India: ఆసేతు హిమాచలం... ఒకే కుటుంబం!

Eenadu icon
By Editorial Team Published : 26 Jan 2026 04:33 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

‘భారతదేశం నా మాతృభూమి...’ అనగానే పైడిమర్రి వెంకటసుబ్బారావు రాసిన ప్రతిజ్ఞ పాఠమే గుర్తుకొస్తుంది. అందులోని తొమ్మిది వాక్యాలు నవవిధ దేశభక్తి మార్గాలు. ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి ఉపయోగపడే సంస్కరణాత్మక ప్రతిపాదనలు. ఈ ప్రతిజ్ఞలోని పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఉత్తమ పౌరులుగా ఎదుగుతాం.

భారతదేశం నా మాతృభూమి

ఎన్నో భారతీయ గ్రంథాలు, గాంధీజీ, ఠాగూర్‌ లాంటి ప్రముఖులూ మాతృభూమి ప్రాశస్త్యాన్ని వివరించారు. రామాయణంలో రాముడు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటూ తల్లితో జన్మభూమిని పోల్చాడు. మాతృమూర్తికి ప్రత్యామ్నాయం లేనట్లే మాతృభూమికీ ఉండదు. ‘మాతృదేవోభవ’ అంటూ తల్లిని పూజించడం మన సంస్కృతి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే పైడిమర్రి జన్మభూమికి ‘మాతృ’భూమి అనే ప్రయోగం చేశారు.

భారతీయులందరూ నా సహోదరులు 

సహ ఉదరులు అంటే ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన వారని అర్థం. ఎంతో పరిశోధన చేసిన తరవాతే పైడిమర్రి ఈ పదాన్ని వాడారు. ఏ భరత భూమిని మాతృభూమిగా భావించామో ఆ భరతమాత పిల్లలందరూ మనకు సహోదరులే. దేశదేశాల్లో ఎక్కడైనా జీవిత భాగస్వామి, బంధువులు లభిస్తారు. కానీ, ప్రియసఖుడైన సహోదరుడు లభించడని రామాయణం యుద్ధకాండలో ప్రస్తావన ఉంది. అందుకే భారతీయుల మధ్య సహోదర బంధాన్ని ముడివేసి, జీవితాంతం కలిసికట్టుగా ఉండాలని చెప్పారు పైడిమర్రి.

నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను

ప్రేమ అనేది ఒక అత్యున్నతమైన నిస్వార్థ భావన. ప్రేమ భావన ముందుగా ప్రసరించేది, ప్రవహించేది రక్త సంబంధాల్లోనే. అయితే, భారతీయులమైన మనమంతా సహోదరులం అని చెప్పి, ఒకే తల్లి బిడ్డల మధ్య బాల్యంలో ఉద్భవించే నిష్కపటమైన ప్రేమనే దేశంపైనా చూపాలని పైడిమర్రి ఉద్బోధించారు.

దీనికి అర్హుడు కావడానికి సర్వదా కృషి చేస్తాను

దేశభక్తి విషయంలో పైడిమర్రికి ఉన్న నిజాయతీ, నిబద్ధతకు ఈ వాక్యమే కొలమానం. ఈ దేశ వారసత్వ సంపదకు అర్హత పొందడానికి ప్రతి భారతీయుడు కృషి చేయాలి. అమూల్య సంపదలు సంక్రమించాలంటే తగిన అర్హతలు ఉండాలి. దేశం పట్ల నిబద్ధత, మానవత్వం, నిస్వార్థం లాంటివి ఆ కోవకే వస్తాయి. వాటిని సంపాదించుకున్నప్పుడే భారతీయతకు వారసులమని సగర్వంగా చెప్పుకోగలం.

నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను

పైడిమర్రి ప్రతిజ్ఞను రెండు భాగాలుగా చేసి, మొదటి అయిదు వాక్యాలను భారతీయులందరూ ఏ విధంగా ఒకే కుటుంబానికి చెందినవారో వివరించారు. చివరి నాలుగు వాక్యాలను ప్రతి కుటుంబ సభ్యుడు ఇతర సభ్యుల పట్ల ఎలా ప్రవర్తించాలి, అందుకోసం ఏం చెయ్యాలి వంటి వ్యక్తిగత బాధ్యతలను వివరించారు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ’ అన్న ఉపనిషత్‌ సూక్తే దీనికి మూలం. ఈ నలుగురినీ దైవసమానులుగా భావించాలని చెప్పడం విద్య, సంస్కారం, గౌరవాలకు సమున్నత సంకేతం. 

ప్రతివారితోను మర్యాదగా నడుచుకుంటాను

‘మర్యాద’ అనేది మన జీవనయానంలో ఒక భాగం. దీనికి మూలం రామాయణంలో ఉంది. సుందరకాండలో హనుమంతుడు ‘శ్రీరాముడు లోకంలోని మర్యాదలను స్థాపించేవాడు, ఇతరులను కూడా ఆచరించేలా చేసేవాడు’ అని సీతమ్మకు వివరించాడు. అందుకే రాముణ్ని ‘మర్యాదా పురుషోత్తముడు’గా వ్యవహరిస్తారు. ఆయనలో సత్యం, ధర్మం, నీతి, సత్‌ప్రవర్తన, ఆదర్శవంతమైన కుటుంబీకుడు, నిగర్వి, నిరాడంబరుడు, శాంతికాముకుడు వంటి ఎన్నో శ్రేష్ఠ గుణాలున్నాయి. మర్యాద సకల శ్రేష్ఠ గుణాల సమ్మిళతం. అందుకే పైడిమర్రి ప్రతి వ్యక్తీ సకల సద్గుణాలతో సంపూర్ణ వ్యక్తిగా ఉండాలని అభిలషించారు.

నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటాను

ఎప్పుడైతే కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకుంటారో సహజంగానే వారి కష్టనష్టాల్లో, సుఖసంతోషాల్లో తోడుగా ఉంటారు. త్యాగం, సేవ రెండూ కలిసి నడుస్తాయి. త్యాగనిరతి కలిగినవాడే ఇతరులను సేవించగలడు. సేవాతత్పరుడే ఇతరుల కోసం త్యాగం చేయగలడు. దేశభక్తి అనే సౌధానికి సేవానిరతి ఒక స్తంభమని చెప్పవచ్చు. 

వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం

ఇతరుల శ్రేయస్సు, అభివృద్ధి మనకు ఆనందాన్నివ్వడం దైవలక్షణం. ప్రతిజ్ఞలోని ముగింపు వాక్యం ఎంత పవిత్రమైనదో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతమే మూలం. ఎప్పుడైతే మనలో దేవుడున్నాడని నమ్ముతామో ఇతరులందరిలో కూడా దేవుడున్నట్లే. అద్వైతానికి మూలసూత్రం ‘నీలో ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరిలో నువ్వు’. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఆ దైవత్వాన్ని చూడగలుగుతామో సహజంగానే వారికి శ్రేయోభిలాషిగా ఉండగలం. వారి అభివృద్ధిని కాంక్షిస్తాం. దానిలోనే ఆనందాన్ని పొందుతాం.

సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం

మన దేశానికి అతి గొప్ప, అమూల్యమైన భౌతిక, సాంస్కృతిక, చారిత్రక, సహజ వనరుల సంపద ఉంది. అది మన దేశ గుర్తింపునకు, నాగరికతకు, సంస్కృతీ సాంప్రదాయాలకు, అద్వితీయ విజ్ఞానానికి ప్రతీక. దాన్ని మనం గర్వకారణంగా భావించాలి.

ఈ ‘ప్రతిజ్ఞ’ సమసమాజ స్థాపనకు, సమాజ సమతుల్య స్థితికి ఉపకరిస్తుంది. దేశమంతా ఒకే కుటుంబం అనే భావన జాతీయ సమగ్రతకు, సమైక్యతకు, సోదర భావాన్ని పెంచడానికి దోహదపడుతుంది. దీన్ని మనం త్రికరణశుద్ధిగా విశ్వసించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా నడుచుకోగలం.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :