Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్-రెడ్‌హిల్స్, నాంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అనేక కేసుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించి విశ్లేషించే తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల(ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ-ఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ కేసుల్లో సీజ్ చేసిన భౌతిక ఆధారాలను భద్రపరిచిన హైదరాబాద్ నాంపల్లిలోని జీ ప్లస్ టూ భవనం మొదటి అంతస్తులోని గదిలో ప్రమాదం జరిగింది. దాదాపు 40-50 కంప్యూటర్లు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా... లేక కుట్రకోణం దాగి ఉందా అని విశ్లేషిస్తున్నారు. ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్యూటర్ గదిలోంచి ఉదయం 10.30 గంటలకు దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆఫీస్‌బాయ్ అగ్నిమాపక పరికరంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటల తీవ్రత పెరిగి పొగ దట్టంగా కమ్మేయడంతో అందులో చిక్కుకుని అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, 108 అంబులెన్స్ హుటాహుటిన ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయానికి చేరుకున్నాయి. ఆఫీస్ బాయ్‌కి 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ ఫైటర్స్‌తోపాటు ఓ రోబోటిక్ యంత్రాన్ని రంగంలో దించారు. సమాచారం అందుకున్న ఎఫ్‌ఎస్‌ఎల్ డీజీ శిఖాగోయల్, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్ మాన్, హైదరాబాద్ నార్త్ రేంజ్ డీఐజీ శ్వేతారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘కేసు సంబంధిత ఆస్తి, ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చెందిన సామగ్రి సురక్షితంగానే ఉందని జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం’ అని శిఖా గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఐదు నిమిషాల్లోనే చేరుకున్నాం: విక్రమ్ సింగ్ మాన్
‘సమాచారం అందిన ఐదు నిమిషాల వ్యవధిలోనే తొలి ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకుంది. మొదటి అంతస్తులోని ఓ మూలన ఉన్న కంప్యూటర్ రూమ్‌లో స్విచ్ బోర్డు వద్ద విద్యుదాఘాతం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూమ్‌లో ప్రమాదం చోటుచేసుకోవడం వల్ల కంప్యూటర్లు, ప్రింటర్లు, రీసెర్చ్ పరికరాలు, స్కానర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. ఏ కేసుల ఆధారాలు దగ్ధమయ్యాయో నేను చెప్పలేను’ అని విక్రమ్ సింగ్ మాన్ వివరించారు.

- ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాద ఘటనలో 40 నుంచి 50 కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, విలువైన హార్డ్‌డిస్క్‌లు, పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు వంటివి పూర్తిగా బుగ్గి అయ్యాయని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్ తెలిపారు. ‘‘కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా రెండో అంతస్తులో ఉంది. అక్కడెలాంటి ప్రమాదం జరగలేదు’’ అని మీడియాకు చెప్పారు.
- ఎఫ్‌ఎస్‌ఎల్ సిబ్బందిని ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాల గురించి ఏమైనా ప్రశ్నించారా.. అని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘అది మాకు ప్రాధాన్యాంశం కాదు. ముందు మంటలను అదుపులోకి తీసుకురావడానికి, లోపల ఉన్నవారిని రక్షించడానికి ప్రయత్నించాం’ అని బదులిచ్చారు.
కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్‌ఎల్ ఎంతో కీలకం
వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్‌ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డీఎన్‌ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :