ఆ చిన్నారులకు ఇంగ్లిష్ నేర్పిస్తూ..!
తరగతి గదిలో టీచర్ ఓ ప్రశ్న అడుగుతుంది.. దానికి సరైన సమాధానం తెలిసినా కొందరు పిల్లలు మౌనంగా ఉండిపోతారు. కారణం.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం రాకపోవడమే!

- A
- A+
- A++

(Photo: LinkedIn)
తరగతి గదిలో టీచర్ ఓ ప్రశ్న అడుగుతుంది.. దానికి సరైన సమాధానం తెలిసినా కొందరు పిల్లలు మౌనంగా ఉండిపోతారు. కారణం.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం రాకపోవడమే!
ఆంగ్లంలో బాగా చదువుతారు, రాస్తారు, పాఠాలు అర్థం చేసుకోగలుగుతారు. కానీ వచ్చీ రానీ ఇంగ్లిష్‌లో మాట్లాడితే తోటి పిల్లలు తమను ఎక్కడ హేళన చేస్తారోనన్న ఆత్మన్యూనతతో నోరు మెదపరు మరికొందరు చిన్నారులు.
ఇంగ్లిష్ మాట్లాడడమంటే ఆమడదూరం పరిగెత్తే ఇలాంటి చిన్నారులు ఈ రోజుల్లోనూ చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాల్లోని పిల్లలు ఈ భాష మాట్లాడడంలో వెనకబడినట్లు గుర్తించింది 17 ఏళ్ల రోషిణీ గుప్తా. వీళ్లలో ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యాలు పెంచాలన్న ప్రయత్నంతో మూడేళ్ల క్రితం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం దీన్ని దేశంలోని కొన్ని పట్టణాలలోనే కాదు.. మరో నాలుగు దేశాలకూ విస్తరింపజేసింది. తన ప్రయత్నం ఎంతోమంది పిల్లల్లో మార్పు తీసుకొస్తోందని చెబుతోన్న ఈ యంగ్ ఛేంజ్‌మేకర్ స్ఫూర్తి ప్రయాణం గురించి తెలుసుకుందాం..
ఇంగ్లిష్ అంటే ఇష్టం!
బెంగళూరుకు చెందిన రోషిణి అక్కడి ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పదకొండో తరగతి చదువుతోంది. ఆమెకు ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే ఆసక్తి ఎక్కువ. చిన్నతనం నుంచి ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు, తోటి విద్యార్థులతో కలిసి ఇంగ్లిష్‌లో మాట్లాడడం వల్ల ఈ భాషపై పట్టు పెరిగిందంటోంది రోషిణి.
‘ఇంగ్లిష్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. నేను పెరిగిన వాతావరణమూ ఈ ఇష్టానికి ఓ కారణం. ఇంట్లో అమ్మానాన్నలు నాతో ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవారు. నన్నూ ఈ భాష మాట్లాడేలా ప్రోత్సహించారు. అటు తరగతి గదిలో ఉన్నంతసేపు పాఠాలు, చర్చలు ఈ భాషలోనే జరిగేవి. అయితే అన్ని స్కూళ్లలో, కుటుంబాల్లో పిల్లలకు ఈ తరహా ప్రోత్సాహం లేదన్న విషయం తెలుసుకున్నా. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ భాష ఓ సబ్జెక్టుగానే ఉంటుంది తప్ప.. అందులో మాట్లాడే వాళ్లు చాలా అరుదు. ఇక అనాథాశ్రమాల్లో ఉండే పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నాకున్న ఇంగ్లిష్ భాషా నైపుణ్యాల్ని ఆ చిన్నారులకు పంచాలనుకున్నా. ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘ప్రాజెక్ట్ విద్య’’.. అంటూ తన కార్యక్రమానికి బీజం పడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది.
ఆ విషయం అర్థమయ్యాకే..!
అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు బెంగళూరు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, లెర్నింగ్ సెంటర్స్‌ని సందర్శించింది రోషిణి. అక్కడి పిల్లలతో మాట కలిపింది.
‘నేను అడిగిన ప్రశ్నలకు చాలామంది విద్యార్థులు తమ మాతృభాషలో చకచకా సమాధానాలిచ్చారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికీ ఎంతో ఆసక్తి చూపారు. అయితే నేను ఇంగ్లిష్‌లో మాట్లాడడం ప్రారంభించాక వాళ్లలో ఉత్సాహం క్రమంగా తగ్గిపోవడం గమనించా. మొదట్లో ఉన్నంత ఆత్మవిశ్వాసం ఇప్పుడు లేదనిపించింది. వాళ్ల కళ్లల్లో, మాటల్లో ఒక రకమైన బెరుకు, తడబాటు కనిపించింది. ఒక చిన్నారైతే తను రాసిన ఓ కాన్సెప్ట్ గురించి తన మాతృభాషలో పూస గుచ్చినట్లుగా వివరించింది. కానీ అదే విషయం ఆంగ్ల భాషలో చెప్పమంటే చెప్పలేకపోయింది. అప్పుడర్థమైంది.. చాలామంది పిల్లలు ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడానికి కారణం.. దీనిపై పట్టు లేకపోవడం, భావ వ్యక్తీకరణ చేయలేకపోవడమే అని. ‘ప్రాజెక్ట్ విద్య’తో ఈ గ్యాప్‌ని పూడ్చడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటోన్న రోషిణి.. దీని ద్వారా 4-9 తరగతుల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పుతోంది.
దశల వారీగా..
‘బెంగళూరు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, లెర్నింగ్ సెంటర్స్‌లో చదువుకొనే చిన్నారులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా చేయాలనుకున్నా. ఈ క్రమంలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికలుగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ దశల వారీగా వారికి స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పిస్తున్నా.
ముందుగా వారికి వ్యాకరణ నైపుణ్యాలు నేర్పించి.. వాళ్ల ఆలోచనల్ని ఇంగ్లిష్‌లో వ్యక్తం చేసేలా ప్రోత్సహిస్తున్నా. ఇలా వాళ్లు మాట్లాడేటప్పుడు ఏవైనా తప్పులుంటే మధ్యలో కల్పించుకొని వాటిని సరిచేయను. వాళ్ల మాటలు పూర్తయ్యాకే వీటిని సరిదిద్దుతా. ఎందుకంటే మధ్యలో అంతరాయం కలిగించడం వల్ల వాళ్లు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.. పైగా ఎక్కువ తప్పులొస్తున్నాయన్న భయంతో మాట్లాడలేకపోవచ్చు. ఇంగ్లిష్ మాట్లాడే విషయంలో ఇలా ముందుగా వాళ్లలో ఉన్న భయాన్ని దూరం చేస్తున్నా.
ఒకే విషయాన్ని పదే పదే చదువుతూ బట్టీ కొట్టడం కంటే.. పరస్పరం చర్చించుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, మార్గనిర్దేశనం చేయడం వల్ల ఎంతో నేర్చుకోగలుగుతాం. ఇదే సిద్ధాంతాన్ని మా వర్క్‌షాప్ సెషన్స్‌లోనూ భాగం చేస్తున్నా. పిల్లలు ఒకరితో ఒకరు ఇంగ్లిష్‌లో మాట్లాడుకునేలా, పరస్పరం సహకరించుకునేలా, ప్రోత్సహించుకునేలా చేస్తూ.. ఆడుతూపాడుతూ ఆంగ్ల భాష నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నా..’ అంటూ తమ శిక్షణ విధానాల గురించి చెబుతోంది రోషిణి.
వందల మంది చిన్నారులకు మేలు!
ప్రస్తుతం బెంగళూరుతో పాటు దిల్లీ, హైదరాబాద్.. తదితర ప్రాంతాలకూ తన కార్యక్రమాన్ని విస్తరించింది రోషిణి.. మరోవైపు దక్షిణాఫ్రికా, యూఏఈ కి చెందిన కొన్ని దేశాల్లో ఉన్న చిన్నారులకూ ఆన్‌లైన్ వేదికగా స్పోకెన్ ఇంగ్లిష్ నైపుణ్యాలు నేర్పుతోంది. ఇందుకోసం కొంతమంది యువ వలంటీర్లనూ నియమించుకుంది. ఒక్కో వర్క్‌షాప్‌లో 30-40 మంది చిన్నారుల్ని భాగం చేస్తూ ఆటపాటలతో ఆసక్తిగా వారు భాషా నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. అంతటితో ఆగకుండా.. పేద పిల్లలకు పుస్తకాలు సేకరించి అందించడం, డబ్బు నిర్వహణ-పొదుపు పాఠాలు చెప్పడం, ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పించడం.. వంటివి కూడా చేస్తోంది. ‘1ఎం1బీ ఫౌండేషన్ (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్)’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నుంచి మెంటార్‌షిప్ పొందిన ఈ టీనేజర్.. తన కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దాదాపు 50కి పైగా వర్క్‌షాప్స్ నిర్వహించింది. తద్వారా 1700 మందికి పైగా చిన్నారులకు స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇచ్చింది.
‘ప్రాజెక్ట్ విద్యను మరిన్ని రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించాలన్నదే నా భవిష్యత్ లక్ష్యం. ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే కొంతమంది చిన్నారుల్లో మార్పు తీసుకొస్తోంది. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారీ ధైర్యంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగితే నా ప్రయత్నం విజయవంతమైనట్లే..’ అంటోన్న రోషిణి.. ఖాళీ సమయాల్లో బాస్కెట్ బాల్ ఆడతానంటోంది.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :