Trees: ఆకుపచ్చని అభయం

Eenadu icon
By Editorial News Team Updated : 08 Feb 2026 04:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నేక మైళ్లు విస్తరించిన మహా వట వృక్షమది. అయినా బాటసారులకు నీడను ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే, దానిమీద ఓ బ్రహ్మరాక్షసుడు చేరాడు. మనిషి కనపడితే అమాంతం చంపి తినేస్తున్నాడు. దగ్గరికి రావద్దని చెప్పడానికి మర్రి చెట్టుకు నోరు లేదాయె! కాబట్టి, పురుగులు దొలిచిన తన ఆకులను గాలికి దూరంగా వరుసగా పడేలా విసురుతోంది. క్రిములు చేసిన కన్నాలు (కీటకృత వ్రణచ్ఛలన లిపి) ‘రావద్దు... ఇక్కడ రాక్షసుడున్నాడు’ అనే వాక్యంలా ఏర్పడి, బాటసారులను హెచ్చరించాయి. క్రమంగా ఆ ప్రాంతం నిర్జనమైంది. చెట్ల పరోపకార బుద్ధిని వివరిస్తూ ‘ఆముక్తమాల్యద’లో కృష్ణదేవరాయలు చేసిన అద్భుత కల్పన ఇది! ‘కాంచెన్‌ వైష్ణవుడు...’ అనే ఆ పద్యంలో తొలిపదం తప్ప, తక్కినదంతా ఒకే సుదీర్ఘ సమాసంగా సాగి, కవి ఊహతో పాటు ఆ చెట్టు వైశాల్యాన్ని స్ఫురింప జేస్తుంది. ‘పచ్చదనమునెల్ల పరిసరమ్ముల నిల్పి, శుద్ధి చేసి గాలి వృద్ధి చేసి వీచుచుండు వేయి వింజామరల తోడ’ అంటూ కవులు వాటి సేవాగుణాన్ని ప్రస్తుతించారు. నిజానికి భూదేవికి- చెట్లు పరువు, మనిషి బరువు!

‘చెట్టు మనిషికి గురువు’ అన్నారు రవీంద్రులు. ‘ఫలాలు తన తరానికి అందవని తెలిసినా, మొక్కను నాటే వాడే- జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడు’ అని తేల్చారు. రామరాజ్యంలోని వృక్ష సంరక్షణ గురించి చెబుతూ- ‘పత్రాణామపి అవ్రణం... అక్కడ చెట్లకు గాయాలు ఉండవు’ అన్నారు వాల్మీకి మహర్షి. వాటి ప్రాధాన్యానికి ప్రతీకగా, పతాక శీర్షికగా- రాముడి రథం మీద జెండాపై చెట్టును చిహ్నంగా చిత్రించారాయన. అంతకన్నా ధన్యత ఏముంటుంది- ఏ జీవికైనా? మనిషికన్నా చెట్టు గొప్పదనేది అందుకే!  మనిషికి పచ్చిగాలే- ప్రాణవాయువు. పచ్చదనమే- జీవహేతువు. ఆ రెండింటికి ఆయువు పోస్తాయి వృక్షాలు. కొమ్మను నరికితే, పరిహారంగా ఓ మొక్కను పెంచమంది వేదం. ‘వేసవి తాపాన్ని తామే భరించి, ఆశ్రితులకు చల్లని నీడనిస్తాయి’ అన్నాడు శాకుంతలంలో కాళిదాసు. ఊత‘కర్ర’ సాయంతో వృద్ధాప్యాన్ని వెళ్లదీసే మనిషి- ‘కట్టెలు’ తోడుగా కడతేరిపోతాడన్న సత్యాన్ని చెబుతూ, ‘నరునితో చెట్టు సహజీవనమ్ము సేయు, నరునితో చెట్టు సహగమనమ్ము చేయు’ అన్నారు బులుసుకవి. వాస్తవానికి అవి కలప వృక్షాలు కావు- కల్ప వృక్షాలు.

ఈ రహస్యం తెలిసిన విశ్వనాథ తన రామాయణ మహాకావ్యానికి కల్పవృక్షమని పేరు పెట్టారు. ‘ఈ చెట్లన్నియు తోడబుట్టువులు సుమ్మీ సీతకున్‌’ అనిపించారు రాముడి నోట- చెట్లకు, సీతమ్మకు భూదేవే తల్లి కనుక! ‘భారతం చిన్నచిన్న కథలనే శాఖలతో విస్తరించిన మహావృక్షం... అమిత ఆఖ్యానక శాఖలం బొలిచి’ అన్నాడు నన్నయ. ‘భాగవత కల్పతరువుకు కొమ్మలు సుకుమారం, కాండం చేవ’ అంటాడు పోతన. బతుకుతున్న బతుకు తనకోసమే కాకపోవడంలోని జీవన సాఫల్యం చెట్లకే బాగా తెలుసు. ‘కుసుమచ్ఛాయా ఫలశ్రీ (పూలు నీడ పళ్లు)చే ఉపకారంబులు సేయు ఎల్లరకును ఈ ఉర్వీజములు (చెట్లు) కంటివే?’ అని అడిగింది భాగవతం. ‘పెద్దపెద్ద చెట్లకింద నిత్యం నడకలు సాగించేవారికి హృద్రోగ ప్రమాదం నాలుగు శాతం తక్కువ’ అని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలింది. గుండె జబ్బులతో బాధపడే 89వేల మందిని పరిశీలించి తాజాగా చెప్పిన మాటది. ఆకాశసౌధాలను కాదు- అమోఘ వృక్షాలను చూసి మురిసిపోవాలి... మనిషి పచ్చని లోకంలో బతకాలి అన్నది దాని సారాంశం. వృక్షో రక్షతి రక్షితః! 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 02:31 IST