Venkaiah Naidu: ప్రయోగశాలల విజ్ఞానం.. ప్రజాక్షేత్రంలో వికసించాలి

Eenadu icon
By Telangana News Desk Updated : 09 Jan 2026 13:50 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
8 min read

ఈనాడు, హైదరాబాద్‌: శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించాలని, అప్పుడే విద్యార్థులకు ఆసక్తి పెరగడంతోపాటు సులువుగా అర్థమవుతుందని, పిల్లల మెదళ్లలో శాస్త్రీయ దృక్పథాలు బలంగా నాటుకుపోతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మన లక్ష్యం, గమ్యం ఒక్కటేనని... శాస్త్ర విజ్ఞానంలో అగ్రస్థానంలో ఉండటమేనన్నారు. అకాడమీ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్‌ (ఏఎస్‌టీసీ), ‘ఈనాడు’ సంయుక్తంగా, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ఇండియా (ఎన్‌ఏఎస్‌ఐ) తెలంగాణ చాప్టర్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ ఆడిటోరియంలో ‘ల్యాబ్‌ టు సొసైటీ: సైన్స్‌ కమ్యూనికేషన్‌ పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘శాస్త్రీయ అంశాలు నాలుగు గోడల మధ్యే ఆగిపోకుండా ప్రజల ముంగిటకు చేర్చి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని వేగవంతం చేయాలి.

శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాషలో బోధించడానికి వీలుగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి, యూజీసీలు పాఠ్యప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ప్రయోగశాలల్లో విజ్ఞానం.. ప్రజాక్షేత్ర వికాసానికి తోడ్పడాలి. పరిశోధనల ద్వారా తెలిసిన విషయాలను సమాజం మొత్తానికి పంచడం, తద్వారా ప్రజల దైనందిన జీవితానికి ఉపయోగపడేలా చేయడమే సైన్స్‌ కమ్యూనికేషన్‌ అసలు లక్ష్యం. పరిశోధకులు, ప్రజలు, విధాన నిర్ణేతల మధ్య సమాచార అంతరాన్ని తొలగించడానికి ఇది చాలా అవసరం. సైన్స్‌ కమ్యూనికేషన్‌ విస్తృతం కాకపోతే ఆవిష్కరణలు అకడమిక్‌ జర్నల్స్‌కే పరిమితమవుతాయి. విధాన నిర్ణయాలు, ప్రజారోగ్య కార్యక్రమాలు ప్రభావమంతంగా ఉండవు. పరిశోధన ఫలితాలు, వివిధ అధ్యయనాలను ప్రజలకు సమర్థంగా, విస్తృతంగా చేరవేయడం ద్వారా వాతావరణ మార్పులు, పంటలపై పురుగుమందుల హానికర ప్రభావం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేయడానికి వీలవుతుంది.

పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ముందుకు రావాలి

 ప్రైవేటు సంస్థలు తమ సీఎస్‌ఆర్‌ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ముందుకు రావాలి. ప్రతి పాఠశాలకు విడిగా ల్యాబ్‌ ఉండటం సాధ్యం కాకపోతే కొన్ని పాఠశాలలను కలిపి ఒక కేంద్రీకృత ల్యాబ్‌ ఏర్పాటు చేయాలి. పరిశోధనల్లో అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. రాశిపరంగా, వాసిపరంగా మనం మెరుగుపడాల్సి ఉంది. పేటెంట్ల దాఖలులోనూ మనం వెనకబడి ఉన్నాం’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

శాస్త్రీయ దృక్పథం లేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు.. 

మాతృభాషలో సైన్స్‌ బోధన ఉంటే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు అన్నారు. ఐఐటీల్లో కూడా మొదటి సంవత్సరం మాతృభాషలో చదువుకోవచ్చనే పాలసీ రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. క్లిష్టమైన సైన్స్‌ విషయాలను జనరంజకంగా, సరళంగా సామాన్యులకు చేరవేసినప్పుడే ల్యాబ్‌లలో జరిగే పరిశోధనలకు సార్థకత లభిస్తుందన్నారు. శాస్త్రవేత్తలు ల్యాబ్‌లకే పరిమితం కాకూడదని.. పాఠశాలలకు వెళ్లడం, మీడియాతో మాట్లాడటం, సామాన్యులకు పరిశోధనల గురించి వివరించడం చేయాలన్నారు. ప్రతి మీడియా సంస్థలో బిజినెస్, స్పోర్ట్స్‌ లాగే సైన్స్‌కు కూడా ప్రత్యేక డెస్క్‌ ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో ‘ఈనాడు’ భాగస్వామి కావడం సంతోషంగా ఉందని, శాస్త్రీయ దృక్పథం లేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదని తాము నమ్ముతామని పేర్కొన్నారు. 

ఇప్పటివరకు ఒక్కరే...

‘భారత్‌ ప్రస్తుతం నిస్సందేహంగా ఒక సైన్స్‌ పవర్‌హౌస్‌ అయినప్పటికీ మనల్ని మనం నిజాయతీగా కొన్ని అంశాల్లో ప్రశ్నించుకోవాల్సి ఉంది. దేశంలో అపార ప్రతిభ ఉన్నప్పటికీ దేశ పౌరుడిగా సైన్స్‌ విభాగంలో సి.వి.రామన్‌ మాత్రమే నోబెల్‌ అందుకున్నారు. జర్మనీ, జపాన్‌ వంటి చిన్న దేశాలు కూడా రెండంకెల సంఖ్యలో నోబెల్‌ బహుమతులు సాధిస్తున్నాయి. గొప్ప సైన్స్‌కు ల్యాబొరేటరీ ఎంత ముఖ్యమో... ఆదరించే శాస్త్రీయ సమాజం కూడా అంతే ముఖ్యం’ అని ఎం.నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

విద్యార్థులు సైన్స్‌ వైపు మళ్లేలా చూడాలి.. 

సైన్స్‌ని ల్యాబ్‌ నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు, జర్నలిస్టులు కీలకమని సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారని.. సైన్స్‌ వైపు వచ్చేలా చూడటంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషించాలన్నారు. వారు సమాజంలో నిజమైన ప్రభావాన్ని చూపగలరని అన్నారు. ‘నేను బీఎస్సీ వరకు తెలుగు మాధ్యమంలో చదివాను. ఎంఎస్సీ కూడా తెలుగు మాధ్యమంలో చదవాలనుకున్నా లేకపోవడంతో ఆంగ్ల మాధ్యమంలోకి మారాల్సి వచ్చింది. స్థానిక భాషలో సైన్స్‌ బోధన చాలా ముఖ్యమని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలి

వాట్సప్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ఏఎస్‌టీసీ ఛైర్మన్, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ఇండియా(ఎన్‌ఏఎస్‌ఐ) తెలంగాణ చాప్టర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సీహెచ్‌ మోహన్‌రావు అన్నారు. ఏదైనా చిట్కా, శాస్త్రీయ అంశం వైరల్‌ అయినప్పుడు అది నిజమో కాదో నిర్ధారించుకున్నాకే నమ్మాలన్నారు. సదస్సు ఉద్దేశాల గురించి ఏఎస్‌టీసీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.బి.ఎన్‌.ప్రసాద్‌ వివరించారు. సమావేశంలో ఏఎస్‌టీసీ కార్యదర్శి సి.ఎల్‌.నర్సింహారావు, ఈనాడు చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌ కె.సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సైన్స్‌పై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించినప్పుడే 2047 నాటికి భారత్‌ శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన దేశంగానే కాదు... శాస్త్రీయంగా విశ్వసనీయమైన దేశంగా కూడా ఉంటుందని ఐసీఎంఆర్‌ మాజీ డీజీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. 

‘‘సెన్స్‌ అంటే.. ఆరోగ్యం, ఆహారం, అంతరిక్షం, అంతర్జాలం వంటి అంశాల ద్వారా సామాన్యుడి జీవితాన్ని మెరుగుపర్చేది. మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్న రెండు ప్రధాన అంశాలు... ఆహారం, వాయు కాలుష్యం. ఆరోగ్యం, శ్రేయస్సుకు స్వచ్ఛమైన గాలి, నీరు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మానవ వనరులపై దృష్టి పెట్టాలి. దేశంలో ఆహారభద్రత ఉన్నప్పటికీ... సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా ఉంది. పిల్లల మెదడు వృద్ధి మొదటి ఐదేళ్లలోనే జరుగుతుంది. ఆ సమయంలో సరైన పోషకాహారం అందకపోతే దేశ భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. ప్రతి పాఠశాలలో నూట్రిషన్‌ గార్డెన్స్‌ ఉండాలి. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇవన్నీ  ఆహారం,  జీవనశైలిపై ఆధారపడి ఉన్నాయి. చిరుధాన్యాల వంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రోత్సహించాలి’’ అని పేర్కొన్నారు.

మానవ పురోగతికి సైన్స్‌ ఎప్పుడూ ఒక మూలస్తంభంగా ఉంటూ వస్తోందని.. ప్రయోగశాలలోని జ్ఞానాన్ని సమర్థంగా సమాజానికి చేరవేసి, సామాజిక ప్రయోజనంగా మార్చినప్పుడే నిజమైన ప్రభావం కన్పిస్తుందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి గవర్నర్‌ సందేశం పంపారు. ‘శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలోనూ, పౌరులు సమాచారంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పించడంలోనూ సైన్స్‌ కమ్యూనికేషన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్‌ భారత్‌ 2047 దిశగా భారత్‌ అడుగులు వేస్తున్న తరుణంలో శాస్తీయ పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా, నమ్మదగిన రీతిలో ప్రచారం చేయడం అత్యంత కీలకం’ అని పేర్కొన్నారు.

మన దైనందిన జీవితం పూర్తిగా శాస్త్ర, సాంకేతికతలపై ఆధారపడినప్పటికీ, ఈ రంగాల్లో జరుగుతున్న పరిణామాల గురించి అవగాహన ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారని రామోజీ గ్రూప్‌ సంస్థల సీఎండీ సీహెచ్‌ కిరణ్‌ అన్నారు. సదస్సును ఉద్దేశించి ఆయన సందేశం పంపారు.   ‘ప్రభావవంతమైన సైన్స్‌ కమ్యూనికేషన్‌తో కలిగే ప్రయోజనాలను మనం కొవిడ్‌ సమయంలో చూశాం. సైన్స్‌ రంగ ప్రగతి ఫలాలు సామాన్యుడికి సైతం అందాలంటే మాతృభాషలో సైన్స్‌ కమ్యూనికేషన్‌ను పెద్దఎత్తున ప్రోత్సహించాలి. సోషల్‌ మీడియా యుగంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే మూఢనమ్మకాలు, అపోహలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడంలో విశ్వసనీయమైన సైన్స్‌ కమ్యూనికేషన్‌ సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.

దేశంలోని 2015 నుంచి 2023 మధ్య క్షయ వ్యాధి వల్ల సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించామని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి మెడికల్‌ ఆంకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.రఘునాథరావు అన్నారు. ‘డెంగీ జ్వరంతో మరణాల రేటు, ప్రసూతి, శిశు మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాలను గణనీయంగా నియంత్రించాం. టీకాల వల్ల ఈ ఘనత సాధించాం. అయితే ప్రస్తుతం హృద్రోగ సమస్యల వల్ల మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. సరైన శారీరక శ్రమ, తగినంత విశ్రాంతి ఉంటేనే ఆరోగ్యకరంగా ఉంటారు’ అని పేర్కొన్నారు.

ఒక చిన్నారికి పోషణ మెరుగుపరచడమంటే మంచి ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు. గర్భధారణ సమయంలో, అంతకుముందు... ఆ మహిళ అందుకు సిద్ధంగా ఉందా, లేదా అనే అంశం చాలా ముఖ్యమని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ సైంటిస్ట్‌  డాక్టర్‌ సుబ్బారావు ఎం. గవరవరపు అన్నారు. ‘ఇలాంటి విషయాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలు మాత్రమే పట్టించాలి. నీళ్లు కూడా అవసరం లేదు’ అని వివరించారు.

సైన్స్‌లో కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన విజ్ఞాన్‌శ్రీ అవార్డులను ఇటీవల అందుకున్న నాగ్‌పుర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నీరి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటమోహన్, సీడీఎఫ్‌డీ మాజీ డైరెక్టర్, సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.తంగరాజ్‌లను, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.బాలసుబ్రమణ్యం, ఎన్‌డీటీవీ సీనియర్‌ సైన్స్‌ ఎడిటర్‌ పల్లవా బాగ్లాను సదస్సులో సన్మానించారు. సదస్సు సావనీర్‌ను ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. 

ఏఎస్‌టీసీ రూపొందించిన రెండు పుస్తకాలను ఐసీఎంఆర్‌ మాజీ డీజీ సౌమ్య స్వామినాథన్‌ ఆవిష్కరించారు. పుస్తక రచయితలు రఘునాథరావు, డాక్టర్‌ లీల, కళాచంద్‌ సేన్‌లను సత్కరించారు. జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో సైన్స్‌ ఉపాధ్యాయులు సదస్సులో పాల్గొన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:52 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పార్టీలో అవమానం ఇంకెంతకాలం.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ప్రశ్న వలసవాదికి జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
  • ఆ బూడిద భారం కరెంటు ఛార్జీలపై వద్దు! థర్మల్‌ విద్యుత్కేంద్రాల (టీపీపీల) నుంచి వెలువడుతున్న బూడిదను అవసరమైతే పరిశ్రమలకు ఉచితంగానైనా ఇచ్చేయాలని, దాని తరలింపు పేరుతో సామాన్య ప్రజలు చెల్లించే కరెంటు ఛార్జీలపై ఆర్థికభారం మోపవద్దని కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశించింది.
  • రూ.కోట్లు పోయె... గెలవకపాయే! వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి ఇది. ఖర్చుల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గంలేక ఆస్తుల అమ్మకానికి సిద్ధపడుతున్నారు.
  • కర్ల రాజేశ్‌ మృతి కేసులో అలసత్వం ఎందుకు? దళిత యువకుడు కర్ల రాజేశ్‌ మృతి ఘటనలో అధికారుల పనితీరుపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.
  • మేయర్‌ జీతమెంతో తెలుసా? రాష్ట్రంలోని 7నగరపాలక సంస్థలు, 105 పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు. కొత్త మేయర్లు, ఉపమేయర్లు.
  • తల్లడిల్లుతూ.. తల్లి ప్రేమను చాటిన ఆవు తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. తన బిడ్డను కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ గోమాత చూపిన చొరవ అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
  • ‘పుర’ విజేతల్లో 64 మంది మహిళలే రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 112 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్ల పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో 57.14% మంది మహిళలు విజయం సాధించారు.
  • వైభవంగా మల్లన్న ‘పెద్ద పట్నం’ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున ‘పెద్ద పట్నం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
  • శ్రీ చైతన్య ప్రభంజనం జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. శ్రీ చైతన్య విద్యార్థి పసల మోహిత్‌ 300/300 మార్కులతో 100 పర్సంటైల్‌ సాధించి జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు.
  • జమ్మికుంటలో తోపులాట కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పురపాలక ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది.
  • కాంగ్రెస్‌ మద్దతుతో.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి పీఠం వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక్కడ మొత్తం 10 వార్డులకుగాను.. భాజపా, భారత రాష్ట్ర సమితి  , కాంగ్రెస్‌ అభ్యర్థులు మూడేసి వార్డుల్లో గెలిచారు.
  • ‘సీఐఐ-ఐజీబీసీ’ జాతీయ ఛైర్మన్‌గా సి.శేఖర్‌రెడ్డి కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) జాతీయ ఛైర్మన్‌గా సీఎస్‌ఆర్‌ ఎస్టేట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శేఖర్‌రెడ్డి ఎంపికయ్యారు.
  • జగిత్యాల భాజపా జిల్లా అధ్యక్షుడిపై దాడి మెట్‌పల్లి పట్టణంలో ఛైర్మన్‌ సీటు కోల్పోయామన్న ఆగ్రహంతో భాజపా కార్యకర్తలు, ఆ పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు.. తమ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు ఇంటిపై సోమవారం దాడి చేశారు.
  • బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం ‘అరుదైన వ్యాధి తినేస్తోంది..ఆదుకోండి!’ అనే శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన మానవీయ కథనానికి దాతలు స్పందించారు.
  • విద్యుత్తు బకాయిల వివాదంలో గీతం వర్సిటీకి ఊరట విద్యుత్తు బకాయిల వివాదం నుంచి హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీకి తాత్కాలిక ఉపశమనం లభించింది.
  • క్యాన్సర్‌కు కణ చికిత్స క్యాన్సర్‌ చికిత్సలో ఒక విప్లవాత్మక అధ్యాయం మొదలైంది. మహమ్మారిని అంతమొందించేందుకు ‘కణ’ చికిత్సను విజయవంతంగా ఆవిష్కరించారు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌. వర్సిటీలోని ‘పెరెల్మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో క్యాన్సర్‌ చికిత్సలో సెల్, కార్‌-టి సెల్, జన్యు థెరపీలపై ఆయన చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి.
  • ఒకే వాహనంలో వచ్చిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, భాజపా ఎంపీ ఇస్నాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఒకే వాహనంలో వచ్చారు.
  • హైదరాబాద్‌లో సనోఫీ జీసీసీ విస్తరణ ఔషధ తయారీ సంస్థ సనోఫీ హెల్త్‌కేర్‌ ఇండియా, హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను భారీగా విస్తరించింది. అత్యాధునిక హంగులతో అదనపు కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది.
  • పీఠాలపై దంపతులు నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి దంపతులు ఎన్నికయ్యారు.
  • ఆ మూడు పార్టీల మధ్య బంధమేంటో ప్రజలకు చెప్పాలి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి  , ఎంఐఎం పార్టీలు ఏకమై భాజపాను ఎదగనీయకుండా కుట్రలు చేస్తున్నాయని, అయినా రాష్ట్రంలో కమలం బలపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు.