constitutional goals: రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలంటే...

Eenadu icon
By Editorial News Team Published : 26 Jan 2026 04:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

డెబ్బై ఆరేళ్ల కిందట ఇదేరోజున రాజ్యాంగం అమల్లోకి రావడంతో ఇండియా గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. అవి సమసిపోయి సామాన్యుల జీవితాలు బాగుపడటమనేది సార్వత్రిక వయోజన ఓటు హక్కులోంచి ఉద్భవించే ప్రజాతంత్ర ప్రభుత్వాలతోనే సాధ్యపడుతుందని రాజ్యాంగ సభ సభ్యులు గట్టిగా విశ్వసించారు. అందుకుగానూ ఎన్నికల ప్రక్రియ లోపరహితం కావాలని వారు కోరుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగకపోతే సంవిధాన సౌధ పునాదులే దెబ్బతింటాయని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎవరికీ దాసోహం చేయకూడదని ఆయన హితవు పలికారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సైతం ఎన్నికల పవిత్రతకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎలక్షన్లను పకడ్బందీగా నిర్వహించేందుకు స్వతంత్ర ఎన్నికల యంత్రాంగం ఏర్పాటుకు జాతినిర్మాతలు ఓటేశారు. జనజీవనంలో వారు ఆశించిన మార్పులు ఎంతవరకు సాకారమయ్యాయని చూస్తే ఆవేదనే మిగులుతుంది!

ప్రజాస్వామ్యమూ ఎన్నికలపై ఓ అంతర్జాతీయ సదస్సుకు తాజాగా దిల్లీ ఆతిథ్యమిచ్చింది. ఓటర్ల జాబితాలను పక్కాగా రూపొందించడం, ఎన్నికలను పారదర్శకంగా సక్రమంగా నిర్వహించడం, జనతంత్ర స్ఫూర్తిని కబళిస్తున్న తప్పుడు సమాచార వెల్లువను కట్టడి చేయడం వంటి తీర్మానాలను ఆ సదస్సులో పాల్గొన్న 40కి పైగా దేశాల ఎన్నికల నిర్వహణా యంత్రాంగాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దశాబ్దాల క్రితమే దేశీయంగా ధనవంతుల క్రీడాంగణంగా, ప్రలోభాల జాతరగా తయారైన ఎన్నికల ప్రక్రియను చక్కదిద్దడం అంత తేలికేమీ కాదన్నది చేదు నిజం! అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఆడుతున్న అరాచక క్రీడలో జాబితాల్లోంచి అర్హుల పేర్లు మాయమై బోగస్‌ ఓట్లు వచ్చి చేరుతుండటం జనస్వామ్య ప్రారబ్ధం. గతంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా వేలాది నకిలీ ఓటర్‌ కార్డులు వెలుగు చూడటం దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది. అప్పట్లో ఒకే డోర్‌ నంబర్‌తో పదికి పైగా ఓట్లు ఉన్న ఇళ్ల సంఖ్య ఏపీలో లక్షన్నరకు మించి తేలడమూ కలవరపరిచింది. పశ్చిమ్‌ బెంగాల్‌లోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో 389 మంది ఓటర్లకు తండ్రిగా ఒకరి పేరే ఉందని, మరోచోట 310 మందికి మరో వ్యక్తి నాన్నగా నమోదయ్యాడని కేంద్ర ఎన్నికల సంఘమే సుప్రీంకోర్టుకు ఇటీవల సమాచారమిచ్చింది. ప్రజాస్వామ్యం నామమాత్రంగా మిగలకూడదంటే తప్పుడు ఓట్లన్నింటినీ జాబితాల్లోంచి పూర్తిగా ఏరేయాలి. అర్హుల్లో ఏ ఒక్కరూ ఓటుహక్కుకు దూరం కాకుండా చూడాలి!

నీతీ నిజాయతీ ప్రజాసేవానురక్తి పుష్కలంగా ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేనివారు నేడు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అసంభవంగా మారిపోయింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలన్నీ కలిసి వెచ్చించిన సొమ్ము రూ.9 వేల కోట్లు అయితే, గత సార్వత్రిక సమరంలో ఆ మొత్తం రూ.1.35 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా! నల్లధనాన్ని వెదజల్లి ఓట్లు గుప్పిటపడుతున్నవారు ఆపై అంతకంతా సంపాదించే ధ్యేయంతో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. దానివల్ల ప్రజా ప్రగతి కుంటుపడుతోంది. అసమానతలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ధనస్వామ్యానికి అడ్డుకట్ట పడాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పదునుతేల్చాలి. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ప్రచారమవుతున్న నకిలీ వార్తలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మారుస్తున్నాయి. వాటి ముసుగులను తొలగిస్తూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అత్యవసరం!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :