Angry: కోపం... ఎవరిమీద?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ముక్కు మీద కోపం ముఖానికి అందమో కాదో తెలీదు కానీ అనుబంధాలకు మాత్రం అదో పెద్ద అవరోధమే. తన కోపమే తన శత్రువని చిన్నప్పుడే చదువుకున్నా, కోపం వచ్చినప్పుడు పది లెక్కపెట్టమని పెద్దలు సూచించినా... అవి మాటల వరకే. ఏ మహాత్ములో తప్ప మామూలు మనుషులు వాటిని ఆచరణలో ప్రయత్నించరు. కానీ రానురాను సామాజిక జీవనం సంక్లిష్టమవుతోంది. కోపం తెచ్చుకునే సందర్భాలు పెరుగుతున్నాయి. కట్టలు తెంచుకుంటున్న కోపం ఎన్నో దారుణాలకు కారణమవుతోంది. అందుకే ‘నెవర్ గెట్ యాంగ్రీ ఎగైన్’ అనే పుస్తకం రాశారు డాక్టర్ డేవిడ్ జె.లైబెర్‌మాన్. సైకోథెరపిస్ట్ అయిన ఆయన అసలు కోపం ఎందుకొస్తుంది? అది మన జీవితాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకోకుండా మనసును ఎలా నియంత్రించుకోవాలి... తదితర ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో చర్చించారు.
ఎదుటి వ్యక్తులూ వారి చర్యల వల్ల మనకు కోపమొస్తుందనుకుంటాం కానీ, వాస్తవానికి కోపానికి కారణం మనమేనంటారు రచయిత. ‘మనం’ అంటే ఇక్కడ ‘అహం’. అమర్యాద, అన్యాయం, తిరస్కారం లాంటివి ఎదురైనప్పుడు తన ఉనికికి, అభిమానానికి, గుర్తింపునకు హాని జరిగినట్లు ఈగో భావిస్తుంది. మనల్ని గౌరవించరేమో, ప్రేమించరేమో, హక్కును కోల్పోతామేమో... అని భయపడుతుంది. ఆ భయమే కోపంగా బహిర్గతమవుతుంది. ‘యాంగర్ మేనేజ్‌మెంట్ అంటారు కానీ నిజానికి మేనేజ్ చేయాల్సింది కోపాన్ని కాదు, ఈగోని’ అంటారు లైబెర్‌మాన్. మనిషి ప్రవర్తన పూర్తిగా ఈగో కంట్రోల్‌లోనే ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన జరగ్గానే వెంటనే రియాక్ట్ అవుతాం. పుట్టినరోజునాడు ఫ్రెండ్ విష్ చేయకపోతే కొత్త ఫ్రెండ్స్ మోజులో మనల్ని మర్చిపోయారనీ, మనమంటే ప్రేమ లేదనీ ఇలా ఏవేవో ఊహించుకుంటాం. కోపమొచ్చేస్తుంది. ఆ కోపంలో నిష్ఠూరంగా ఒక మెసేజ్ పెట్టడం, మరొకరి దగ్గర వ్యాఖ్యానించడం లాంటిదేదో చేస్తాం. అది చాలు కదా... స్నేహబంధం బీటలు వారడానికి! అదే కాసేపు ఈగోని పక్కనపెడితే- పనిలో బిజీగా ఉన్నారేమో, తేదీ మర్చిపోయి ఉంటారు- అని లైట్ తీసుకుంటే మన మనసుకీ హాయి. ఆ స్నేహమూ పదిలంగా ఉంటుంది. దీన్నే లైబెర్‌మాన్ రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవడంగా పేర్కొన్నారు. బలహీన మనస్తత్వం ఉన్నవారు మాత్రమే రియాక్ట్ అవుతారన్నది రచయిత మాట.
కోపం మనల్ని నియంత్రించకుండా లైబెర్‌మాన్ ఆరు ముఖ్యమైన విధానాలను అనుసరించమంటారు. జరిగినదానికన్నా ముందు ఊహించుకున్న దానివల్ల ఎక్కువ కోపం వస్తుంది కాబట్టి వాస్తవాలకు ప్రాధాన్యమివ్వాలి. ఈగోని తగ్గించుకోవాలి- అంటే ప్రతి విషయాన్నీ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. రియాక్ట్ అయ్యేముందు ఒక్క క్షణం ఆగాలి. కోపం చాలా వేగంగా వచ్చే ఎమోషన్. అలా ఆగినప్పుడు దాని ప్రభావం నుంచి బయటపడి ప్రవర్తన మన అదుపులోకి వస్తుంది. చాలాసార్లు గతమూ భవిష్యత్తుల గురించిన ఆలోచనలు కోపానికి కారణమవుతాయి. అటువంటప్పుడు వర్తమానం మీదికి దృష్టి మళ్లించాలి. అభద్రత, ఆత్మన్యూనత లాంటి బలహీనతలను అధిగమించాలి. నిండైన ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లకు ఇతరుల చర్యల వల్ల తమ విలువ, గౌరవం తగ్గవని తెలుసు. ఆ ఆత్మస్థైర్యం ఈగో గొంతు నొక్కి మనిషిని బలంగా నిలబెడుతుంది. ఇతరుల ప్రవర్తనని జడ్జ్ చేయకుండా ఏం జరిగిందో తెలుసుకునే కుతూహలాన్ని ప్రదర్శించాలి. అది కోపాన్ని కరిగించేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలను ఉదాహరణలతో వివరిస్తుందీ పుస్తకం.

నువ్వు చేయాల్సింది చెయ్యి, ఫలితం గురించి ఆలోచించవద్దన్న భగవద్గీతా పాఠాన్ని అనుసరించడం న్యాయరంగంలో ఉన్నవారికి చాలా అవసరం. కేసు పరిష్కరించిన తరవాత లభించే ప్రతిఫలాన్ని ఆశించకుండా న్యాయం తరఫున పనిచేయగలగాలి.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.