Nuclear power: అవిచ్ఛిన్న అభివృద్ధికి అణు విద్యుత్‌

Eenadu icon
By Editorial Team Published : 26 Jan 2026 04:33 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

తక్కువ ఖర్చులో నిరంతరం విద్యుత్‌ సరఫరా జరిగితేనే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు బాగా ప్రగతి సాధిస్తాయి. ఏఐ రంగప్రవేశంతో విద్యుత్‌ అవసరాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. కరెంట్‌కోసం శిలాజ ఇంధనాలపైనే ఆధారపడితే వాతావరణానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో అణు విద్యుచ్ఛక్తి ఒక మేలిమి ప్రత్యామ్నాయంగా ముందుకొస్తోంది.

మురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకంతో కర్బన ఉద్గారాలు, భూతాపం పెరిగిపోతున్నాయి. దాంతో మిగతా ప్రపంచం మాదిరిగానే భారత దేశమూ గ్రీన్‌ హైడ్రోజన్, బయోమాస్‌ వంటి ఇంధనాలవైపు మళ్లుతోంది. సౌర, పవన విద్యుత్కేంద్రాలను విరివిగా నెలకొల్పుతోంది. అయితే సూర్యుడు ఉన్నప్పుడే సౌర ఫలకాల ద్వారా విద్యుదుత్పాదన చేయగలం. గాలి వీచినపుడే గాలిమరలు తిరిగి పవన విద్యుత్‌ లభిస్తోంది. అయితే, నిల్వ చేయడం ముఖ్యం. సూర్యకాంతి ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే సౌర విద్యుత్తును రాత్రిపూట బ్యాటరీలలో నిల్వ చేసుకోవాలి. పవన విద్యుత్తును గాలి వీచనప్పుడు వాడుకోవడానికి వీలుగా బ్యాటరీలలో నిల్వచేయాలి. జల విద్యుత్తు నిల్వకు పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్‌పీ)లను చేపట్టాలి. ఇదంతా చాలా ఖరీదైన వ్యవహారం. మరోవైపు డేటా సెంటర్లకు, హైటెక్‌ పరిశ్రమలకు, ఆర్థిక సేవలకు నిరంతరం చవగ్గా విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంది. ముంబయి, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు ఆటంకాల్లేని విద్యుత్‌ సరఫరా తక్షణావసరం. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుంటే, 2047కల్లా భారతదేశానికి లక్ష మెగావాట్ల (100 గిగావాట్ల) అవిచ్ఛిన్న విద్యుత్‌ సరఫరా కావాలి. దానికి తగినట్లుగా ప్రైవేటు భాగస్వామ్యంతో చురుగ్గా విద్యుదుత్పాదనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

నికరమైన ఒప్పందాలతో పెట్టుబడులు 

ఈ కృత్రిమమేధా యుగంలో ఇళ్లు, పరిశ్రమలు, వ్యాపారాలకన్నా ఎంతో ఎక్కువ విద్యుత్‌ డేటా కేంద్రాలకు, క్లౌడ్‌ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల తయారీ, ఏఐ సేవలకు అవసరపడుతుంది. ఈ సంస్థలకు విద్యుత్‌ సరఫరాలో ఏ కాస్త అంతరాయం జరిగినా ఆర్థిక నష్టం అపారంగా ఉంటుంది. బ్యాటరీలు, పీఎస్‌పీల  వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం చిక్కదు. పైగా వాటి నిర్మాణానికి భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పెద్దయెత్తున భూమి, జలవనరులు కావాలి. బ్యాటరీలలో వాడే లిథియం వంటి ఖరీదైన, అరుదైన లోహాలను విదేశాల నుంచి దిగుమతిచేసుకోవాలి. బ్యాటరీ నిల్వ, పీఎస్‌పీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో సమయం పడుతుంది. అవి చిరకాలం మన్నలేవు కూడా. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అణు విద్యుదుత్పాదన మాత్రమే. అణు కేంద్రాలు ఎండనకా వాననకా, పగలూ రేయీ తేడా లేకుండా నిరంతరం విద్యుదుత్పాదన చేయగలవు. 85-90 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌తో రోజులో 24 గంటలూ విద్యుత్తును అందిస్తాయి. సగటున ఒక్కో మెగావాట్‌ ఉత్పాదనకు కావాల్సిన భూమీ తక్కువే. కర్బన ఉద్గారాలకు తావు ఉండదు. ఒక్క అణు విద్యుత్కేంద్రాలతోనే భారత్‌కు కావాల్సిన 100 గిగావాట్ల విద్యుత్తును అందించవచ్చు-అదీ ఎటువంటి అంతరాయం లేకుండా.

బ్యాటరీలు గ్రిడ్‌ సమతౌల్యత సాధించడానికి తోడ్పడతాయి కానీ, వాటితో దీర్ఘకాలం నిరంతర విద్యుత్‌ సరఫరా సాధ్యం కాదు. పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టులకు ప్రాదేశిక, పర్యావరణ పరిమితులు, వ్యయభారం ఉంటాయి. వీటిని ఎక్కడంటే అక్కడ ఏర్పాటుచేయలేము. అణువిద్యుత్కేంద్రాలతో ఈ సమస్యలు ఉండవు. డేటా కేంద్రాలకు స్థిరమైన ధరకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయడం అణు కేంద్రాలతోనే సాధ్యం. అంతరాయాలు లేకుండా దీర్ఘకాలం విద్యుత్‌ సరఫరాకు నికరమైన ఒప్పందాలు కుదిరి పటిష్ఠ పంపిణీ యంత్రాంగం ఏర్పడితే అణు విద్యుత్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తాయి. సాధారణ విద్యుత్‌ గ్రిడ్‌లపై ఒత్తిడి తగ్గి ఇళ్లకు, వ్యాపారాలకు కరెంటు సరఫరా మెరుగుపడుతుంది. 

ఖర్చులూ సమస్యలూ తగ్గుతాయి...

అణు విద్యుత్కేంద్రాల స్థాపనకు భారీగా వ్యయమవుతుంది కానీ, వాటి నిర్వహణ ఖర్చు మాత్రం బాగా తక్కువ. వీటి నుంచి విద్యుత్‌ కొనుగోలుకు తాత్కాలిక ఒప్పందాలకన్నా దీర్ఘకాలిక ఒప్పందాలే మేలు. విద్యుత్‌ ఛార్జీలను 30-35 ఏళ్ల కాలావధికి ఒక ప్రత్యేక సంస్థ ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ధర స్థిరీకరణ వల్ల ఫైనాన్సింగ్‌ ఖర్చులు, ఇతర సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్కేంద్రాలు 60 నుంచి 80 ఏళ్లపాటు పనిచేస్తాయి. వాటి విలువపై మొదట్లో ఎక్కువ తరుగుదలను అనుమతిస్తారు. మొదట్లో విద్యుత్‌ ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి. ఇలా కాకుండా మొదట్లోనే తక్కువ తరుగుదలను అనుమతించి దీర్ఘకాలంలో పెట్టుబడి రికవరీ జరిగేలా చూడాలి. దీనివల్ల ఛార్జీలను తగ్గించగలుగుతాం. భారతదేశ డిజిటల్, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి అనేది అందుబాటు ధరలకు అవిచ్ఛిన్న విద్యుత్‌ సరఫరా మీద ఆధారపడి ఉంది. అందుకు హరిత ఇంధనాలు, స్టోరేజి బ్యాటరీల మీదనే పూర్తిగా ఆధారపడకుండా అణు విద్యుదుత్పాదనను పెద్దయెత్తున ప్రోత్సహించాలి. అందుకు పెట్టాల్సిన భారీ పెట్టుబడులకు అంతకంతా లాభాలు కచ్చితంగా లభిస్తాయి.

ఏ దేశమైనా అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా, సమ్మిళిత ప్రగతి సాధ్యపడాలన్నా మహిళలూ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలి. కానీ, స్త్రీల విషయంలో చాలా చోట్ల తీవ్ర వివక్ష నెలకొంది. దాన్ని తొలగించడానికి చాలా దేశాలు మహిళల సామాజిక, ఆర్థిక హక్కులకు దన్నుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ స్త్రీల ప్రగతికి ప్రతిబంధకంగా మారిన పలు సమస్యలు నేటికీ పరిష్కారానికి నోచుకోవడంలేదు. 2023 నాటికి ఆయా అంశాలపై ఎన్ని దేశాల్లో స్త్రీలకు ప్రత్యేక హక్కులు, అవకాశాలు ఉన్నాయంటే...

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :