నిల్వలు ఉన్నా... ఆహార భద్రత కరవే!

Eenadu icon
By Editorial Team Published : 16 Oct 2026 01:52 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

భారత్‌ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది కానీ... ఆహార భద్రత, పోషకాహార లోపాలను అధిగమించడంలో ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. నిరుటి ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 123 దేశాలకుగాను ఇండియా ఎక్కడో చివరన 102వ స్థానానికి పరిమితమైంది. దేశంలో ధాన్యం నిల్వలు పుష్కలంగా ఉన్నా, ఆహార భద్రత లోపిస్తుండటమే విస్మయకరం. దీనికి ప్రధాన కారణం ఉత్పత్తి-పంపిణీ మధ్య సమన్వయం లోపించడమే.నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా...

ప్రజలకు అన్నివేళలా తిండి గింజలను అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత ప్రాథమిక లక్ష్యమని 1996లో రోమ్‌లో జరిగిన ప్రపంచ ఆహార సదస్సు పేర్కొంది. దీన్ని సాధించడంలో ‘లభ్యత, అందుబాటు, వినియోగం, అన్నివేళలా దొరకడం’ అత్యావశ్యకమైనవి. లభ్యత అనేది ఉత్పత్తితో ముడిపడిన అంశం. అందుకోసమే 2007-08లో జాతీయ ఆహార భద్రత మిషన్‌ను ఏర్పాటుచేసి, 2014-15లో తృణధాన్యాలను కూడా చేర్చారు. 2024-25కి వచ్చేసరికి ఈ పథకాన్ని జాతీయ ఆహార, పోషకాహార భద్రత మిషన్‌గా మార్చి, ప్రతి ఒక్కరికీ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని లక్షించారు.

అవసరానికి మించి దాస్తున్నారా?

‘ఐక్యరాజ్య సమితి- ఇండియా రిపోర్ట్‌2025’ ప్రకారం, మన దేశంలో సుమారు 17.2 కోట్ల జనాభాను, ముఖ్యంగా 43శాతం మంది పిల్లల్ని పోషకాహార లేమి వేధిస్తోంది. 53.7శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుండటానికీ ఇదే కారణం. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ చెప్పినట్లు మన దగ్గర ఆకలి చావులు కనిపించకపోవచ్చు కానీ... అర్ధాకలి, పోషకాహార లేమి మాత్రం తీవ్రంగానే తాండవిస్తున్నాయి. ఈ దుస్థితికి ప్రధాన కారణం... ఆహారంలో ధాన్యాలు, ప్రొటీన్‌ను తగ్గించి; నూనె పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్, శీతల పానీయాలు వంటి వాటిని పెంచడమే. కాగా, 1972-2024 మధ్యకాలంలో ఆహార ధాన్యాల మీద పెట్టే ఖర్చు గ్రామాల్లో 57శాతం నుంచి 47శాతానికి, పట్టణాల్లో 47శాతం నుంచి 36శాతానికి కుదించుకుపోవడాన్ని ఇక్కడ గమనించాలి.

తిండి పదార్థాలు అందరికీ అన్నివేళలా లభ్యం కావడం, ఆహార భద్రతకు కీలకం. చాలారకాల వ్యవసాయోత్పత్తులు ఏటా రెండు మూడుసార్లు అందుబాటులోకి వస్తాయి కానీ, వినియోగం నిత్యం ఉంటుంది. కాబట్టి, వీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకుని, అవసరాల మేరకు సరఫరా చేస్తుండాలి. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నిబంధనల ప్రకారం, మొన్న ఒకటో తేదీ నాటికి దేశంలో 3.1 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉండాలి. వాస్తవానికి అవి 8.7కోట్ల టన్నుల మేర పోగుపడ్డాయి. అంటే, 5.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ వ్యవస్థకు చేరలేదన్న మాట. ఆకలి బాధలు తీర్చాల్సిన ధాన్యాలను అవసరానికి మించి గిడ్డంగుల్లో నిల్వ చేయడం సరికాదు. దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950-51లో 5.08 కోట్ల టన్నులు కాగా, 2025-26లో 37.66 కోట్ల టన్నులకు పెరిగింది. కానీ, రోజువారీ తలసరి ఆహార ధాన్యాల లభ్యత మాత్రం పెద్దగా పెరగలేదు. ఇప్పటికీ అది 690 గ్రాములే! జాతీయ ఆహార భద్రతా పథకం కింద గర్భిణులు, బాలింతలకు ఆహార పదార్థాలు అందించాలని లక్షించారు. దీంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు పోషకాహారం ఇవ్వడం, 6-14 సంవత్సరాల చిన్నారులకు బడుల్లో మధ్యాహ్న భోజనం అందించడం వంటి చర్యలు చేపడుతున్నారు.

‘బజార్‌-క్యాంటీన్‌’ నమూనా మేలు

ప్రఖ్యాత పాలనా శాస్త్రవేత్త ఎఫ్‌.డబ్ల్యూ.రిగ్స్‌ సూచించినట్లు, భారత్‌ వంటి వర్ధమాన దేశాల పంపిణీ వ్యవస్థలు ‘బజార్‌-క్యాంటీన్‌’ నమూనాలో ఉండటం మేలు. అంటే, దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి క్యాంటీన్ల ద్వారా సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులను సరఫరా చేయాలి. దారిద్య్రరేఖకు ఎగువున ఉన్నవారికి బజార్ల ద్వారా వాటిని అందించాలి. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు తిండి గింజలు అందిస్తున్నా, దీన్ని మరింత పటిష్ఠం చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ధరలనూ నియంత్రించాలి. ముఖ్యంగా దేశీయ ఆహార ఉత్పత్తిలో మార్పులు, వినియోగంలో భిన్నత్వం, పంపిణీ సమస్యలు, పేదరికం వంటి సమస్యలను ఒకే చట్రం కిందకు తీసుకొచ్చి, ఏకతాటిన పరిష్కరించేందుకు కృషి చేయాలి. వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను సృష్టించడం ద్వారా స్థిరమైన వ్యవసాయం దిశగా అడుగులు వేయవచ్చు. గోదాముల్లోని ఆహార నిల్వలను పారదర్శకంగా నిర్వహించడం చాలా అవసరం. పైగా రేషన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానించి, బోగస్‌లను ఏరివేయాలి. అర్హుల్లో ఏ ఒక్కరూ నష్టపోకుండా చూడాలి. సమగ్ర ఆహార భద్రతతో కూడిన భారతావని కోసం ప్రభుత్వాలు, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, నిపుణులు, అన్నదాతలు కలిసికట్టుగా కృషి చేయాలి.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.