women freedom: స్త్రీ స్వేచ్ఛకు ఎన్నాళ్లీ సంకెళ్లు?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

‘ఆచూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది/ చొంగకార్చే కుక్కలాంటి ఆకలుంటుంది...’ అంటూ అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలో తిరుగాడే కొందరి చూపులు మహిళలను ఎంతగా హింసిస్తాయో కవయిత్రి జయప్రభ ఓచోట ఆవేదనాత్మకంగా వివరిస్తారు. చూపులను దాటి చేతల్లో రాక్షసుల వారసులై స్త్రీలను కాల్చుకుతినేవారు అడుగడుగునా పొంచి ఉండటమే దేశం దౌర్భాగ్యం. కరడుగట్టిన పితృస్వామ్య భావజాలాన్ని నరనరానా ఎక్కించుకున్నవాళ్లు ‘మగాళ్లం.. మాకేంటి అడ్డు’ అన్నట్లు మాటలూ చేష్టలతో ప్రతిచోటా మహిళలను వికృత వేధింపులకు గురిచేస్తున్నారు. తాగి తందనాలాడుతూ, బలాదూర్ తిరిగేవాళ్లు కూడా ప్రేమ పేరిట వెర్రి వేషాలెన్నో వేస్తున్నారు. కాదూ కూడదంటే అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌చేసి ఆన్‌లైన్‌లో పెట్టి వారి ఉసురుపోసుకుంటున్నారు. స్త్రీలను ఆటబొమ్మలుగా జమకట్టే కర్కోటకులేమో పసిపిల్లలు మొదలు పండు ముదుసలి వరకూ అందరిపై హేయ అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆలోచనల్లోనే నానా అవలక్షణాలు నింపుకొన్న మరికొందరు... అలా ఉండాలి, ఇలా ఉండకూడదంటూ అమ్మాయిలను ఆంక్షల చట్రంలో ఇరికించడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలపై అసభ్యపు రాతలూ, కూతలతో రెచ్చిపోతున్నారు. ఇక సూడో సంస్కార మూర్తులది మరో పెద్ద కథ. మహిళా సాధికారత, కుటుంబ విలువల గురించి బయటికెన్ని నీతులు చెప్పినా ఇంట్లో భార్యలను రాచిరంపాన పెట్టడం వారికి మామూలు విషయం. మెదళ్లను ఆదిమకాలపు గుహల్లో పూడ్చిపెట్టిన ఇలాంటి ప్రబుద్ధులు యథేచ్ఛగా పేట్రేగిపోతుండటంవల్లే ఇండియాలో స్త్రీలపై దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అవి అంతర్జాతీయంగా దేశం పరువును మంటగలుపుతున్నాయి!

తెలంగాణ డీజీపీ వెల్లడించిన లెక్కల ప్రకారం- 2024తో పోలిస్తే నిరుడు రాష్ట్రంలో మహిళలపై నేరాలు మూడు శాతం పెరిగాయి. స్త్రీల ప్రతిష్ఠకు భంగం కలిగించిన కేసులైతే ఏకంగా తొమ్మిది శాతం అధికమయ్యాయి. మహిళల హత్యల విషయంలోనూ దాదాపు మూడుశాతం పెరుగుదల నమోదైంది. ఏపీ డీజీపీ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో గతేడాది 1467 అత్యాచారాలు చోటుచేసుకున్నాయి. మహిళలపై మొత్తం నేరాలు పదహారు వేలకు పైబడ్డాయి. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం మహిళలపై దాష్టీకాలకు సంబంధించి 2023లో దేశవ్యాప్తంగా 4.48 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముప్పై శాతం భర్తలు లేదా బంధువుల క్రూరత్వానికి సంబంధించినవే! దేశవ్యాప్తంగా 2012లో 24,519 అత్యాచార కేసులు వెలుగు చూస్తే, పదకొండేళ్లలో అవి 29,670కి పెరిగిపోయాయి. పద్నాలుగేళ్ల కిందట దేశ రాజధాని దిల్లీలో కదులుతున్న బస్సులో ‘నిర్భయ’పై జరిగిన ఘోరం యావత్ దేశంతో కంటతడి పెట్టించింది. నిరసనలు పెల్లుబుకిన దరిమిలా చట్టాలకు ప్రభుత్వాలు మరింత పదును పెట్టాయి. అయినా ఒరిగిందేమిటి? ఆ తరవాతా అలాంటి భయంకర ఘటనలు చాలా చోట్ల చోటుచేసుకున్నాయి. వారం రోజుల కిందటా జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక వివాహితకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులోకి ఎక్కించుకున్న దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రంతా ఆమెను వీధుల్లో తిప్పి కదులుతున్న కారులోంచి బయటికి విసిరేశారు. ముక్కుపచ్చలారని చిన్నారులనూ దుష్టబుద్ధితో చూసేవారికి దేశీయంగా కొదవలేదు. ఇక విద్యాలయాల్లో, పని ప్రదేశాల్లో చాలాచోట్ల స్త్రీలకు వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. పిశాచ సంతతి ఇంతగా పేట్రేగుతుంటే మహిళలు నిర్భయంగా బయట తిరిగేదెలా?
సమాజంలో మహిళలు అడుగడుగునా చవిచూస్తున్న పీడన తీవ్రతను తెలుసుకోవడానికి మొన్నామధ్య 31 నగరాల్లో ఒక సర్వే జరిగింది. అందులో పాల్గొన్న స్త్రీలలో 40శాతం మంది తాముంటున్న పట్టణాల్లో తమకు భద్రత లేదని తేల్చిచెప్పారు. రోజూ తాము ఎదుర్కొనే అగచాట్ల గురించి బయటికి చెప్పినా తమ వ్యక్తిత్వాన్నే తప్పుపడతారేమోనని శంకించి, కుటుంబం పరువు పోతుందేమోనని భయపడి, వ్యవస్థపై నమ్మకం కొరవడి చాలామంది మిన్నకుండిపోతున్నారు. బాధితుల్లో కనీసం పాతికశాతం మంది బాధను పంటిబిగువున దాచుకుని తలదించుకుని వెళ్లిపోతున్నారు. అందుకే, మహిళలపై దాష్టీకాలకు సంబంధించి చాలా ఘటనలు వెలుగులోకే రావడం లేదు. బయటికొస్తే నరకయాతనలు తప్పవన్న భయంతో స్త్రీలు నాలుగ్గోడల్లోపలే బందీలైతే దేశార్థికం ఎలా పురోగమిస్తుంది?
మస్తిష్కాల్లో బోలెడంత కుళ్లు నిండినప్పుడు చట్టాల చింతబరికె పుచ్చుకున్నా సరైన ప్రయోజనం ఉండదు. అందుకే స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే దేశంలో మహిళలపై దుర్మార్గాలు ఆగడం లేదు. స్త్రీలకు భద్రమైన వాతావరణం నెలకొనాలంటే ‘వాడికేంటి, మగమహారాజు’ అన్న భావనను ఇంటి నుంచే చెరిపేయాలి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, స్త్రీలకూ అన్నింటా సమాన హక్కులుంటాయని తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే మగపిల్లలకు నూరిపోయాలి. విద్యాలయాల్లో నైతిక చదువులకు ప్రాధాన్యమివ్వాలి. దాంతో పాటు అంతర్జాలం, ఓటీటీల్లో పొంగిపొర్లుతున్న అశ్లీల దృశ్యాల వరదకు అడ్డుకట్ట వేయాలి. స్త్రీలు, బాలికలపై దారుణాలకు పాల్పడుతున్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూడాలి. స్త్రీల అభ్యున్నతి గురించి మాటలతో సరిపెట్టకుండా లింగ వివక్షను రూపుమాపడానికి ప్రభుత్వాలు నిజంగా రంగంలోకి దిగాలి.

వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తగినంతగా తీసుకోవాలి. సమతులాహారం దక్కాలంటే కొంచెం ఎక్కువగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఆహారంపై ఖర్చు విషయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా అసమానతలు నెలకొన్నాయి. 2023లో ఇళ్లల్లో వినియోగం కోసం కొని తెచ్చుకున్న ఆహారం పరంగా ఆయా దేశాల్లో ఒక్కో వ్యక్తికి అయిన సగటు వ్యయం... (డాలర్లలో)

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.