దాండియా ఆడేటప్పుడు.. పాదాలు పదిలమిలా!
దేవీ నవరాత్రులనగానే దాండియా, గర్బా నృత్యాలే గుర్తొస్తాయి. ఈ తొమ్మిది రోజులు సాయంత్రమైందంటే అతివలంతా ఈ ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గంటల తరబడి సరదాగా, ఉత్సాహంగా గడుపుతారు.

- A
- A+
- A++

దేవీ నవరాత్రులనగానే దాండియా, గర్బా నృత్యాలే గుర్తొస్తాయి. ఈ తొమ్మిది రోజులు సాయంత్రమైందంటే అతివలంతా ఈ ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గంటల తరబడి సరదాగా, ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఈ క్రమంలో పాదాల్లో నొప్పి రావడం, బొబ్బలెక్కడం సర్వసాధారణమే! దాంతో మరుసటి రోజు నృత్యం చేయడం ఇబ్బందిగా అనిపించచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
⚛ చాలామంది దాండియా, గర్బా కోసం ప్రత్యేకమైన దుస్తులు డిజైన్ చేయించుకోవడం తెలిసిందే! వీటికి మ్యాచింగ్గా జ్యూతీస్, మోజారీస్.. వంటి ట్రెడిషనల్ ఫుట్వేర్ని ఎంచుకుంటారు. అయితే ఇవి కొత్తవి కాకుండా.. ముందు నుంచి వాడుతున్నవి ధరించడం మేలంటున్నారు నిపుణులు. ఒకవేళ కొత్తవి కొన్నా ఇంట్లో వేసుకొని అలవాటు చేసుకోమంటున్నారు. ఎందుకంటే నృత్యం చేసే క్రమంలో కొత్తవి స్టిఫ్గా ఉండి పాదాలకు అసౌకర్యం కలిగిస్తాయని, దానివల్ల పాదాలపై బొబ్బలొచ్చే అవకాశం ఎక్కువంటున్నారు. అదే ఇదివరకే వాడుతున్నవైతే పాదాలకు సౌకర్యంగా ఉంటుందంటున్నారు.
⚛ ఈ ఫుట్వేర్ అడుగు భాగం గట్టిగా ఉండడం వల్ల కూడా డ్యాన్స్ చేసే క్రమంలో అసౌకర్యం కలగచ్చు.. రాళ్లు గుచ్చుకోవచ్చు. కాబట్టి అడుగున సోల్ కుషన్స్ ఏర్పాటుచేసుకోవడం, వేళ్లకు రక్షణగా టో ప్రొటెక్టర్స్ ధరించడం వల్ల సౌకర్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. తద్వారా పాదాల్లో నొప్పి రాకుండానూ జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
⚛ కొంతమంది చెప్పులు వేసుకోకుండా దాండియా, గర్బా చేస్తుంటారు. అయితే దీనివల్ల కూడా పాదాల్లో నొప్పి రావడం, రాళ్లు గుచ్చుకోవడం వల్ల పాదాలకు గాయాలవడం.. వంటి సమస్యలొస్తాయి. ఇలా జరగకుండా ప్యాడెడ్ సాక్సులు రక్షణ కల్పిస్తాయంటున్నారు నిపుణులు. వీటి అడుగుభాగంలో ఉండే కుషన్ లాంటి మెటీరియల్ పాదాలకు సౌకర్యాన్నిస్తుంది. కాబట్టి చెప్పులు వేసుకోకపోయినా ఇలాంటి సాక్సులు ధరించడం మేలంటున్నారు.
⚛ దాండియా, గర్బా ఆడే క్రమంలో పాదాలపై దుమ్ము-ధూళి చేరుతుంది.. అలాగే వేగంగా నృత్యం చేసే క్రమంలో అక్కడి చర్మం చెప్పుల అంచులు, సాక్సులతో పదే పదే రాపిడికి గురవుతుంది. ఇలా జరగకుండా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె.. వంటివి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి వీటిని అప్లై చేసుకోవడం వల్ల బొబ్బల నుంచి రక్షణ పొందడంతో పాటు దుమ్ము-ధూళి ప్రభావం చర్మంపై పడకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇప్పటికే బొబ్బలుంటే అక్కడ బ్లిస్టర్ టేప్ అతికిస్తే వాటిపై ఒత్తిడి పడకుండా ఉంటుందంటున్నారు.
⚛ గంటల తరబడి వేగంగా నృత్యం చేయడం వల్ల పాదాల్లో చెమట వచ్చే అవకాశం కూడా ఎక్కువే. దీనివల్ల కూడా ఆ భాగంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి చెమటను పీల్చుకొనే గుణాలున్న డస్టింగ్ పౌడర్ని ఉపయోగించమంటున్నారు. ఇవి ఫుట్వేర్, సాక్సుల వల్ల చర్మంపై రాపిడిని తగ్గించడంలోనూ సహకరిస్తాయంటున్నారు.
⚛ కొత్తగా దాండియా, గర్బా నృత్యాలు చేసే వారికి కాసేపటికే పాదాల్లో నొప్పి రావడం గమనించచ్చు. కాబట్టి వీళ్లు డ్యాన్స్ ప్రారంభానికి ముందు ఐదు పది నిమిషాల పాటు పాదాల్ని గుండ్రంగా తిప్పడం, మోకాళ్లు-మడమల్ని వంచుతూ చేసే వ్యాయామాలతో వార్మప్ చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుందంటున్నారు నిపుణులు. తద్వారా నొప్పి రాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
⚛ డీహైడ్రేషన్ వల్ల కూడా పాదాలు, కీళ్లలో నొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి డ్యాన్స్ మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు సిప్ చేయడం, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కొద్ది మొత్తాల్లో తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. అలాగే శరీరానికి శక్తి కూడా వస్తుందని చెబుతున్నారు.
⚛ అలాగే కాలి వేళ్ల గోళ్లను కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవడం ముఖ్యం. లేదంటే డ్యాన్స్ చేస్తున్న క్రమంలో అవి మరో కాలి చర్మానికి, పాదానికి తగిలి గాయపరచచ్చు. అంతేకాదు.. షూస్ లోపల ఒత్తిడికి గురై నొప్పి కూడా కలగచ్చు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలంటున్నారు నిపుణులు.
ఇవీ ముఖ్యమేనట!
డ్యాన్స్ చేసే క్రమంలోనే కాదు.. ఈవెంట్ పూర్తయ్యాక కూడా పాదాల సంరక్షణపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అప్పుడే పాదాల ఆరోగ్యాన్ని, అక్కడి చర్మాన్ని కాపాడుకోవచ్చంటున్నారు.
⚛ ముందుగా పాదాల్ని గోరువెచ్చటి నీళ్లు, సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తద్వారా దుమ్ము-ధూళి తొలగిపోతాయి. ఆపై మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల అక్కడి చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.
⚛ గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా ఎప్సం సాల్ట్ వేసి పావు గంట పాటు పాదాల్ని ఈ నీటిలో నాననివ్వాలి. తద్వారా పాదాల చర్మంపై చేరిన దుమ్ము-ధూళి తొలగిపోవడంతో పాటు నొప్పులు, వాపు.. వంటివి దూరమవుతాయని చెబుతున్నారు నిపుణులు.
⚛ గంటల తరబడి దాండియా, గర్బా చేయడం వల్ల కొంతమంది పాదాల్లో వాపు రావడం గమనిస్తుంటాం. ఇలాంటి వారు పడుకొనేటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
⚛ అలాగే రాత్రి పడుకొనే ముందు పది నిమిషాల పాటు గోరువెచ్చటి నూనెతో పాదాల్ని మర్దన చేయడం వల్ల పాదాల్లో వాపు, నొప్పి తగ్గుతాయంటున్నారు.
⚛ ఐస్ప్యాక్తో కూడా పాదాల్లో నొప్పి, వాపు తగ్గించచ్చు. ఇందుకోసం పావుగంట పాటు ఐస్ప్యాక్తో నెమ్మదిగా పాదాలు, మడమల్ని మర్దన చేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.
అయితే ఈ జాగ్రత్తలు, చిట్కాలు పాటించినప్పటికీ.. పాదాల్లో నొప్పి, వాపు తగ్గకపోయినా, ఇతర ఇన్ఫెక్షన్లు ఎదురైనా వెంటనే చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మేలంటున్నారు నిపుణులు. తద్వారా సమస్యను ఆదిలోనే తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :