AP High Court: సతీష్‌కుమార్‌ అసహజ మరణం కేసును మేమే పర్యవేక్షిస్తాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 09 Jan 2026 04:23 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి పరకామణిలో కానుకల చోరీ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదుచేసిన ఏవీఎస్‌వో (అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) వై.సతీష్‌కుమార్‌ అసహజ మరణంపై సీఐడీ దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభియోగపత్రం దాఖలు చేసేవరకూ కేసును తామే పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. ఏసీబీ దాఖలుచేసిన నివేదికల ప్రకారం పరకామణిలో చోరీకి పాల్పడిన సీవీ రవికుమార్‌ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని స్పష్టంచేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 (ప్రభుత్వోద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడటం) సెక్షన్‌ నమోదు చేయలేదంది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్, ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని పేర్కొంది.

చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు నిందితుడు రవికుమార్‌ తదితరులతో తితిదే అప్పటి అధికారుల, పోలీసులు కుమ్మక్కయ్యారని పునరుద్ఘాటించింది. నిందితుడు రవికుమార్‌ తితిదేకి ఇచ్చిన ఆస్తులను స్వీకరించే విషయంలోనూ తితిదే అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనలను పాటించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి ఈ అంశాల విషయంలో ‘చట్ట నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలి’ అని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు, తితిదేకి స్పష్టంచేసింది. దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. సంబంధిత అధికారులను అభినందించింది. 

  • మరోవైపు పరకామణిలో కానుకలు లెక్కించేందుకు స్వచ్ఛందంగా వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడాన్ని నిలిపివేయాలని కోర్టు చేసిన సూచనకు తితిదే ఈవో సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. కానుకల లెక్కింపునకు టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న కోర్టు సూచనను పాటించడం సాధ్యం కాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అనుసరించే ఆలోచనలతో ముందుకురావాలని ఈవోకు సూచించింది. అందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 
  • గురువారం జరిగిన విచారణలో ఈవో తరఫు న్యాయవాది శ్రీనివాసబాబా వాదనలు వినిపిస్తూ.. ‘టేబుళ్లను ఏర్పాటుచేసి కానుకలను లెక్కించాలని న్యాయస్థానం చేసిన సూచనను అనుసరించడం సాధ్యం కాదు. ఆర టన్ను బరువున్న హుండీని టేబుల్‌పై బోర్లించడం సురక్షితం కాదు. రోజూ పరకామణిలో 300 మంది భక్తులు కానుకలను లెక్కిస్తారు. వారందరికీ టేబుళ్లు ఏర్పాటుచేయడం సాధ్యం కాదు. తితిదేలో ప్రస్తుత విధానాల్లో మార్పులు తేవాలంటే ఆగమశాస్త్ర పండితులు, తితిదే బోర్డు సభ్యుల ఆమోదం తప్పనిసరి. ఈవో ఒక్కరే నిర్ణయించలేరు. బోర్డులో ఎలాంటి సభ్యులున్నారో మీకు (కోర్టుకు) తెలిసిందే. కోర్టు చేసిన సూచనలను శాశ్వత ప్రణాళిక(ప్లాన్‌-బి)లో అమలు చేసేందుకు ఈవో చర్యలు తీసుకుంటారు’ అన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. కోర్టు సూచనలను పట్టించుకోకుండా సంప్రదాయాలను సాకుగా చూపుతారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కానుకలను కింద పోసి, తొక్కుతూ నడవడం సంప్రదాయమా? అని మండిపడ్డారు. లెక్కింపులో అనుసరిస్తున్న ప్రస్తుత విధానం సరైంది కాదన్నారు.

సీఐడీ విచారణతో పాటు తన ఆస్తుల విషయంలో దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్‌ దాఖలుచేసిన అప్పీల్‌పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ఏదో ఉందని పేర్కొంది. రూ.15 కోట్ల ఆస్తులు తితిదేకి సరెండర్‌ చేసి మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుకునేందుకు జరిగిన ప్రయత్నం కేసు కదా అని గుర్తుచేసింది. ప్రస్తుతం రవికుమార్‌ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం గరువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

రవికుమార్‌ అప్పీల్‌తో పాటు చోరీ కేసును రాజీ చేస్తూ లోక్‌ అదాలత్‌ జారీచేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే విషయంపై నమోదుచేసిన సుమోటో వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో రవికుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు జరపాలని, కేసు నమోదు చేయాలని సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారన్నారు. రవికుమార్‌పై తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్నారు. ఇది చిన్న చోరీ కేసని తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:16 IST