6జీ.. రేపటి నవలోకం!

Eenadu icon
By Editorial Team Published : 22 Feb 2026 01:44 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

రేపటి సాంకేతికతగా 6జీ అభివృద్ధి చెందుతోంది. 6జీ అంటే వేగమైన ఇంటర్నెట్‌ మాత్రమే కాదు. మనిషి, యంత్రం, సమాజం మధ్య సంబంధాన్ని కొత్తగా నిర్వచించే ప్రయత్నం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, గణితం, కంప్యూటర్స్, మెటీరియల్‌ సైన్స్‌ అన్నీ కలిసి రూపొందించే భవిష్యత్తు చిత్రం. ఇది ఆరోగ్యం, రవాణా, పరిశ్రమలు, గ్రామీణ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. వాటికి సంసిద్ధమైతేనే రేపటి ప్రపంచంలో మన పాత్ర కీలకంగా మారుతుంది.

మొబైల్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ నాలుగు దశలు దాటింది. ప్రస్తుతం 5జీ (అయిదోతరం) యుగంలోకి అడుగు పెట్టాం. అయితే, ప్రపంచం ఇక్కడితో ఆగడం లేదు. రేపటి అవసరాలు 5జీ సాంకేతికత 
సామర్థ్యానికి మించిపోతాయి. డ్రైవర్‌ లేని వాహనాలు, సుదూర శస్త్రచికిత్సలు, హోలోగ్రాఫిక్‌ సమావేశాలు, స్మార్ట్‌ నగరాలు వంటివన్నీ పని చేయాలంటే, కేవలం వేగం మాత్రమే సరిపోదు. నెట్‌వర్క్‌ అత్యంత వేగంగా ఆలోచిస్తూ, కచ్చితత్వంతో స్పందిస్తూ, పరిసరాలనూ గమనించగలగాలి. ఇలాంటి అవసరాల నుంచి పుట్టిందే 6జీ పరిజ్ఞానం. ఇది ఆరోతరం సెన్సింగ్, ఏఐ ఆధారిత వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ. 2030 నాటికి, దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్షిస్తున్నారు. 5జీలో మనం డేటానే పంపిస్తాం. 6జీలో నెట్‌వర్క్‌ ఆ డేటా ఎందుకు పంపుతున్నామో కూడా అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు, ఒక రోగి గుండె చప్పుళ్ల సమాచారం డాక్టర్‌కు పంపితే, అది కేవలం సంఖ్యలుగా కాకుండా, ప్రమాదం ఉంటే, ఆ అర్థంలోనే చేరుతుంది. ఈ మార్పు 6జీని విప్లవాత్మకంగా మార్చనుంది.

నాణ్యమైన వైద్యం... మెరుగైన విద్య

ప్రతి వైర్‌లెస్‌ టెక్నాలజీకి ప్రాణం ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం. 5జీ వరకు మనం గిగాహెర్ట్జ్‌ స్థాయిలో (ఒక సెకనులో వందకోట్ల సార్లు జరిగే తరంగ కదలికల పరిమాణం) పనిచేశాం. 6జీలో శాస్త్రవేత్తలు టెరాహెర్ట్జ్‌(సెకనులో లక్ష కోట్ల ఆవర్తనాలు జరిగే స్థాయి) అనే అత్యధిక ఫ్రీక్వెన్సీ తరంగాలను వాడనున్నారు. అందుకే 6జీలో డేటా వేగం వందల గిగాబిట్స్‌ నుంచి టెరాబిట్స్‌ స్థాయికి చేరుతుంది. సాధారణంగా మనం చూసే టవర్లు అన్ని వైపులకీ సిగ్నల్‌ పంపుతాయి. కానీ 6జీలో వినియోగదారుడు ఎక్కడ ఉంటే అటువైపే సిగ్నల్‌ కేంద్రీకృతమవుతుంది. ఈ విధానాన్ని ‘బీమ్‌ఫార్మింగ్‌’ అంటారు. దీంతోపాటు ‘మాసివ్‌ మిమో’ అనే విధానాన్ని వాడతారు. ఇందులో ఒక టవర్‌ అనేక చిన్న యాంటెన్నాల సాయంతో, ఒకేసారి చాలామందికి వేర్వేరుగా సిగ్నల్‌ పంపగలదు. ఫలితంగా నెట్‌వర్క్‌ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా గోడలు, భవనాలు, చెట్లు అడ్డుపడటంతో మొబైల్‌ సిగ్నల్‌ సరిగ్గా రాదు. 6జీలో దీన్ని అధిగమించేందుకు గోడలు, భవనాల మీద ప్రత్యేకంగా తయారు చేసిన స్మార్ట్‌ ప్యానెల్స్‌ను అమరుస్తారు. ఇవి సిగ్నల్‌ను అవసరమైన దిశగా మళ్లిస్తాయి. దీనివల్ల నగరాల్లో, ఇళ్ల మధ్య, రద్దీ ప్రాంతాల్లో మెరుగైన నెట్‌వర్క్‌ను అందించవచ్చు. 6జీ సిగ్నల్‌ ద్వారా మన కదలికలు, శ్వాస వేగం, హృదయ స్పందనలను ప్రత్యేక సెన్సర్లు లేకుండానే గుర్తించవచ్చు. కార్లు తమ చుట్టూ ఉండే వస్తువులను రాడార్‌లా గుర్తించగలవు. ఇది భద్రత, ఆరోగ్యం, రవాణా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ‘సెమాంటిక్‌ కమ్యూనికేషన్‌’ అనే కొత్త విధానంలో కేవలం పదాలు, సంఖ్యలనే కాకుండా, వాటి వెనకున్న ముఖ్యమైన భావాన్నీ పంపించగలదు. 6జీ ద్వారా గ్రామాలకు నాణ్యమైన వైద్యం, మెరుగైన విద్య అందుబాటులోకి వస్తాయి. విదేశాల్లో ఉండే డాక్టర్లు రోబోటిక్‌ సాంకేతికత సాయం రోగులకు అత్యవసర శస్త్రచికిత్సలు చేయగల సామర్థ్యం వస్తుంది. 3డీ దృశ్యాలు, ఏఐ సహాయంతో విద్యార్థులు పాఠాలను ప్రత్యక్షంగా తరగతిలో కూర్చుని వింటున్న అనుభూతిని పొందవచ్చు. వ్యవసాయంలో నీటి వినియోగం, పంట దిగుబడి అంచనాలు మరింత కచ్చితంగా జరుగుతాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు తగ్గించవచ్చు. యువతకు కొత్త తరహా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. 6జీ నెట్‌వర్క్‌లు భూమిపై ఉండే టవర్లకే పరిమితం కాకుండా, శాటిలైట్‌ ఆధారిత స్పేస్‌ కమ్యూనికేషన్‌తో అనుసంధానమవుతాయి. దీనివల్ల సముద్రాలు, అడవులు, సరిహద్దు ప్రాంతాలు, అంతరిక్షందాకా నిరంతర కనెక్టివిటీ సాధ్యమవుతుంది.

డిజిటల్‌ ప్రపంచంపై పట్టుకోసం...

తరంగాలు వేగంగా బలహీనపడటం ఈ సాంకేతికతలోని ఓ సమస్య. దూరం పెరిగే కొద్దీ సిగ్నల్‌ త్వరగా తగ్గిపోతుంది. గోడలు, భవనాలు అడ్డుపడతాయి. ఈ సమస్యల్ని అధిగమించే దిశగా కసరత్తు జరుగుతోంది. టెరాహెర్ట్జ్‌ తరంగాలపై పనిచేసే పరికరాల తయారీ కష్టం. కొత్త రకం సెమీకండక్టర్‌ చిప్‌లు, కొత్త మెటీరియల్స్‌ అవసరమవుతాయి. ఇవన్నీ ఖరీదైనవే కావడంతో భారీస్థాయిలో 6జీ హార్డ్‌వేర్‌ తయారీ కొంత కష్టమే. అధిక ఫ్రీక్వెన్సీలపై పనిచేసే వ్యవస్థలు ఎక్కువ విద్యుత్తును వాడటం వల్ల ప్రస్తుత ఫోన్‌ బ్యాటరీల సామర్థ్యం సరిపోదు. అందుకని, తక్కువ విద్యుత్తుతో పనిచేసే సర్క్యూట్లు, కొత్త బ్యాటరీ టెక్నాలజీలపైనా పరిశోధన జరుగుతోంది. నెట్‌వర్క్‌ స్మార్ట్‌గా మారినకొద్దీ సైబర్‌ దాడుల ముప్పూ పెరుగుతుంది. ఆరోగ్య సమాచారం, వాహనాల నియంత్రణ, పరిశ్రమల వ్యవస్థలు వంటివన్నీ నెట్‌వర్క్‌తో అనుసంధానమైతే, చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారాలు గుర్తించడమే ప్రస్తుత 6జీ పరిశోధనల లక్ష్యం.

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెలికాం కంపెనీలు ఇప్పటికే 6జీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త ల్యాబ్‌లు, టెస్ట్‌బెడ్‌లు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా దీన్ని కేవలం టెక్నాలజీగా కాకుండా వ్యూహాత్మక అంశంగా చూస్తున్నాయి. 6జీపై ఆధిపత్యం ఉండే దేశాలే రేపటి డిజిటల్‌ ప్రపంచాన్ని నియంత్రిస్తాయి. ఐరోపా, అమెరికా, చైనా, జపాన్‌ వంటి దేశాలు ప్రత్యేక 6జీ మిషన్లు ప్రారంభించాయి. భారత్‌ ఇప్పటికే 6జీపై స్పష్టమైన దృక్పథాన్ని ప్రకటించింది. మనకున్న అపార ఐటీ ప్రతిభ, ఇంజినీరింగ్‌ విద్య, స్టార్టప్‌ సంస్కృతి ఈ రంగంలో మనల్ని కచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలవు. సరైన విధానాలు, పరిశోధనలు, పరిశ్రమల సహకారం ఉంటే, ఇండియా కేవలం వినియోగదారుడిగా కాకుండా, 6జీ టెక్నాలజీని రూపొందించే దేశంగా మారగలదు.  

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.