్యత.. మొదలైన అంశాల్ని పరిశీలిస్తోంది.

కృషికి దక్కిన గుర్తింపు!

ఇలా కెరీర్‌లో తాను ఎదగడమే కాదు.. తోటి మహిళల్నీ ఎదిగేలా ప్రోత్సహిస్తోంది కాజల్‌. సంస్థలో చేరిన మొదట్లో పురుషాధిపత్య వాతావరణంలో పనిచేసిన ఆమె.. తమ సంస్థలో మరింతమంది మహిళలకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. అంతేకాదు.. అందుకు తగిన వాతావరణం కల్పించేలా యాజమాన్యంతో కలిసి పనిచేస్తోంది. ఇలా ఆమె కృషిని గుర్తించిన ‘రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి’ ఇటీవలే ఆమెకు ‘ఉన్నతి ఉమన్‌ ఆర్టిసన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ను బహూకరించింది. ‘భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలో పనిచేసే ఈ మండలి.. రత్నాభరణాల రంగంలో మహిళల్ని ప్రోత్సహించేందుకు ఇటీవలే సూరత్‌లో ‘ఉన్నతి - పవరింగ్‌ విమెన్‌ ఇన్‌ జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ అవార్డు అందుకొని వార్తల్లో నిలిచింది కాజల్.

‘శారీరక వైకల్యాలున్న వారు బలహీనులు కాదు. ప్రోత్సహిస్తే వాళ్లూ ఏదైనా సాధించగల సమర్థులు. అలాంటి ప్రోత్సాహమే నేను పనిచేస్తోన్న సంస్థ నాకు అందించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పద్నాలుగేళ్లలో నేను కెరీర్‌ పరంగా ఎంతో వృద్ధి చెందాననిపిస్తోంది. నేను చేయగలిగానంటే ఎవరైనా చేయగలరు. మీరూ ఇదే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి..’ అంటూ తన మాటలతోనూ ఈతరం మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది కాజల్.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 16 Oct 2026 20:55 IST