Inspirational Story: ఇల్లా... బొమ్మరిల్లా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇల్లంటే... భార్యాభర్తా పరస్పరం గౌరవంతో, ప్రేమతో, నమ్మకంతో ఉంటారు. ఒకరికోసం ఒకరన్నట్లుగా జీవిస్తారు. మరి బొమ్మరిల్లయితే... అందులో పాత్రలన్నీ బొమ్మల్లా యజమాని చెప్పినట్లు పడి ఉంటాయి. ఈ తేడా అర్థమయ్యేలా నూటయాభై ఏళ్ల క్రితమే ‘ఎ డాల్స్ హౌస్’ అనే నాటకం రాశారు నార్వేజియన్ రచయిత హెన్రిక్ ఇబ్సెన్. షేక్‌స్పియర్ తరవాత అత్యధికంగా ప్రదర్శితమైన నాటకాలు ‘ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ డ్రామా’గా పేరొందిన ఇబ్సెన్‌వే.
క్రిస్మస్ షాపింగ్ చేసి కూనిరాగం తీస్తూ ఇంట్లోకి వస్తున్న నోరాతో నాటకం మొదలవుతుంది. ఆమె తెచ్చినవన్నీ చూసి చాలా ఖర్చుపెట్టేస్తున్నావంటాడు భర్త టార్వాల్ట్. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఖర్చుపెట్టుకోవచ్చంటుంది నోరా. ఇంతలో ఆమెను చూడటానికి చాలాకాలం తరవాత స్నేహితురాలు లిండ్ వస్తుంది. బాధలన్నీ చెప్పుకొంటూ భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న తనకి ఉద్యోగం ఇప్పించమని అడుగుతుంది. నోరా కూడా స్నేహితురాలితో ఒక రహస్యాన్ని పంచుకుంటుంది. భర్త ఆరోగ్యం కోసం తాము ఇటలీ ట్రిప్‌కి వెళ్లాల్సి వచ్చిందనీ, ఒకరి దగ్గర అప్పుచేసి, అతి కష్టమ్మీద భర్తకు తెలియకుండా పనులు చేస్తూ వాయిదాల్లో అప్పు తీర్చానని చెబుతుంది. ఆ తరవాత లిండ్‌కి ఉద్యోగం ఇప్పించమని భర్తను అడుగుతుంది. కాసేపటికి టార్వాల్ట్ దగ్గర బ్యాంకులో పనిచేసే క్రాగ్‌స్టాడ్ వస్తాడు. నోరా అప్పు తీసుకుంది అతడి దగ్గరే. ఆరోజుల్లో స్త్రీలకు ఆర్థిక లావాదేవీలు నడిపే స్వేచ్ఛ లేదు. మగవాళ్ల సంతకం తప్పనిసరి. అందుకని తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాక నోటుమీద పొరపాటున తండ్రి చనిపోయిన తరవాత తేదీ వేసి క్రాగ్‌స్టాడ్‌కి దొరికిపోతుంది నోరా. దాన్ని అడ్డం పెట్టుకుని అతడామెను బ్లాక్‌మెయిల్ చేయబోతాడు. టార్వాల్ట్ తనని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాడనీ తన ఉద్యోగం కాపాడమనీ లేకపోతే ఆమె రహస్యం చెప్పేస్తాననీ బెదిరిస్తాడు. నోరా భర్తను ఒప్పించలేకపోతుంది. క్రాగ్‌స్టాడ్ జరిగిందంతా టార్వాల్ట్‌కి ఉత్తరం రాస్తాడు. అది చూసిన టార్వాల్ట్ భార్యమీద మండిపడతాడు. తన జీవితాన్ని నాశనం చేసిందని, తన బిడ్డల్ని పెంచే అర్హత ఆమెకు లేదని, సమాజంకోసం మాత్రమే ఆమెను భార్యగా భరిస్తానంటాడు. లిండ్ జోక్యంతో మనసు మార్చుకున్న క్రాగ్‌స్టాడ్ కాగితాలన్నీ పంపించేస్తాడు. అది చూసి తేలిగ్గా నిట్టూర్చిన టార్వాల్ట్... నోరాను క్షమించానంటాడు. భర్త పరువూ ప్రతిష్ఠా అనకుండా తన తరఫున నిలబడతాడనీ, అతడి కోసం తాను ఆత్మహత్య చేసుకోవాలనీ ఆలోచించిన నోరా ఆ భ్రమలోంచి బయటపడుతుంది. స్వార్థం తప్ప తనమీద ప్రేమలేని అతడు అపరిచితుడిలా కనిపిస్తున్నాడనీ ఇక కలిసి జీవించలేనంటూ భర్త పిలుస్తున్నా వినకుండా తలుపు ధడాల్న వేసి వెళ్లిపోతుంది.
ఇబ్సెన్ స్నేహితురాలి విషయంలో అచ్చంగా ఇలాగే జరగ్గా భర్త విడాకులిచ్చి ఆమెను మానసిక శరణాలయంలో చేర్పించాడట. ఆ నేపథ్యంలోనే ఇబ్సెన్ ఈ నాటకం రాశారు. కాకపోతే కొంతకాలానికి ఆమె బయటికి వచ్చి గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. నోరా ఆత్మగౌరవాన్ని వెతుక్కుంటూ వెళ్లిందని బెర్నార్డ్‌షా అంటే, నోరా తలుపు మూసిన చప్పుడు ప్రపంచమంతా మార్మోగిందన్నారు కళా విమర్శకుడు జేమ్స్ హునెకర్. స్త్రీవాద చరిత్రకారిణి మిరియం షీనర్ ఈ కథని స్త్రీవాద రచనల్లో చేర్చారు. చక్కటి సంభాషణలు, పాత్రల వ్యక్తిత్వాలను మలచిన తీరు నాటకాన్ని ఆపకుండా చదివిస్తాయి. దానిపై జరిగిన చర్చలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి.

విద్య యజమాని అయితే రాజకీయం దానికి సేవకుడు కావాలి. అధికారాన్ని నైతికతతోనూ శాస్త్ర సాంకేతికతలతోనూ జత చేసినప్పుడే అభివృద్ధి సాధ్యం.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :