వీబీ జీ రామ్‌జీ.. అనంత నుంచే

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 17 Jun 2026 05:29 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

ఈనాడు, దిల్లీ: వీబీ జీ రామ్‌జీ పథకాన్ని జులై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రారంభించనున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి మద్దతు కోరారు. 2006లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించిందని, దాని స్థానంలో తెచ్చిన వీబీ జీ రామ్‌జీ పథకానికి కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని కోరినట్లు పవన్‌ చెప్పారు. ఈ పథకం అమలు కోసం దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని చెప్పామన్నారు. తన ఆహ్వానానికి కేంద్ర మంత్రి అంగీకరించి జులై 1న అనంతపురం జిల్లాకు వస్తానని చెప్పారని ప్రకటించారు. ఈ అంశాన్ని తర్వాత ఓ ప్రకటనలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ధ్రువీకరించారు. పవన్‌ కల్యాణ్‌ దిల్లీలో మంగళవారం ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘ఉపాధి హామీ పథకం కింద 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.42,500 కోట్లు ఇచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఈ రెండేళ్లలో రూ.16,700 కోట్లు విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వం ఆ నిధులతో 8,840 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేస్తే, మేం ఈ రెండేళ్లలోనే 7 వేల కి.మీ. నిర్మించాం. ఐదేళ్లలో వారు 239 కి.మీ. బీటీరోడ్లు వేస్తే రెండేళ్లలోనే 1,500 కి.మీ.నిర్మించాం. గత ప్రభుత్వం 564 మినీ గోకులాలు నిర్మిస్తే, మేం 40 వేలు కట్టాం. పని చేయకుండానే వేతనాలు తీసుకోకుండా నిరోధించడానికి ముఖ గుర్తింపు హాజరుతో పాటు చేసిన పనులపై పక్కాగా సామాజిక తనిఖీలు చేస్తున్నాం. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రికి నివేదించాం. వీబీ జీ రాంజీ కింద రాష్ట్రానికి రూ.7,700 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపాం. గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తున్న విజయాల దృష్ట్యా వీబీ జీ రాంజీ అమలుకు మీ రాష్ట్రమైతేనే ఆదర్శంగా ఉంటుందని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి చౌహాన్‌ చెప్పారు. ఎండాకాలంలో దాహార్తి నుంచి పశువులను కాపాడేందుకు చేపట్టిన నీటితొట్టెల నిర్మాణాన్ని, పెద్దపెంకి గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన మ్యాజిక్‌ డ్రైన్‌ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. మధ్యప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ మ్యాజిక్‌ డ్రైన్‌ విధానాన్ని అమలు చేస్తానన్నారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా వీబీ జీ రాంజీ పథకం కింద 260 ఆదర్శ పంచాయతీల అభివృద్ధికి విన్నవించగా సాయం అందిస్తామని శివరాజ్‌సింగ్‌ హామీ ఇచ్చారు’ అని పవన్‌ చెప్పారు.

నమామి గంగ తరహాలో గోదావరి ప్రక్షాళన!

రాష్ట్రంలో గోదావరి నది ప్రక్షాళనకు సహకారం అందించాలని పవన్‌ కల్యాణ్‌ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా తాగునీటి సరఫరా, నదుల సంరక్షణకు సాయం కోరారు. ‘గోదావరి పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నది పవిత్రతను కాపాడటంపై చర్చించాం. నమామి గంగ, ఇతర నదీ పునరుజ్జీవన కార్యక్రమాల తరహాలో రాష్ట్రంలోనూ నదీ సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలకు సాయం కోరాను. మురుగునీటి శుద్ధి, కాలుష్య నియంత్రణ విషయంలో సూరత్, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని మంత్రి నాతోపాటు వచ్చిన అధికారులకు సూచించారు. నేను కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తాను. గోదావరి ప్రక్షాళనపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్ర మంత్రివర్గంలో చర్చించి తగిన సాయం చేయడంపై పరిశీలిస్తామని చెప్పారు. గోదావరిని పురపాలక, పారిశ్రామిక కాలుష్యం నుంచి రక్షించడానికి సాయం చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను కోరగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తామన్నారు. దాని ఆధారంగా కేంద్ర సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు’ అని పవన్‌ చెప్పారు.

అటవీ శాఖ మంత్రికి వినతులు

కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌తో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖకు మానవ- వన్యప్రాణి ఘర్షణ నివారణ సెంటర్, గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ పర్యవేక్షణ కేంద్రం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, రాష్ట్ర పులుల పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

  • నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యంలో బేస్‌క్యాంపులను 90 నుంచి 150కి పెంచుకోవడానికి అనుమతివ్వాలని, 300 మంది గార్డ్స్‌ నియామకానికి సాయం చేయాలని, వారు క్షేత్రస్థాయిలో తిరగడానికి వాహనాలు సమకూర్చాలని కోరారు. 
  • రాష్ట్రంలోని అభయారణ్యాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆడ పులులను, మధ్యప్రదేశ్‌ నుంచి దేశీయ అడవిదున్నలను, ఒడిశా నుంచి కుంకీ ఏనుగులను కోరుతున్నామని, కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
  • రాష్ట్రంలోని సముద్ర తీరంలో అలల ప్రభావం తీవ్రంగా ఉన్నచోట మొక్కలు నాటి తీరప్రాంతం కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి కేంద్రం నుంచి అదనపు నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, గ్రేట్‌ గ్రీన్‌వాల్‌కు మిస్టీ కింద నిధులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. పవన్‌ కల్యాణ్‌ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, లింగమనేని రమేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అటవీ, పర్యావరణ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఉన్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆహార వ్యర్థాలను.. ఆర్గానిక్‌గా మార్చేద్దాం! వంట గదిలో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యే. ఆహార పదార్థాలతో పాటు కూరగాయల వ్యర్థాలు ఎక్కువగానే మిగిలిపోతుంటాయి.
  • పాద ముద్రలతో చెప్పేయొచ్చు మనుషుల వేలిముద్రలు ఎలా కచ్చితమైన సమాచారాన్నిస్తాయో... అడవుల్లో వన్యప్రాణుల పాదముద్రలు(పగ్‌ మార్క్స్‌) వాటి ఉనికిని స్పష్టంగా బయటపెడతాయి.
  • 85 వేల మొక్కల్లో వందేమాతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కలతో ప్రత్యేకంగా దాని ఆకృతిని తీర్చిదిద్దారు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు.
  • రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ సీజీఎం శేషాచలం వెల్లడి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. ఏపీ సర్కిల్‌ వినియోగదారుల కోసం ఫ్రీడం 2.0 మొబైల్‌ పేరుతో రూపాయికే సిమ్‌ అందిస్తోందని ఆ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం వెల్లడించారు.
  • ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే కారణంతో వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను, అనంతపురం జిల్లాలో ఒకరిని ఆ జిల్లాల విధ్యాశాఖాధికారులు సస్పెండ్‌ చేశారు.
  • నేను గర్వంగా ఫీలవుతున్నా.. బెయిల్‌పై విడుదలయ్యాక సీదిరి అప్పలరాజు ‘నేను చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నా. ఒక సాధారణమైన ప్రమాదాన్ని నేరపూరిత హత్య అంటూ జైలుకు పంపించారు.
  • అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
  • నవ్యాంధ్ర రాజధానిలో చరిత్రాత్మక ఘట్టం ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • సాంకేతికత ఓ సాధనం మాత్రమే.. కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో న్యాయవాదులు సృజనాత్మకతతో ఆలోచించడం మరిచిపోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లిసా గిల్‌ పేర్కొన్నారు.
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక వాయిదా విద్యుత్‌ బస్సులు సహా ఉద్యోగులకు చెందిన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడింది.
  • పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కోసం ఉద్యోగుల పదోన్నతులపై పెట్టిన నిషేధాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.
  • చెరువులను ఆక్రమిస్తే జీవాలకు మేత ఎలా? గొర్రెలు, పశువులు, మేకల మేతకు అనుకూలంగా ఉన్న చెరువు భూములను కొంత మంది ఆక్రమించుకొని పంటల సాగు చేయడంతో మూగజీవాలను ఎక్కడ మేపుకోవాలని గొర్రెల కాపర్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గొర్రెల మందలతో నిరసనకు దిగారు.
  • అసెంబ్లీ సమావేశాలకు భద్రతలో రాజీ పడొద్దు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటుచేయాలని, సభ్యులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
  • మూడేళ్ల బుడతడు.. రాకెట్‌లా దూసుకెళ్లాడు 79 కి.మీ. స్కేటింగ్‌ పూర్తి చేసి ఔరా అనిపించాడు మూడేళ్ల బుడతడు దక్షిత్‌(3).
  • ఆలయాల్లో ఉప ముఖ్యమంత్రి సతీమణి పూజలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.
  • ఎస్‌.కోటలో రూ.200 కోట్లతో హిలోరా రిసార్ట్‌ రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.
  • అందంతో కట్టిపడేసే ఫ్లెమింగో పక్షులు పొడవాటి ముక్కు, ఎత్తయిన కాళ్లతో చూడటానికి అందంగా కనిపిస్తున్న ఇవి ఫ్లెమింగో పక్షులు.
  • తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు..! నాకేం తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు.. ఇవి పోలీసుల కస్టడీలో ఉన్న వైకాపా నేత చింతాడ రవికుమార్‌ చెబుతున్న సమాధానాలు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ గత నెల 30న శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు.. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్సై పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన కేసులో చింతాడ రవి రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
  • ‘భోగాపురం.. ఆహా’రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాల్లో అందించే ఆహారం(ఇన్‌ఫ్లైట్‌ క్యాటరింగ్‌) తయారీకి ఎన్‌కామ్‌ స్కై ప్లేట్స్‌ సంస్థ ఇక్కడే వంటశాల భవనాన్ని ఏర్పాటు చేసింది.
  • ఏడుగురు రాష్ట్ర పోలీసులకు శౌర్య పతకాలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 23 మంది పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది.