DRDO: వందల కి.మీ. దూరం చిన్నబోతుంది!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, కర్నూలు: సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను తుత్తునియలు చేసేందుకు సిద్ధం చేసిన దేశ తొలి లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) మొదటిసారి కనిపించనుంది. దిల్లీలో సోమవారం జరగనున్న గణతంత్ర వేడుకల కవాతులో దీనిని ప్రదర్శిస్తారు. ఈ క్షిపణి పరిధి 1500 కి.మీ. కాగా గంటకు 6,100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీలో అభివృద్ధి చేసిన ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను 2024 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందులో విజయం సాధించడంతో మరో రెండేళ్లలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.
- సముద్రజలాల్లో వేగంగా ప్రయాణించే యుద్ధనౌకలను ఈ క్షిపణి కచ్చితంగా గుర్తించి 100 శాతం ధ్వంసం చేస్తుంది.
- హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణిని శత్రుదేశ యుద్ధనౌక గుర్తించేలోపే పని ముగిసిపోతుంది. ఇందుకోసం ఏరో డైనమిక్ డిజైన్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
- ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను ప్రత్యేకంగా తయారుచేసిన మొబైల్ లాంఛర్ నుంచి ప్రయోగిస్తారు.
- ‘బూస్ట్ అండ్ గ్లైడ్’ సాంకేతికతను దీనికి వినియోగించారు. ప్రయోగించిన మరుక్షణమే గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది.
- భూ ఉపరితలాలపై ఉన్న లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదిస్తుంది.
- శత్రుదేశ రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీని రాకను గుర్తించలేవు.
- ఎలాంటి యుద్ధనౌకలనైనా క్షణాల్లో ధ్వంసం చేస్తుంది.
- అతితక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తూ లక్ష్యాలను చేరుకోగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. అన్ని రకాల పేలోడ్‌లనూ మోసుకెళ్లగలదు.
డీఆర్‌డీవో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లుగా తెలుగువారైన ఎ.ప్రసాద్‌గౌడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన ఆయన.. 30 సంవత్సరాల కిందట డీఆర్‌డీవోలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

హైపర్‌సోనిక్ క్షిపణులతో సుదూరంలోని లక్ష్యాలను మరింత వేగంగా, అత్యంత కచ్చితత్వంతో ఛేదించవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాయుసేన, పదాతి దళాల అవసరాలకు వీలుగా ఉండేలా మరిన్ని రకాల క్షిపణి వ్యవస్థలను తీర్చిదిద్దుతున్నాం.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 06:51 IST