సరిగమల రహదారి

- A
- A+
- A++
‘కలాపోసన లేకుంటే- మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’ అనే ప్రశ్న వినడానికి మొరటుగా ఉన్నా- అందులో నిజముంది. నిస్సారమైన జీవితానికి సంగీత సాహిత్యాది కళల మంత్ర స్పర్శ సోకితే- ఆ బతుకులో నాణ్యత పెరుగుతుంది. సారవంతం అవుతుంది. హిరణ్యకశిపుడి తపోదీక్షను భగ్నం చేయడానికి వచ్చిన అప్సరసల గంధర్వ గాన మాధుర్యాన్ని వివరిస్తూ, నృసింహ పురాణంలో ఎర్రన- ఆ స్పర్శ ప్రభావాన్ని చెప్పాడు. ‘అమృతంపు సోన -పైన అడరినట్లే (కురిసినట్లుగా) పాట చెన్నున... మోడులు చివురించాయి. చెట్లు పులకించాయి. సెలయేర్లు ఆనంద బాష్ప ధారలను స్రవించాయి. పర్వతాలు కరిగి నీరయ్యాయి’ అన్నాడు. అవి సరే, ‘చేతనంబులెల్ల చిత్ర రూపులట్లు సోలి నిలిచె’... కదిలే జీవులు కూడా పరవశంతో బొమ్మల్లా నిలబడి పోయాయట. అలాంటి సంగీతం బండరాయి లాంటి గుండెకాయను సైతం వెన్నముద్దను చేస్తుంది. ఆ మార్దవమే మనిషి బతుకును జీవనయోగ్యం చేస్తుంది. ఆపై ‘ఆకు మెదిలినా- పాటే, అలలు కదిలినా- పాటే, కలలు చెదిరినా- పాటే, కలత ముదిరినా- పాటే!’... పసితనం ఎదలో తిరిగి మొలకెత్తాలేగాని- బతుకంతా ఇక తీయని పాటే!
ద వించీ సృష్టించిన మోనాలిసా కమ్మని నవ్వులోని కమనీయతనో, అజ్ఞాత ఆదివాసీ కళాకారుడు అరచేతులతో రుద్ది మరీ నునుపు తెచ్చిన దారుప్రతిమ(కర్రబొమ్మ)లోని మహనీయతనో, ఎర్రన వర్ణించిన పై సంగీత మాధుర్య రమణీయతనో తనివితీరా ఆస్వాదించడం అలవడకుండానే జీవితం ముగిసిపోతే- ఆ బతుక్కి అర్థం ఏముంటుంది? కాలానికి నిచ్చెన వేసే అపురూప కళా స్వరూపాలను తిలకించి పులకించి తరించినప్పుడే కదా బతుకు పండేది! వాటిలో సులభంగా అనుభవంలోకి వచ్చేది- సంగీత కళ. పసివారిని, పశువులనూ సైతం సంగీతం అలరిస్తుందంటారు. ‘వినికిడి కళ’ అలవడితే- ‘నూతన సంజాత మరందమై శ్రుతి పుటాంతః ప్రీణనం’... చెవి లోలోపలి భాగాలపై సంగీతం మధువును చిలకరిస్తుందన్నారు కవులు. ఎనలేని తృప్తిని కలిగించి, ‘హృదయం’ అనే పదం మధ్యలో ఇరుక్కున్న ‘దయను’ వెలికి తీస్తుంది. మనిషిని చేస్తుంది. శ్రీశ్రీ అన్నట్లు ‘వ్యధల్ని చించి సుధల్ని పంచుతుంది’. సంగీతం- మనోవ్యాధులకు పరమౌషధం!
కళగా తేలిగ్గానే పట్టుబడే సంగీతం- జ్ఞానంగా ఓ పట్టాన అంతుచిక్కదు. ‘శిశుర్వేత్తి’ శ్లోకంలో వాస్తవానికి శిశువంటే కుమారస్వామి, పశువంటే నందీశ్వరుడూను. సంగీత జ్ఞానులు వారు. అలాగే- నారద, తుంబురుల గానం ‘తేెనియ ముసురో అమృతపు వానయో పుండ్రేక్షు(చెరుకు) రసమో’ అన్నట్లుగా ధారాపాతమై ముంచెత్తిందన్నాడు నన్నెచోడకవి. వారిలో ఎవరు గొప్పో చెప్పాలంటే ఒక్క హనుమకే సాధ్యమైంది. హనుమ గాన పటిమను ‘వర తారకాంతర స్ఫురిత నాద ప్రౌఢి... మహాయోగుల సహస్రారచక్రంలో నాద బిందు సంయోగస్థితికి కారణమయ్యే పాండిత్యం’ అన్నాడు పుష్పగిరి తిమ్మన. అంటే గొప్ప సంగీతం తొలుత చెవులను, పిదప ఎదలను, తుదకు షట్చక్రాలను సైతం కదిలిస్తుందని అర్థం. ‘సంగీతజ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే?’ అన్న త్యాగరాజ కీర్తనలో, సన్మార్గం అంటే- నిర్వాణ సోపాన అధిరోహణ దిశగా సాగే దారి. అంతలేకున్నా- కనీస కళాపోషణ అభిరుచిని పెంపొందించాలని ‘సంగీత రహదారి’ని నిర్మించింది- ముంబయి నగరపాలిక. వాహనాల రాపిడికి సుస్వర ధ్వని తరంగాలు చెవిన పడేలా ‘మ్యూజికల్ స్ట్రిప్స్’ను నేలపై అతికించింది. ఆ సదాలోచన సంగీత సంస్కారాన్ని ఏ మేరకు అలవరుస్తుందో చూడాలి!
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.