Encounters: భారీ ఎన్‌కౌంటర్‌

Eenadu icon
By Telangana News Desk Published : 04 Jan 2026 04:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ డివిజన్‌లోని సుక్మా, బీజాపుర్‌ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నాయకుడు, కుంట ఏరియా కమిటీ కార్యదర్శి  సచిన్‌ మంగడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలోని కిష్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) బృందాలు పెద్దఎత్తున ఆ ప్రాంతానికి ఆపరేషన్‌ కోసం వెళ్లాయి. ఈ క్రమంలో  శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి. అందులో ఐదుగురు మహిళా మావోయిస్టులున్నారు. ఏకే-47లు, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్‌లతోపాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కుంట డీవీసీఎం సచిన్‌ మంగడు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ బీజాపుర్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో ఐఈడీ పేల్చి కుంట ఏఎస్పీ ఆకాశరావు గిరిపుంజే మరణానికి కారకులైన మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు ఆయన చెప్పారు. కిష్టారం, కుంట ఏరియా కమిటీలో చురుగ్గా పని చేసే 4, 8 ప్లాటూన్లకు చెందిన కీలక మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. 

మరో ఘటనలో..

బీజాపుర్‌ జిల్లా బాసగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గగన్‌పల్లి-ముర్కిపార్‌ అడవుల్లో తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిని పామేడు ఏరియా కమిటీ సభ్యుడు హుంగా మడకం ఎలియాస్‌ పంచుగ, పార్టీ ప్లాటూన్‌ కమిటీ సభ్యురాలు ఐతి ముచాకి ఎలియాస్‌ జోగిగా గుర్తించారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :