Data Protection: విపత్తుల్లో డేటాను కాపాడేదెవరు?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మనందరి ఆధార్ వివరాలు, యూపీఐ లావాదేవీలు, భూములు, ఆస్తిపాస్తులు, ఆర్థిక సమాచారం, జనాభా లెక్కలు... ఇదంతా మహాసముద్రమంత డేటా! ప్రభుత్వం దగ్గర అది భద్రంగానే ఉన్నా, ఏదైనా అనుకోని ముప్పు వస్తే? దేశంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే, యుద్ధాలు వస్తే, ఇంటర్‌నెట్, టెలికం వ్యవస్థలు ఆగిపోతే, సర్వర్లు మొరాయిస్తే ఎలా? ప్రభుత్వ, ప్రజల కార్యకలాపాలన్నీ ఆగిపోవూ! దేశం స్తంభించదూ! సంక్షోభంలోకి కూరుకుపోదూ! ఇలాంటి ఊహించని ఉత్పాతాలను ఎదుర్కొనేందుకు డేటా ఎంబసీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవల యూఏఈ అధ్యక్షుడి ఇండియా పర్యటనలో ఇందుకు తొలి అడుగు పడింది.
డేటా ఎంబసీ అనేది సాధారణ దౌత్య కార్యాలయం కాదు. ఒక దేశం తమ కీలకమైన డిజిటల్ డేటాను విదేశంలోని ఒక కేంద్రంలో భద్రపరచుకుంటుంది. దీనివల్ల సైబర్ దాడులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వంటి భౌగోళిక రాజకీయ సంక్షోభాలు ఎదురైనప్పుడు సైతం ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చు. మనకు విశ్వసనీయమైన ఆతిథ్య దేశంలో కీలకమైన డేటాబేస్‌ను సురక్షితంగా దాచి ఉంచడం ద్వారా ఇది సుసాధ్యమవుతుంది. డేటా ఎంబసీ విదేశీ గడ్డపై ఆ దేశం నిర్వహణలోనే ఉంటుంది. అక్కడి చట్టాల పరిధిలోనే పనిచేస్తుంది. కాకపోతే, ఎంబసీలోని సర్వర్లలో భద్రపరచిన డేటాపై నియంత్రణ, ఆ సమాచారం యాక్సెస్ సొంత దేశానికి, ఆ దేశ ప్రతినిధులకే ఉంటుంది. స్థానిక చట్టాల నుంచి రక్షణ లభిస్తుంది. సెర్చి వారంట్లు, జప్తులు చెల్లవు. సమాచారాన్ని ఆ దేశం కోరడం, దానిపై ఉత్తర్వులు ఇవ్వడం కుదరదు. ఇదొక క్లౌడ్ ఎంక్లేవ్‌లా పనిచేస్తుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యం
దౌత్య సంబంధాలపై వియన్నా ఒడంబడిక ప్రకారం ఒక దేశం... తమ గడ్డపై ఏర్పాటైన విదేశీ దౌత్య కార్యాలయానికి ఎలాంటి భద్రత, న్యాయరక్షణ, అతిక్రమణలకు అవకాశం లేని ఇమ్యూనిటీని కల్పిస్తుందో డేటా ఎంబసీకి కూడా అవన్నీ వర్తిస్తాయి. డేటా ఎంబసీలో దేశపు అత్యంత విలువైన డిజిటల్ సంపదను, అంటే పౌరుల గుర్తింపు డేటాబేస్‌లను, ఆర్థిక రిజిస్ట్రీలు, ప్రభుత్వ కీలక రికార్డులను భద్రపరుస్తారు. ఇండియాకు సంబంధించిన డేటా డిజిటల్ రూపంలో బ్యాకప్‌గా యూఏఈ డేటా ఎంబసీలో జాగ్రత్త చేస్తారు. ఇందులో కీలకమైన ఆర్థిక సమాచారంతోపాటు, ప్రజలకు సంబంధించిన రికార్డులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇండియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని తమ దేశంలో భద్రపరిచే ఎంబసీకి యూఏఈ అత్యున్నత స్థాయి భద్రతను సమకూర్చాల్సి ఉంటుంది. ప్రతిగా, యూఏఈ మన దేశంలో డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేసుకుంటుంది.

ప్రపంచంలోనే తొలి డేటా ఎంబసీని 2017లో ఎస్తోనియా ఏర్పాటు చేసింది. లక్సంబెర్గ్‌తో ఒప్పందం ద్వారా దాన్ని నెలకొల్పింది. 2021లో మొనాకో కూడా ఈ-ఎంబసీని లక్సంబెర్గ్‌లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు యూఏఈ, ఇండియా పరస్పరం తమ డేటా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదన కార్యాచరణకు నోచుకుంటే ఇండియాకు సంబంధించి ఇదే తొలి ఈ-ఎంబసీ అవుతుంది. ఈ మేరకు డిజిటల్ ఎంబసీల ఏర్పాటులో సాధ్యాసాధ్యాలు, అవకాశాలను పరిశీలిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. డేటా ఎంబసీలో జాతీయ ప్రాధాన్యం ఉన్న వ్యూహపరమైన విలువ కలిగిన సమాచారాన్ని భద్రపరిచే అవకాశం ఉన్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు. ఇది సరికొత్త విషయమనీ, దీనికి సంబంధించిన చట్టబద్ధమైన విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. నిజానికి 2023-24 బడ్జెట్‌లోనే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ డేటా ఎంబసీల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఈ ప్రతిపాదనకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. మన దేశం ఇప్పటికే కాగితం రహిత పాలనా వ్యవస్థ వైపు వేగంగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులు, భారీ స్థాయి సైబర్ దాడులు వంటివి తీవ్రముప్పు కలిగించే అవకాశం ఎక్కువ. మనదేశం యూఏఈలో డిజిటల్ ఎంబసీని నెలకొల్పడం ద్వారా భౌగోళికంగా దూరంగా, డిజిటల్‌గా చేరువలో హాట్‌సైట్ బ్యాకప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లవుతుంది. ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు డేటా రికవరీలో ప్రధాన డేటా కేంద్రం విఫలమైతే, కొద్ది నిమిషాల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండే కేంద్రమే హాట్‌సైట్ బ్యాకప్ సెంటర్. ఇది వైపరీత్యం సంభవించిన వెంటనే కొన్ని నిమిషాలు, గంటల వ్యవధిలోనే సేవలను పునరుద్ధరిస్తుంది. రియల్‌టైం డేటా మార్పులను ఎప్పటికప్పుడు నవీకరిస్తుంటుంది. దీనివల్ల కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయమూ తలెత్తదు. విపత్తు నిర్వహణ వ్యూహంలో ఇదొక భాగం. ప్రధాన కేంద్రానికి అవసరమైన అన్నిరకాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్ సౌకర్యాలు సదాసిద్ధంగా ఉంటాయి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రజాసేవలు, బ్యాంకింగ్, ఆరోగ్య, ఈ-కామర్స్ వంటి సేవలు నిరంతరాయంగా అందించడంలో కీలకంగా పనిచేస్తుంది.
డిజిటల్ కారిడార్
మన దేశంలో డిజిటల్ ఎంబసీలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఇండియా వివిధ దేశాలను కోరుతూ వస్తోంది. అందులో యూఏఈ ముందుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో దాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇండియా, యూఏఈ డిజిటల్ ఎంబసీ ప్రాజెక్టును ఐమెక్(ఇండియా మిడిల్‌ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్)కు అనుసంధానించే అవకాశాలు ఉన్నాయి. ఈ డిజిటల్ కారిడార్ అవాంతర్లాలేని, సీమాంతర డేటా సరఫరాకు తోడ్పడుతుంది. ఈ- ఎంబసీలు సార్వభౌమత్వ నియంత్రణ పరిధిలోనే డేటా ప్రయాణానికి వీలుకల్పిస్తాయి. ఇలాంటి ద్వైపాక్షిక ఒప్పందం విశ్వాస ఆధారిత డిజిటల్ సంకీర్ణాలకు నాంది పలుకుతుంది. బిగ్ టెక్ వేదికలపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వాల నడుమ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు వీలు కుదురుతుంది.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.