వాళ్ల కోసం.. జనపనారతో శానిటరీ ప్యాడ్స్‌!

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఖాళీగా ఉన్న బెంచీల్ని చూసి.. పిల్లల సంఖ్య తక్కువగా ఉందేమో అనుకుంటాం.. ఓసారి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను సందర్శించిన సృష్టి బోస్‌ కూడా ఇలాగే అనుకుంది....

Eenadu icon
By Vasundhara Team Updated : 12 Feb 2026 19:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read


(Photos : Instagram)

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఖాళీగా ఉన్న బెంచీల్ని చూసి.. పిల్లల సంఖ్య తక్కువగా ఉందేమో అనుకుంటాం.. ఓసారి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను సందర్శించిన సృష్టి బోస్‌ కూడా ఇలాగే అనుకుంది. అందులోనూ కొన్ని పాఠశాలల్లో బాలికల సంఖ్య మరీ తక్కువగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కానీ దీనంతటికీ కారణం నెలసరే అని ఆ తర్వాత తెలుసుకుందామె. పిరియడ్స్‌ వల్లే అక్కడి అమ్మాయిలు స్కూల్‌ మానేస్తున్నారన్న అసలు నిజం తెలుసుకున్నాక.. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలనుకుంది. ఈ ఆలోచనతోనే ఓ ప్రత్యేక ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు, మహిళలకు నెలసరిపై అవగాహన కల్పిస్తూనే.. వారి కోసం పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేస్తోంది. తన ప్రాజెక్ట్‌ని దేశవ్యాప్తంగా విస్తరించి.. ఈ సమాజం నుంచి నెలసరి అపోహల్ని పూర్తిగా తొలగించడమే తన లక్ష్యమంటోన్న సృష్టి స్ఫూర్తి కథ ఇది!

ఆ నిజం తెలిశాక..!
బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల సృష్టి ప్రస్తుతం అక్కడి ‘మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. తనకు చిన్నతనం నుంచి సామాజిక సమస్యల గురించి తెలుసుకోవడం, వాటికి తగిన పరిష్కార మార్గాలు ఆలోచించడం అలవాటు. అంతేకాదు.. వివిధ వస్తువులు సేకరిస్తూ వాటిని తోటి పిల్లలకు పంచి పెట్టేది. అందుకోసం ఓసారి తాను స్కూల్లో ఉన్నప్పుడు అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లింది సృష్టి. ఈ క్రమంలోనే కొన్ని తరగతుల్లో బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉండడం గమనించింది.
‘తొలుత విద్యార్థుల సంఖ్యే తక్కువగా ఉందేమో అనుకున్నా. కానీ ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ని కలిశాక అసలు విషయం తెలిసింది. బాలికలు తమ నెలసరి సమయంలో స్కూల్‌ మానేస్తున్నారని తెలుసుకున్నా. వారికి పిరియడ్స్‌పై పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నట్లు గ్రహించా. అందుకే వీటిపై ఉన్న అపోహల్ని తొలగించి అవగాహన కల్పించాలనుకున్నా. ఈ ఆలోచనతోనే ‘ప్రాజెక్ట్‌ ఎకోశానిటేషన్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించా..’ అంటోంది సృష్టి.

11 నెలల్లో.. ఏడు రాష్ట్రాల్లో..!
గతేడాది మార్చిలో ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించిన సృష్టి.. ఈ వేదికగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్కూలుకెళ్లే బాలికల్లో నెలసరిపై పూర్తి అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తోంది.
‘మాది ఉన్నత విద్యావంతుల కుటుంబం. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నెలసరికి సంబంధించిన విషయాల గురించీ మా ఇంట్లో బహిరంగంగా మాట్లాడుకుంటాం. దాంతో ఇది సర్వసాధారణమైన అంశంగా అనిపిస్తుంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెలసరి గురించి బయటికి మాట్లాడడం పెద్ద తప్పుగా భావిస్తున్నారు. ఈ అపోహల్ని తొలగిస్తూనే పిరియడ్స్‌ మన జీవితంలో ఓ భాగం అని చెప్పడమే నా ప్రాజెక్ట్‌ ముఖ్యోద్దేశం. మొదట్లో నేనొక్కదాన్నే ఆయా స్కూళ్లకు వెళ్లి బాలికల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించేదాన్ని. కానీ రోజులు గడిచే కొద్దీ నా తోటి విద్యార్థులు, స్నేహితులు కూడా నాతో చేతులు కలిపారు. ఇలా మేమంతా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.. ఈ 11 నెలల్లో కర్ణాటక వ్యాప్తంగానే కాదు.. బిహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బంగ.. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లో మా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం..’ అని చెబుతోంది సృష్టి.

శ్యానిటరీ ప్యాడ్స్‌ కూడా..!
ఇందులో భాగంగా నెలసరి పరిశుభ్రత, ఈ సమయంలో పర్యావరణహిత శ్యానిటరీ ఉత్పత్తుల వినియోగం, శారీరక మార్పులు, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, పీసీఓఎస్‌.. వంటి ఎన్నో అంశాలపై బాలికలు, మహిళల్లో అవగాహన పెంచుతోంది సృష్టి. అంతేకాదు.. ఈ సెషన్స్‌లో అబ్బాయిల్నీ భాగం చేస్తూ నెలసరిని మరింత సర్వసాధారణం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. తన ప్రాజెక్ట్‌లో భాగంగా పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్ల తయారీని సైతం ప్రారంభించింది.
‘ప్రస్తుతం మా శ్యానిటరీ ప్యాడ్‌ నమూనా దశలో ఉంది. ప్యాడ్‌ పూర్తిగా తయారై.. ఆయా సర్టిఫికేషన్లు పొందాక తుది ఉత్పత్తిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తాం. దీన్ని తక్కువ ధరకు విక్రయించడమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, బాలికలకు ఉచితంగా అందించే ఏర్పాట్లూ చేస్తున్నా. ఆపై ఈ ప్రాజెక్ట్‌ని దేశవ్యాప్తం చేసి.. ఈ సమాజం నుంచి నెలసరి అపోహల్ని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటోన్న సృష్టి.. తన ప్రాజెక్ట్‌ ద్వారా ఇప్పటి వరకు 350 మందికి పైగా అమ్మాయిల్లో స్ఫూర్తి నింపింది. తన ప్రాజెక్ట్‌కు ‘బీ విజనీర్స్‌ మెర్సిడెస్ బెంజ్ ఫెలోషిప్’ ద్వారా నిధులు అందుతున్నట్లు చెబుతోందీ యూత్‌ ఐకాన్‌.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Feb 2026 15:14 IST