మార్గశీర్షం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మనిషి జన్మ... అతడి కర్మలు దేవదేవుడి సన్నిధానం చేరడానికే! భగవంతుడి సూచనలు పాటిస్తూ ఆయననే స్మరిస్తూ పవిత్రంగా బతికి పరాత్పరుడి చెంత చేరితే అదే మోక్షం. ధనుర్మాసంలో విష్ణుపూజ చేస్తే భగవంతుడు త్వరగా కరుణిస్తాడని పద్మ పురాణం చెబుతోంది. మాసాలలో ధనుర్మాసాన్ని నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. సాత్విక ఆరాధనలకు ధనుర్మాసం ప్రధానమైనది. గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించినదే.
సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. దీన్నే పండుగ నెలపట్టడం... అంటారు. ధనుర్మాసం నెల రోజులూ పండుగ హడావుడిని గుర్తు చేస్తూ ఇళ్లముందు అందమైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. ఈ నెలలో శ్రీవ్రతం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. గోదాదేవి భగవంతుణ్ని భర్తగా పొందేందుకు చేసిన ఈ వ్రతం భక్తిపూర్వక ఆరాధనలకు పరాకాష్ఠ. ఆధ్యాత్మిక సాధనలకు, భగవత్సేవకు ధనుర్మాసం అనువైన సమయం. గోదాదేవి (ఆండాü్) విష్ణుచిత్తుడికి పూలతోటలో దొరికిన కుమార్తె, ఏకైక మహిళా ఆళ్వార్. విష్ణుభక్తుడైన విష్ణుచిత్తుణ్ని పెరియాళ్వార్ అని కూడా పిలుస్తారు. రోజూ శ్రీరంగనాథుడికి సకల కైంకర్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో ఉండేవాడు. గోదాదేవి పెంపుడు తండ్రిని అనుసరిస్తూ శ్రీకృష్ణ లీలలు వింటూ భక్తురాలిగా మారింది.
శ్రీవ్రతం అంటే తిరుప్పావై చదువుతూ శ్రీకృష్ణ పరమాత్మ సేవకు సిద్ధం కావడం. తిరుప్పావై భక్తి గీతమాలిక. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈ మాసంలో శ్రీఆండాళ్ తన అంతరంగంలో తాదాత్మ్యం చెందుతూ పాశురాలను రచించి భగవత్సంగమం కోసం పరితపించింది. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది కనుక ధనుర్మాసాన్ని మార్గశీర్షమనీ అంటారు.
పూర్వం ద్వాపర యుగంలో పెళ్లి కాని యువతులు శ్రీకృష్ణుడే తమ భర్తగా రావాలని కోరుతూ కాత్యాయని వ్రతం చేశారు. అదే కోరికతో ఆండాళ్ తాను నివసించే శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయిని కృష్ణుడిగా తలచి, ఆ దైవంపై అద్భుతమైన ఆధ్యాత్మిక గీతాలను రచించింది. ఈ గీతాలనే తిరుప్పావై అంటారు. ‘తిరు’ అంటే మంగళకరం. ‘ప్పావై’ అంటే వ్రతం అని అర్థం. విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్పై పాశురాల గీతమాలిక తిరుప్పావై. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు గానం చేసి బెల్లంతో చేసిన పొంగలి పరమాత్మకు నైవేద్యం పెట్టడం సంప్రదాయం. ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, మార్గళి అనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు. తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. ఇది వైష్ణవ సాహిత్యమనేగాక, సాహితీ విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన. దైవ సాక్షాత్కారానికి చక్కని వేగుచుక్క.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :