ప్రజారోగ్యానికి శాపాలు!

Eenadu icon
By Editorial News Team Published : 25 Feb 2026 02:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

యే ప్రాంతాల్లో ఎవరి భోజన అలవాట్లు ఎలా ఉన్నప్పటికీ పాల విషయంలో ఆ భేదాలేవీ కనపడవు. పుష్టికరమని చెప్పి పొద్దున్నే పిల్లలకు పట్టించడం, రాత్రి పడుకునే ముందు పెద్దవారు గ్లాసు పాలు తాగడం వంటివి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ సర్వసాధారణ దృశ్యాలే. ఇక టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ, నెయ్యి తదితరాలకు దూరంగా ఉండేవారు అరుదే! పాలతో తయారయ్యే రకరకాల స్వీట్ల సంగతి సరేసరి! ఇలా కోట్ల మంది రోజూ తీసుకునే పాలూ పాలపదార్థాల్లో నాణ్యత గురించి తెలిస్తే, కడుపులో దేవేసినట్లవుతుంది! రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ వంటి పథకాల పుణ్యమా అని దేశీయంగా 2014-15లో 14.63 కోట్ల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2023-24 నాటికి 23.93 కోట్ల టన్నులకు చేరింది. కానీ, పాడి పరిశ్రమ ఎక్కువగా అసంఘటిత రంగంలోనే ఉండటంతో కల్తీ పాపాలూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో అనధికార డెయిరీ నుంచి సరఫరా అయిన పాలు గరళమై అయిదు ప్రాణాలు పోయాయి. నెత్తుటికూడుకు లొట్టలేసే కొందరి స్వార్థానికి వ్యవస్థాగత అలక్ష్యం తోడుకావడంతోనే సమతులాహారమైన పాలు ప్రాణాంతకమవుతున్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న దారుణోదంతాలు- ప్రజారోగ్య సంరక్షణలో మన వెనకబాటుతనాన్ని పట్టిచూపిస్తున్నాయి!

కార్లు, ట్రక్కులు, కర్మాగారాల్లో కూలెంట్‌గా వాడే ఇథలీన్‌ గ్లైకాల్‌ చాలా ప్రమాదకరమైనది. కాబట్టి డెయిరీలూ ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఫుడ్‌గ్రేడ్‌కు చెందిన ప్రొపైలీన్‌ గ్లైకాల్‌ను మాత్రమే వాడాలి. చవగ్గా దొరుకుతుందని చెప్పి కక్కుర్తిపరులు కొందరు కొన్ని డెయిరీల్లోని శీతలీకరణ యంత్రాల్లో కూలెంట్‌గా ఇథలీన్‌ గ్లైకాల్‌ను వినియోగిస్తూ జనం ప్రాణాల పైకి తెస్తున్నారు. రాజమహేంద్రవరంలోనూ ఇలాగే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అధిక ఉత్పత్తికోసం ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లతో పితకడానికంటే ముందే క్షీరాన్ని కలుషితం చేయడం మొదలు కాలంచెల్లిన పాలపొడికి పామాయిల్, యూరియా, నీళ్లు కలిపి కల్తీ పాలు తయారుచేయడం దాకా జరుగుతున్న పాతకాలు అనేకం! గంజిపొడి, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, కాస్టిక్‌ సోడా, వంటసోడా, డిటర్జెంట్లు, మెలమైన్, మాల్టోడెక్స్‌ట్రిన్‌ వంటివాటిని పాలల్లో కలిపేసి యథేచ్ఛగా విక్రయిస్తున్న కల్తీరాయుళ్ల కారణంగా అజీర్తి, కడుపునొప్పి సమస్యలు తలెత్తడంతోపాటు మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. కాలేయం, నాడీసంబంధిత వ్యాధులూ క్యాన్సర్లు కూడా కోరచాస్తున్నాయి!

పాలూ పాలపదార్థాల కల్తీపై 2022-25 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 35,968 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటిలో 24,845 కేసుల్లో నిందితులకు శిక్షలు పడటమో, జరిమానాలు వసూలుచేయడమో జరిగినట్లు సర్కారీ దస్త్రాలు చెబుతున్నాయి. కానీ, అరకొర దండనల మూలంగా పాపాల భైరవుల్లో బెరుకు ఉండటం లేదు. భావితరాలనూ దుర్బలం చేసే కల్తీపాలను కట్టడిచేయాలంటే సంబంధిత నేరగాళ్లకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు విధించాలన్న న్యాయపాలిక సూచన అమలులోకి రావాలి. తెల్లనివన్నీ పాలు కావన్న స్పృహతో ప్రజలూ కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కడపడితే అక్కడ ఏవి పడితే అవి కొనుగోలు చేయకపోవడం, రంగూ రుచీ చిక్కదనాల్లో కొద్దిపాటి తేడా కనిపించినా సందేహించడం ప్రాణావసరం. ఆహార కల్తీల కారణంగా ముసురుకుంటున్న రోగాలతో దేశంలో ఏటా 1.20 లక్షల మంది చనిపోతున్నారని, వైద్యవ్యయ భారాలూ ఉత్పాదకత నష్టంతో భారతావని ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు కోల్పోతోందని అంచనా. ఫుడ్‌సేఫ్టీ విభాగాల్లో ఖాళీలను భర్తీచేసి, ప్రయోగశాలలను పెంచి, విష వ్యాపారులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపితేనే ఈ విషాదపర్వాలు ఆగుతాయి!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.