Republican spirit: ఏదీ గణతంత్ర స్ఫూర్తి?

Eenadu icon
By Editorial Team Published : 26 Jan 2026 04:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

నవరి 26 అనగానే మనకు గుర్తొచ్చేది దేశ రాజధాని దిల్లీలోని పరేడ్, త్రివర్ణ పతాకావిష్కరణ, రాజ్యాంగ పీఠిక పఠనం, దేశ అత్యున్నత పురస్కారాల ప్రకటన మొదలైనవి. ఆ రోజు దేశమంతటా ఒకలాంటి గంభీర వాతావరణం కనిపిస్తుంది. కానీ గణతంత్ర దినోత్సవం జాతీయ వేడుక మాత్రమే కాదు. అది మన వ్యక్తిగత జీవితాల్లో, సామాజిక వ్యవహారాల్లో ప్రతిరోజూ తరచి చూసుకోవాల్సిన ఒక అంతర్గత స్థితి.
గణతంత్రం అంటే- పాలకుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం... రాజు కాదు, సింహాసనం కాదు, మనమే! ఇది వినడానికి సరళంగా అనిపించినా, ఆచరించడానికి కఠినమైనది. ఎందుకంటే స్వయంపాలన అనేది కేవలం ఓటు వేయడంతో ముగిసిపోదు; అది మన నిర్ణయాల్లో, మౌనాల్లో, నిర్లక్ష్యాల్లో కూడా పరీక్షకు నిలుస్తుంది. రైల్వేస్టేషన్‌లోనో మరోచోటో క్యూలో నిలబడి ఉండగా, ఎవరో మధ్యలో దూరతారు. చుట్టూ ఉన్నవాళ్లు చూసి కూడా మాట్లాడరు. మరోచోట మరెవరో అవినీతి, అన్యాయాలకు పాల్పడుతుంటారు. అది తెలిసిన వాళ్లలో చాలామంది మనకెందుకులే అని ఊరుకుంటారు. ఆ క్షణంలో గణతంత్ర స్ఫూర్తి ఓడిపోయిందా? లేక అది మనలో మౌనంగా కుదేలైందా? రాజ్యాంగం పుస్తకరూపంలో ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం నిలబడదు, సంవిధాన స్ఫూర్తి మన దైనందిన ప్రవర్తనలోకి రావాలి. అదే గణతంత్రానికి నిజమైన అర్థం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గణతంత్రాన్ని ఎంచుకోవడం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు; అది ఒక తాత్విక ప్రకటన. మనిషి తనకు తానే చట్టం అన్న ఆలోచన. కానీ ఇక్కడే ఒక విరోధాభాసం దాగుంది, మనమే చట్టం అనుకున్నప్పుడు, చట్టాన్ని ఉల్లంఘించే స్వేచ్ఛ కూడా మనకే ఉన్నట్టు ప్రవర్తిస్తాం. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగకపోవడం నుంచి, బలహీనుడి హక్కును కాలరాచే దాకా, ఈ చిన్నచిన్న ఉల్లంఘనలే గణతంత్రాన్ని లోపల నుంచి గాయపరుస్తాయి.

గణతంత్రం అనేది కేవలం హక్కుల జాబితా కాదు, అది బాధ్యతల ఒప్పందం కూడా. వాక్‌ స్వాతంత్య్రం ఉందని, ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం తప్పు. సమానత్వం చట్టంలో ఉందని చెప్పుకొంటూనే, మన ఇళ్లలో మనసుల్లో ఉన్న అసమానతలను ప్రశ్నించకపోతే గణతంత్రం కాగితాలకే పరిమితమవుతుంది. గణతంత్ర దినోత్సవం మనకు ఒక అద్దం లాంటిది. అందులో దేశాన్ని, మనల్ని మనం కూడా చూసుకోవాలి. నేను నా రోజువారీ జీవితం ద్వారా ఈ వ్యవస్థను బలపరుస్తున్నానా? లేక దాని బలహీనతకు కారణమవుతున్నానా? ఈ ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెప్పుకోవడమే ఈ రోజుకు అసలైన అర్థం.

జనవరి 26 సాయంత్రానికి జెండాలు మడత పెట్టేస్తాం, బ్యానర్లు తొలగిస్తాం. కానీ గణతంత్ర సంరంభం అక్కడితో ముగియకూడదు. అది మరుసటి రోజు ఆఫీసులో, బస్సులో, పాఠశాలలో, సోషల్‌ మీడియాలో, మన ప్రతి చర్యలో కొనసాగాలి. ఎందుకంటే గణతంత్రం ఒక రోజువారీ సాధన. దాన్ని మనం ప్రతిరోజూ ఆచరించినప్పుడే, ఈ దేశం నిజంగా ప్రజల చేతిలో ఉంటుంది.

ప్రతి వ్యక్తీ ఆత్మగౌరవంతో బతకాలి. మానసికంగా నిత్యం ఎదుగుతూనే ఉండాలి. జీవితం సుదీర్ఘంగా ఉంటే సరిపోదు, గొప్పగా ఉండాలి. నా దృష్టిలో మహిళల ప్రగతే దేశాభివృద్ధికి కొలబద్ద. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :