ఉపాధి వెలుగుల పుట్టగొడుగుల రాణి!
కొన్నేళ్ల క్రితం వరకూ ఆమె సాధారణ గృహిణి... కానీ, ఇప్పుడు అగ్రిప్రెన్యూర్‌గా మారి తాను ఆదాయం అందుకోవడమే కాదు... వందల మంది రైతులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆమే పుట్టగొడుగుల రాణిగా పేరొందిన శోభాదేవి.

- A
- A+
- A++

కొన్నేళ్ల క్రితం వరకూ ఆమె సాధారణ గృహిణి... కానీ, ఇప్పుడు అగ్రిప్రెన్యూర్‌గా మారి తాను ఆదాయం అందుకోవడమే కాదు... వందల మంది రైతులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆమే పుట్టగొడుగుల రాణిగా పేరొందిన శోభాదేవి.
శోభాదేవిది బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలోని టిక్హా. భర్త రాజ్ కిషోర్ మహతో ఉపాధికోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. వారికి ముగ్గురు సంతానం. పిల్లల పెంపకం, అత్తమామల సంరక్షణతోనే ఆమె జీవితంలో ఏళ్లు గడిచిపోయాయి. భర్త పంపించే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తనూ ఏదైనా పని చేస్తే కుటుంబానికి ఆసరాగా ఉండొచ్చని అనుకున్నారామె. కానీ, చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా కనీస పెట్టుబడి చేతిలో లేదు. దాంతో ఆలోచనల్లో పడ్డారు. అదే సమయంలో ఆ రాష్ట్రప్రభుత్వం స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం ఆరంభించింది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ అందించింది. ఇందుకోసం తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసింది. అందులో చేరారు శోభా. ఓ రోజు గ్రూప్ లీడర్ ఈమెను పిలిచి జీవిక యోజన స్కీమ్‌లో భాగంగా అగ్రికల్చర్ ఆంత్రప్రెన్యూర్ (ఏఈ) ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆసక్తి ఉంటే అందులో చేరాలని సూచించారు. అందుకు శోభ అంగీకరించారు. ఈ నిర్ణయమే ఆమె భవిష్యత్తును మార్చింది.
మారిన ఆలోచన...
శోభాదేవి అగ్రికల్చర్ ఆంత్రప్రెన్యూర్ ప్రోగ్రామ్‌లో 21 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆధునిక వ్యవసాయం, వ్యాపార నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ, నర్సరీ నిర్వహణ, పుట్టగొడుగుల పెంపకం, వర్మీ కంపోస్టింగ్, మల్చింగ్ పద్ధతులు, ధాన్యం వ్యాపారం వంటి వాటిపై నిపుణులు అవగాహన కల్పించారు. వీటితోపాటు ఖర్చు నిర్వహణ, లాభాలను పెంచుకోవడం, రైతులతో కమ్యూనికేషన్ వంటి అంశాలనూ నేర్పించారు. ఇవన్నీ శోభాదేవి ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చాయి. ఆమె ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చాయి. అదయ్యాక వర్మీకంపోస్ట్ తయారీ చేపట్టారు. అమ్మకాలతో వచ్చిన ఆదాయంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మరో పక్క పుట్టగొడుగుల పెంపకం ఆరంభించారు. దీని ద్వారా వచ్చే లాభాలను తిరిగి అందులోకే పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని విస్తరించారు. ఆ ప్రయాణం సాగుతుండగానే మరొక లోన్ తీసుకొని వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సరైన అవగాహన లేక రైతులు అతిగా ఎరువులు వేయడం, తప్పుడు రకాల్ని వాడటం వంటివి చేసేవారు. దీనివల్లే పంట నష్టం జరిగేది. అలా జరగకుండా తన వ్యవసాయ సేవా కేంద్రం ద్వారా నేల నిర్వహణ, పంట సాగు మెలకువలు, తెగుళ్ల సంబంధిత సమస్యలపై రైతులకు కచ్చితమైన సలహాలను అందించడం మొదలుపెట్టారు. సుమారు 400 మంది రైతులు శోభ ఖాతాదారులుగా ఉన్నారు. ఈ నెట్‌వర్క్ సాయంతో పుట్టగొడుగుల్ని మార్కెటింగ్ చేయడం ఆరంభించారామె. వీటితో నెలకు సుమారు రూ.15-20 వేల వరకూ స్థిరమైన ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఆమె జీవితంలో వచ్చిన మార్పు వల్ల కలిగిన ప్రయోజనం తనతోనే ఆగలేదు. పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది. అందుకే శోభను పుట్టగొడుగుల రాణిగా పిలుస్తారు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :