Movie Tickets Price: ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు.. మెమోను కొట్టేసిన హైకోర్టు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: ‘ది రాజాసాబ్’ చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ హోంశాఖ ఇచ్చిన మెమోను కోర్టు కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరల పెంచుతూ ఇచ్చిన మెమోను కొట్టేసింది.
ఈ సందర్భం అధికార యంత్రాంగంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా? అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :