త్రికరణశుద్ధిగా...

Eenadu icon
By Editorial Team Published : 19 Dec 2025 02:56 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడికి త్రికరణ శుద్ధి అంటే ఏంటన్న సందేహం వచ్చింది. నేరుగా వెళ్లి గురువును అడిగేశాడు. మనసు, మాట, చేత ఒకటవ్వడమే త్రికరణ శుద్ధి అంటే అని చెప్పారు గురువు. వివరించమని అడిగాడు శిష్యుడు. ‘నువ్వు పైకి గురువుగారూ, మీ మూలంగానే జ్ఞానాన్ని పొందుతున్నానంటావు. లోలోపల ఇంకా ఎంతకాలం ఈ చాకిరీ చేయించుకుంటాడో అనుకుంటావు. గురువుకు సేవలు చేయడమే నీ కర్తవ్యమన్నట్లు ప్రవర్తిస్తావు... అంటే నీ మనసులో ఉన్నదొకటి, నాకు చెప్పేదొకటి, చేస్తున్నట్లు కనిపించేది ఇంకొకటి. దీన్ని త్రికరణ శుద్ధి లేకపోవడం అంటారు. ఉండటం అంటే ఏంటో నువ్వే అర్థం చేసుకో’ అని గురువు అనడంతో శిష్యుడికి విషయం బోధపడింది. 

ఒక్కమాటలో చెప్పాలంటే త్రికరణ శుద్ధి అంటే అంతఃకరణం శుభ్రంగా ఉండటమే. మనసు స్వచ్ఛంగా ఉంటే మాట మధురమవుతుంది. అది ఎదుటివారి మన్ననలను అందుకుంటుంది. ఇక్కడ కొంతమంది పొరపాటు పడే అంశం ఒకటుంది. ఒక వ్యక్తి నేరం చేయాలనుకుంటాడు, ఫలానా నేరం చేస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాడు. మూడూ ఒకటయ్యాయని దాన్ని త్రికరణ శుద్ధి అనరు. అది త్రికరణ ఐక్యం మాత్రమే కానీ, శుద్ధి కాదు. మనసు, కర్మ,వాక్కు అనే మూడూ పాపరహితంగా సద్భావంతో కలిసినప్పుడే అది త్రికరణ శుద్ధి అవుతుంది. త్రికరణాలు ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. 

మన ఆలోచనలే మాటలవ్వాలి, మాటలు చేతలవ్వాలి. అవి ఎల్లవేళలా సమాజానికి మేలు చేయాలి. మనిషి వ్యక్తిత్వపరంగా పరిణతి సాధించాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నా, సమాజంలో ఆదర్శపౌరుడిగా నిలబడాలన్నా, జీవితంలో శాంతీ సౌఖ్యం పొందాలన్నా... ఈ త్రికరణ శుద్ధి తప్పనిసరి.

వార్షిక పరీక్షల్లో ఓ విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లోనూ ఎనభైల్లో మార్కులు వచ్చాయి, ఒక్క దాంట్లో మాత్రం పదే వచ్చాయి. కాబట్టి ఆ అబ్బాయి ఫెయిలైనట్లేనంటారు కొంతమంది విద్యార్థులు. అన్ని సబ్జెక్టులూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి పాస్‌ చేసి పై తరగతికి పంపొచ్చంటారు మరికొంతమంది. ఇరువర్గాల వాదన విన్న గురువు ఇలా చెప్పారు... ‘ఒక్క విషపు చుక్క కలిసినా బిందెడు పాలు పనికి రాకుండా పోతాయి. అలాగే సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలంటే మన వ్యక్తిత్వంలో చిన్న మరక కూడా ఉండకూడదు. అలాగే అన్ని విభాగాల్లోనూ సమాన ప్రతిభ చూపినప్పుడే విద్యార్థి రాణిస్తాడు. ఏ ఒక్కదాంట్లో విఫలమైనా అది సమగ్రమైన విజ్ఞానం అవదు’.  త్రికరణశుద్ధిగా శ్రమించినప్పుడే అలాంటి జ్ఞానం అలవడుతుంది.

కొందరికి గొప్ప ఆలోచనలుంటాయి. వాటి గురించి అద్భుతంగా ప్రసంగిస్తారు. కానీ ఒక్కటీ ఆచరించరు. అలాంటివారు ఎప్పటికీ విజేతలు కాలేరు. మనసా, వాచా, కర్మణా తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించారు కాబట్టే గాంధీజీ మహాత్ముడయ్యారు. వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో త్రికరణ శుద్ధిలేని పనులేవీ స్థిరమైన విజయాలు పొందలేవు. 

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :