Ponguleti Srinivasa Reddy: ప్రపంచంలోనే అత్యుత్తమంగా ‘భూభారతి’

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ‘‘గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన భూభారతి చట్టాన్ని మా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది’’ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు 47 మందికి కలెక్టరేట్‌లో ఆదివారం ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ధరణి’లో తప్పులను సవరించి, ఆధార్ కార్డుల్లా భూములకు భూధార్ సంఖ్య కేటాయిస్తామన్నారు. నూతన చట్టంలో భాగంగానే భూముల సమగ్రసర్వేకు 5,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించామన్నారు. మిగతా జిల్లాల్లోనూ రెండు, మూడు రోజుల్లో ధ్రువపత్రాలు పంపిణీ చేస్తారన్నారు. గతంలో ధరణిని అడ్డంపెట్టుకుని పాల్పడిన అక్రమాలను వెలికితీసేందుకు కేరళకు చెందిన ఓ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యత అప్పగించామన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అందిన నివేదికలను పరిశీలిస్తున్నామని, మిగతా జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. భూభారతి వచ్చాక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, అవన్నీ ధరణిలో లొసుగులతోనే చోటుచేసుకున్నాయని, రూ.వేల కోట్ల కుంభకోణం ఏమీలేదని, కేవలం రూ.3.9 కోట్లు దారి మళ్లాయని గుర్తించామన్నారు. జనగామ జిల్లాలో కొన్ని మీసేవా కేంద్రాల్లో జరిగిన అక్రమాలు వెలికితీసి దోషులను అరెస్టు చేసినట్లు వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పైరవీలకు తావు లేకుండా టికెట్లు
ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏదులాపురం పురపాలిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 15లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. పైరవీలు, వారసత్వాలకు తావులేదని, సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. టికెట్ దక్కనివారికి ఏదోరూపంలో సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీచేయాలని ఎవరు రెచ్చగొట్టినా మోసపోవద్దని సూచించారు. వార్డులవారీగా నాయకులతో ముఖాముఖి నిర్వహించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :