
Agri University: అగ్రివర్సిటీలో బీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానికి బాధ్యులైన ఒక ఉన్నతాధికారి, ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. 35 మంది ఇన్‌సర్వీసు అభ్యర్థులకు లీకేజీ ప్రశ్నపత్రాలు అందినట్లు గుర్తించారు. వీరంతా వ్యవసాయ విస్తరణాధికారులుగా ఉండి ఇన్‌సర్వీసు కోటాలో మూడేళ్ల క్రితం బీఎస్సీలో ప్రవేశాలు పొందారు. వారి ప్రవేశాలను రద్దు చేసి, తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వారికి మళ్లీ ఇన్‌సర్వీసు కోటాలో బీఎస్సీ ప్రవేశాలు కల్పించకుండా బ్లాక్‌లిస్టులో చేర్చారు.
ఇలా వెలుగు చూసింది...
గత వారం వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. గత నెలలో జరిగిన సెమిస్టర్ పరీక్షల మార్కుల షీట్లను పరిశీలించారు. అందులో ఇన్‌సర్వీసు విద్యార్థులకు.. కఠినమైన పాథాలజీ సబ్జెక్టులో 90 శాతానికి పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించారు. సాధారణంగా పాథాలజీలో అత్యంత ప్రతిభావంతులకే 60 శాతం కంటే ఎక్కువ రావు. అలాంటిది 90 శాతానికి పైగా మార్కులు ఎలా వచ్చాయనే అనుమానంతో ఆయన పరీక్షలు జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీలను తెప్పించి పరిశీలించారు. అందులో ఒక ఇన్‌సర్వీస్ అభ్యర్థి పది నిమిషాల్లోనే పరీక్ష పూర్తిచేసి, ఖాళీగా కూర్చున్నట్లు గుర్తించారు. ఆ విద్యార్థిని పిలిచి గట్టిగా ప్రశ్నించడంతో వరంగల్ నుంచి వాట్సప్‌లో ప్రశ్నపత్రం వచ్చిందని చెప్పారు. పార్ట్ ఏలోని 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను ఏఐ ఆధారిత పెన్నులో నమోదు చేసుకుని.. పరీక్ష రాసినట్లు వెల్లడించారు. దీనిపై వీసీ ముగ్గురు అధికారులతో కమిటీ వేసి విచారణ జరిపించడంతో మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. వరంగల్ వ్యవసాయ కళాశాల అధికారి, ఉద్యోగి కలిసి 6 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సప్ గ్రూపుల ద్వారా ఇన్‌సర్వీసు అభ్యర్థులకు పంపినట్లు గుర్తించారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న 35 మంది ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్నపత్రాలు చేరగా... వారంతా కృత్రిమమేధ ఆధారిత పెన్నులలో జవాబులు నమోదు చేసుకొని పరీక్షలు రాసినట్లు తేలింది. లీకేజీ వ్యవహారం వెలుగుచూడడంతో వర్సిటీలో ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణపై సైబర్ నేరాల విభాగం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని వీసీ జానయ్య నిర్ణయించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:53 IST