Mohammed Siraj: పండగలా దిగివచ్చాడు.. సిరాజ్ అంకితభావానికి హ్యాట్సాఫ్!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

శుక్రవారం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో క్రికెట్ సాధన చేస్తున్నాడు మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj). అప్పుడే అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది చేసింది టీమ్ ఇండియా ( Team India) మేనేజ్‌మెంట్. ప్రపంచకప్ ఆడాల్సిన హర్షిత్ రాణా గాయపడ్డాడని, తన స్థానంలో జట్టులోకి రావాలన్నది కాల్ సారాంశం. కొన్ని గంటల్లోనే ముంబయి విమానం ఎక్కేశాడు సిరాజ్. కట్ చేస్తే తర్వాతి రోజు రాత్రి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్‌ఏతో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగడమే కాదు.. 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. ఏడాదిన్నరకు పైగా టీ20 జట్టులోనే లేడు. చాలా కాలంగా జట్టు ఎంపికకు అతడిని పరిగణనలోకే తీసుకోవట్లేదు సెలక్టర్లు. టీమ్ ఇండియా తరఫున 45 టెస్టులు, 50 వన్డేలు ఆడి ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగిన సిరాజ్‌కు టీ20ల్లో మాత్రం పేలవ రికార్డు ఉంది. ప్రపంచకప్‌నకు ముందు అతను 16 టీ20లు ఆడి 32.28 సగటుతో 14 వికెట్లు మాత్రమే తీశాడు. టీ 20ల్లో పెద్దగా వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులిచ్చేస్తాడన్న ముద్ర పడిపోయింది అతడిపై. దీంతో అతడిని 2024 జులైలో శ్రీలంక పర్యటన తర్వాత టీ20 జట్టులోకే ఎంపిక చేయలేదు సెలక్టర్లు. బుమ్రా ( Jasprit Bumrah), అర్షదీప్ కాకుండా హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకే ప్రాధాన్యం దక్కుతోంది. కానీ ప్రసిద్ధ్ చివరగా ఆడిన సిరీస్‌ల్లో పేలవ ప్రదర్శన చేయడంతో అతడిని పక్కన పెట్టేశారు.
అనుకోకుండా తుది జట్టులోకి..
అయితే హర్షిత్ రాణా టోర్నీ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయపడడంతో అనూహ్యంగా సిరాజ్‌కు అవకాశం దక్కింది. కానీ.. ప్రత్యామ్నాయ బౌలర్‌గా ఎంచుకున్న సిరాజ్‌కు తుది జట్టులో చోటు కష్టమనే అనుకున్నారంతా. కానీ ప్రధాన పేసర్ బుమ్రా జ్వరం కారణంగా తొలి మ్యాచ్‌లో అందుబాటులో లేకుండా పోవడంతో అనుకోకుండా సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ 3 కీలక వికెట్లతో విజృంభించాడు సిరాజ్. 162 పరుగుల లక్ష్యం అంటే టీ20ల్లో పెద్ద కష్టమేమీ కాదు.
అమెరికా టాప్ ఆర్డర్ నిలబడితే ఛేదన సాధ్యమయ్యేదే. కానీ సిరాజ్ తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఆండ్రీస్ గాస్‌ను పెవిలియన్కు చేర్చాడు. తర్వాత తెలుగు కుర్రాడు సాయితేజను ఔట్ చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా ఆడుతున్న శుభమ్ రంజానేకు కూడా చెక్ పెట్టి యుఎస్ఏ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. ఏడాదిన్నరగా టీ20 జట్టు ఛాయల్లోనే కనిపించని ఆటగాడు.. ఇప్పుడిలా టీ20 ప్రపంచకప్ ఆడడం, సత్తా చాటడం అనూహ్యం అనే చెప్పాలి.
గాయపడటం అరుదు!
మహ్మద్ సిరాజ్ అంటే అంకితభావానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఫాస్ట్ బౌలర్లు ఎంత సున్నితంగా తయారయ్యారో, ఫిట్‌నెస్ సమస్యలతో ఎలా సతమతం అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే చాలా సెలక్టివ్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నారు. కానీ సిరాజ్ అలా కాదు. అతను గాయపడడం, విశ్రాంతి తీసుకోవడం అరుదు. టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టడానికి ముందు అతడు హైదరాబాద్ తరఫున రెండు రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఆ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధించి ఉంటే శుక్రవారం కూడా మ్యాచ్ ఆడుతూ ఉండేవాడు. రంజీ ట్రోఫీ కంటే ముందు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో, అంతకుముందు టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. టెస్టులు, వన్డేల్లో టీమ్‌ఇండియా కీలక బౌలర్‌గా ఉంటూ ఇలా మూడు ఫార్మాట్లలో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నది ఒక్క సిరాజ్ మాత్రమే. రంజీ మ్యాచ్ అవ్వగానే విశ్రాంతి తీసుకోకుండా హైదరాబాద్‌లో సాధన చేస్తూ ఉన్నాడు సిరాజ్. అదీ అతడి నిబద్ధత.
- ఈనాడు క్రీడా విభాగం