
Blowout: బ్లోఅవుట్... పర్యావరణానికి పెద్ద ప్రమాదం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

చమురు, సహజ వాయువులు ఆధునిక సమాజానికి అత్యవసర ఇంధన వనరులు. అయితే వీటి అన్వేషణ, ఉత్పత్తి సమయంలో సంభవిస్తున్న బ్లోఅవుట్‌లు భయానకంగా ఉంటున్నాయి. భూగర్భంలోని అధిక పీడనం కారణంగా చమురు లేదా గ్యాస్ బావి గుండా పైకి ఎగదన్నడం వల్ల ఇవి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ దగ్గర ఓఎన్‌జీసీ బావిలో బ్లోఅవుట్ సంభవించడంతో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
భూమి లోతుల్లోని చమురు, వాయు నిల్వలు రాళ్ల మధ్య, అత్యధిక పీడనంతో కలిసి ఉంటాయి. తవ్వకాల సమయంలో ఈ పీడనాన్ని సమతుల్యం చేయడానికి ‘డ్రిల్లింగ్ మడ్’ అనే ప్రత్యేక ద్రవాన్ని చమురు లేదా గ్యాస్ బావిలోకి పంపుతారు. తద్వారా ఏర్పడే హైడ్రోస్టాటిక్ పీడనం భూగర్భ పీడనంతో సమానంగా, లేదంటే అంతకంటే ఎక్కువగా ఉండాలి. అలాలేనప్పుడు- చమురు, వాయువు అకస్మాత్తుగా బావిలోంచి ఎగదన్నుకుని వచ్చేస్తుంది. దీన్నే ‘కిక్’ అంటారు. వెంటనే నియంత్రించకపోతే, అది పెను ప్రమాదకరమవుతుంది. ప్రజల ప్రాణాలకూ, వ్యవసాయానికీ, నీటి వనరులకూ, చుట్టపక్కల పర్యావరణానికీ తీవ్ర ముప్పు వాటిల్లజేసే ఈ పరిస్థితిని నివారించడానికి బ్లోఅవుట్ ప్రివెంటర్ పరికరాలు కీలకమవుతాయి. అయితే వీటిని సరిగ్గా నిర్వహించకపోయినా, సిబ్బందికి సరైన శిక్షణ లేకపోయినా ఈ పరికరాలు విఫలమై ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.
మంటలు ఎలా చెలరేగుతాయి?
బ్లోఅవుట్ సమయంలో భూమి లోతుల్లోంచి చమురు, సహజ వాయువు నియంత్రణ లేకుండా వేగంగా బయటకు వస్తూనే ఉంటుంది. ఈ వాయువు ఉపరితల గాలిలోని ఆక్సిజన్‌తో కలిసినప్పుడు తక్షణం మండే స్వభావం ఏర్పడుతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఏపాటి చిన్న నిప్పురవ్వ వచ్చిపడినా క్షణాల్లో మంటలు ఎగిసిపడతాయి. చమురు-వాయు బావి దగ్గర ఎలక్ట్రిక్ స్విచ్, ఇంజిన్లు, జనరేటర్లు వంటి వాటిని ఆన్‌చేస్తారు కాబట్టి, అగ్గి రాజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంజిన్ వేడి వల్లా మంటలు రేగుతాయి. దేశంలో బ్లోఅవుట్ ప్రమాదాలు కొత్తవేమీ కావు. 1995 జనవరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి ప్రాంతంలో చోటుచేసుకున్న బ్లోఅవుట్‌ను నేటికీ స్థానికులు గుర్తుచేసుకుంటారు. అక్కడి చమురు-గ్యాస్ బావిలో తలెత్తిన మంటలు సుమారు 65 రోజులపాటు కొనసాగాయి. 2020 జూన్‌లో అస్సాంలోని తిన్‌సుకియా జిల్లాలో ఏర్పడిన గ్యాస్ బావి బ్లోఅవుట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దిబ్రూ-సైఖోవా జాతీయ ఉద్యానవనానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం, మంటలు ఆర్పడానికి 173 రోజులు పట్టడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన బ్లోఅవుట్ ఇదే. ఇప్పుడు ఏపీలోని కోనసీమలో సంభవించిన బ్లోఅవుట్ ఇలాంటి పాత గాయాలను మళ్లీ గుర్తుకు తెస్తోంది. అక్కడ ఒక పాత చమురు బావిలో నిక్షేపాలను వెలికితీయడానికి పరీక్షలు జరుపుతున్న సమయంలో భూమి లోతుల్లోని వాయుపీడనం అకస్మాత్తుగా అదుపు తప్పింది. గ్యాస్ ఒక్కసారిగా బయటికి రావడంతో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల అర కిలోమీటర్ వరకు 50డిగ్రీల ఉష్ణోగ్రతలు వ్యాపించాయి. డెల్టా ప్రాంతాల్లో పాత బావుల నిర్వహణ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

సమర్థంగా నివారించాలంటే...
బ్లోఅవుట్‌లను సమర్థంగా నివారించాలంటే భూగర్భంలోని పీడనాన్ని ముందుగానే కచ్చితంగా అంచనా వేయాలి. తవ్వకాల సమయంలో ‘డ్రిల్లింగ్ మడ్’ బరువు, రసాయన కూర్పు సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు ఏఐ ఆధారిత రియల్ టైమ్ పర్యవేక్షణ చేపట్టాలి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుండే బ్లోఅవుట్ నివారణ పరికరాలను సమకూర్చుకోవడం కీలకం. మరోవైపు విపత్తు స్పందనా దళాన్ని నిత్యం అప్రమత్తంగా ఉంచుతూ, ప్రమాదాలు సంభవించినప్పుడు సమర్థంగా ఎదుర్కొనేలా పటిష్ఠ ప్రణాళికలను రూపొందించుకోవాలి. చమురు, గ్యాస్ బావులకు పరిసరాల్లో ఉండే ప్రజలకు బ్లోఅవుట్‌లపై అవగాహన కలిగించడం ద్వారా ప్రాణ, పర్యావరణ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇంధన అవసరాలకంటే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఆయా సంస్థలూ ప్రభుత్వాలూ గ్రహించి... బ్లోఅవుట్ వంటి ప్రమాదాలను సమర్థంగా నివారించడంపై దృష్టి పెట్టాలి.

స్వదేశాల్లో తమ జీవితాలకు భద్రత లేదని భావిస్తున్న చాలామంది ఆశ్రయం కోసం విదేశాలను అభ్యర్థిస్తున్నారు. ఈజిప్ట్, అమెరికా, జర్మనీలకు అలాంటి విన్నపాలు ఎక్కువగా వస్తున్నాయి. 2024లో అసైలం కోసం ఆయా దేశాలకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారంటే... (లక్షల్లో)
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.