Gruha Jyothi: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకూ గృహజ్యోతి

Eenadu icon
By Telangana News Desk Published : 04 Jan 2026 04:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి, కొత్తగా రేషన్‌కార్డులు వచ్చినవారికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొత్తగా పథకం అమలుకు, మార్పులు చేర్పుల కోసం పురపాలక, ఎంపీడీవో కార్యాలయాల్లోని ప్రజాపాలన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 52.82 లక్షల నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా లబ్ధి చేకూరుతోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.3,593 కోట్లకుపైగా చెల్లించిందని వివరించారు. నిబంధనల మేరకు 200 యూనిట్ల వరకే పథకాన్ని అమలు చేస్తామని.. అంతకు మించితే రాదని స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సైతం 200లోపు యూనిట్లు వాడితేనే పథకం వర్తిస్తుందన్నారు. శాసనసభలో శనివారం గృహజ్యోతిపై సభ్యులు వంశీకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, నాగరాజు, కవ్వంపల్లి సత్యనారాయణ, దానం నాగేందర్‌ తదితరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా మొత్తం 52,82,498 కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో 65,862... సిద్దిపేటలో 50,398 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి’’ అని భట్టి తెలిపారు. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... గృహజ్యోతిలో 200 దాటి 10-15 యూనిట్లు ఎక్కువైతే మొత్తం యూనిట్లకు బిల్లులు వసూలు చేస్తున్నారని, కొన్నిచోట్ల పథకం నుంచి తొలగిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. 

అందెశ్రీని గౌరవించుకోవడం మన బాధ్యత

ప్రసిద్ధ కవి, ప్రజా కళాకారుడు అందెశ్రీని గౌరవించుకోవడం మన బాధ్యతని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందెశ్రీ కుమారుడు దత్తసాయికి సహాయ ఆచార్యుడిగా ప్రభుత్వ ఉద్యోగ కల్పన, 7,991 మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ‘తెలంగాణ పబ్లిక్‌ సర్వీసులకు నియామకాల క్రమబద్ధీకరణ, సర్వీసులకు నియామకాల క్రమబద్ధీకరణ- వేతన స్వరూపం హేతుబద్ధీకరణ’ తదితర బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులకు చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. అందెశ్రీ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన కుమారుడికి ఉద్యోగం కల్పించాం. అలాగే గద్దర్‌ త్యాగాలను గుర్తించి ఆయన పేరిట అవార్డును ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. అనంతరం ఒప్పంద, పొరుగు సేవల బిల్లుపై మాట్లాడుతూ.. జూనియర్‌ అసిస్టెంట్లు, డ్రైవర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు కలిపి 7,991 మందికి ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసేందుకు చట్ట సవరణ చేస్తున్నాం. దీనివల్ల ఖజానాపై ఏటా రూ.2,295 కోట్ల భారం పడుతుంది’ అని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు మందుల సామేల్, శంకరయ్య, కంభంపాటి అనిల్‌కుమార్‌రెడ్డి బిల్లులకు మద్దతు తెలిపారు. 

భాజపా సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘అందెశ్రీ కుమారుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని సమర్థిస్తున్నాం. 2001-14 మధ్య తెలంగాణ కోసం 1,200 మంది అమరులయ్యారు. వారి రుణం తీర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా వారి కుటుంబసభ్యులకు 250 గజాల ఇంటిస్థలం, కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి’ అని అన్నారు. పాల్వాయి హరీశ్‌ మాట్లాడుతూ.. ఉద్యమంలో ఆడిపాడిన 400 మంది సాంస్కృతిక సారథి కళాకారులకు ఉద్యోగాలు కల్పించి భరోసా ఇవ్వాలని కోరారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :