

CM Chandrababu: అమరావతికి చట్టబద్ధత

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ విషయంలో ఆయా శాఖల కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని తెదేపా ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం-నల్లమలసాగర్‌లను ప్రాధాన్యాంశాలుగా తీసుకొని ప్రస్తావించాలన్నారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు.
ఆదివారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్, విభజన హామీల అమలు, విద్య, వైద్యం, జాతీయరహదారుల గురించి ప్రధానంగా చర్చించారు. రాబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు జనసేన, భాజపా ఎంపీలనూ ఆహ్వానించాలని నిర్ణయించారు. ‘‘తెదేపా ఎప్పుడు పొత్తులో ఉన్నా కూటమి ఐక్యతను కాపాడుతుంది. కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించొద్దు. మీ దృష్టి కేంద్ర పథకాలపై ఉండాలి. వాటిని సాధించాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్‌హెచ్‌లు, రైల్వేలైన్ల నిర్మాణం వేగంగా సాగాలి
రాష్ట్రంలో సుమారు రూ.లక్ష కోట్ల విలువైన రైల్వేలైన్లు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇవి మరింత వేగంగా పూర్తయ్యేలా ఎంపీలు చొరవ చూపించాలని చంద్రబాబు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలో పెట్టించి పూర్తిచేసేలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో లౌక్యంగా వ్యవహరించాలని సూచించారు. ‘‘పోలవరం తాజా అంచనాల్ని ఇప్పటికే కేంద్రానికి ఇచ్చాం. ప్రాజెక్టు నిర్మాణం, ఆర్‌అండ్‌ఆర్ పూర్తిచేయాలి. దీనికి రూ.12 వేల కోట్లు ఇంకా రావాలి. గోదావరి పుష్కరాలలోపు పోలవరం పూర్తిచేయాలి. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నీటి ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదు. నల్లమలసాగర్ లాంటి అంశాలు పార్లమెంటులో ప్రస్తావనకు వస్తే రాష్ట్ర వాదనలు గట్టిగా వినిపించాలి’’ అని తెలిపారు.
‘‘రాష్ట్ర అంశాలపై అవగాహనకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలంతా వర్చువల్‌గా పాల్గొనాలి’’ అని సీఎం సూచించారు. ‘‘ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు లేన్ల రైల్వేట్రాక్ వేసేలా చూడాలి. రైల్వే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంది. మీ నియోజకవర్గాల్లో అవసరాలు గుర్తించి నిధులు సాధించండి’’ అని చంద్రబాబు తెలిపారు.
పార్టీ కేంద్ర కార్యాలయానికి విధిగా రండి: నారా లోకేశ్
ప్రతి ఎంపీ పార్టీ కోసం సమయం కేటాయించాలని, విధిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి లోకేశ్ సూచించారు. చంద్రబాబు మాట్లాడాక ఎంపీలతో లోకేశ్ విడిగా సమావేశమయ్యారు. ‘రాష్ట్రస్థాయి అంశాలతో పాటు జాతీయస్థాయిలో ఎన్డీయే కార్యక్రమాలపై అవగాహన పెంచుకోండి. పార్లమెంటులో ప్రతిపక్షాలు భాజపాను విమర్శిస్తే వాటికి మనమూ దీటుగా సమాధానమివ్వాలి’ అని లోకేశ్ తెలిపారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, తెదేపా ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, బైరెడ్డి శబరి విలేకరులకు తెలిపారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 04:29 IST