మీ ఆరోగ్యానికి మా పింకీ ప్రామిస్!
దివ్య యేల్ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీలో, వార్టన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. ఆమెకు చదువుకునే రోజుల్లోనే నెలసరి క్రమంలో మార్పులు కనిపించినా... అది పీసీఓఎస్ అనే విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత కానీ ఆమె గుర్తించలేకపోయారట.

- A
- A+
- A++

కడుపులో నొప్పి, అధిక రక్తస్రావం... వంటి నెలసరి సమస్యల గురించి ఎవరినైనా అడగాలన్నా, డాక్టర్‌తో చర్చించాలన్నా తెలియని బిడియం. మరోపక్క పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సున్నితమైన ఆంక్షలు... మహిళల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అలాంటివారికి ఉపశమనం కలిగించేందుకే మా ‘పింకీ ప్రామిస్’ అంటారు సంస్థ ఫౌండర్‌లలో ఒకరైనదివ్య బాలాజీ కామెర్కర్.
దివ్య యేల్ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీలో, వార్టన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. ఆమెకు చదువుకునే రోజుల్లోనే నెలసరి క్రమంలో మార్పులు కనిపించినా... అది పీసీఓఎస్ అనే విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత కానీ ఆమె గుర్తించలేకపోయారట. పెళ్లయ్యాక గర్భధారణ సమయంలో వచ్చిన సమస్యల వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అప్పుడు చికిత్స పొందే సమయం కంటే.. ఆసుపత్రిలో వేచి ఉండటమే కష్టంగా తోచిందట. అప్పుడే ‘దేశంలో మహిళల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మార్పు అవసరమని బలంగా అనిపించింది’ అంటారు దివ్య. గతంలో ఆమె టాంజానియాలో హెచ్‌ఐవీ బాధిత మహిళల కోసం, బిహార్‌లో గర్భిణుల పోషకాహారం కోసం పనిచేశారు. అక్కడ వందల మంది మహిళలు తమ వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడటం గమనించారట. ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారంగానే ‘పింకీ ప్రామిస్’ అనే డిజిటల్ గైనకాలజీ క్లినిక్ తీసుకొచ్చారు. దీన్ని స్నేహితురాలు ఆకాంక్ష వ్యాస్‌తో కలిసి ప్రారంభించారామె.
గోప్యంగా ఉంచుతారు...
చాలామంది మహిళలకు వీడియో కాల్స్ మాట్లాడాలన్నా, క్లినిక్‌కి వెళ్లాలన్నా కాస్త సంకోచం ఉంటుంది. అందుకే పింకీ ప్రామిస్ యాప్‌ను ‘చాట్-ఫస్ట్’ విధానంలో రూపొందించారు. కేవలం రూ.99 ప్రారంభ రుసుముతో మహిళలు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా గైనకాలజిస్టులతో నేరుగా చాట్ చేయవచ్చు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించారు. అయితే, ఈ ఏఐ కేవలం రోగి లక్షణాలను, మెడికల్ హిస్టరీని వేగంగా సేకరించి డాక్టర్లకు సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తుది ప్రిస్క్రిప్షన్, సలహాలు మాత్రం అర్హులైన మహిళా వైద్యులే అందిస్తారు. ఇలా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా మాట్లాడటం వల్ల మహిళలు ఏ సమస్యనూ దాచుకోకుండా చాలా నిజాయితీగా వైద్యులతో పంచుకుంటున్నారని దివ్య చెబుతారు. ఈ యాప్‌ను ప్రారంభించినప్పుడు కేవలం మెట్రో నగరాల్లోని చదువుకున్న మహిళలే వాడతారని సంస్థ భావించింది. కానీ ఆశ్చర్యకరంగా.. మొదటి సంవత్సరంలోనే 70 శాతం మంది వినియోగదారులు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల, పట్టణాలు, గ్రామాల నుంచే వచ్చారు. ఇంగ్లిష్ రాకపోయినా, ఫోన్‌లోని ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను వాడుతూ మహిళలు వైద్యులను సంప్రదించడం విశేషం. పదేళ్లుగా తీవ్రమైన పీరియడ్స్ నొప్పితో బాధపడుతూ, ఎందరో డాక్టర్లు ‘ఇది మామూలే’ అని కొట్టిపారేసిన ఒక మహిళకు.. పింకీ ప్రామిస్ వైద్యులు ‘ఎండోమెట్రియాసిస్’ సమస్యను గుర్తించి చికిత్స అందించారట. కేవలం డిజిటల్‌గా మాత్రమే సేవలందించాలనుకున్న పింకీ ప్రామిస్.. మహిళల అభ్యర్థన మేరకు ఇటీవల ముంబయిలో మొదటి ఫిజికల్ క్లినిక్‌ను కూడా ప్రారంభించింది. ‘మన తల్లులు, అమ్మమ్మలు ఎప్పుడూ తమ ఆరోగ్యాన్ని చివరి ప్రాధాన్యతగా చూసుకున్నారు. కానీ నేటి తరం యువతులు అలా కాదు. వారు తమ శరీరం గురించి ప్రశ్నలు అడుగుతున్నారు, నాణ్యమైన వైద్యం కోరుకుంటున్నారు’ అంటారామె.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :